Oct 05,2022 09:40
  • 1500 మందితో భారీ బందోబస్తు

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి/హొళగుంద : కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో బన్ని ఉత్సవంలో భాగంగా ఏటా విజయదశమి రోజున అర్ధరాత్రి కర్రల సమరం నిర్వహిస్తారు. దేవరగట్టు కొండ ప్రాంతంలోని 11 గ్రామాల ప్రజలు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఉత్సవమూర్తుల కోసం వేలాది మంది కర్రల సమరానికి సై అంటారు. దసరా పండగ రోజు అర్ధరాత్రి కొండపై ఉన్న మాలమల్లేశ్వస్వామికి కల్యాణం జరుగుతుంది. అనంతరం మాల సహిత మల్లేశ్వరస్వామి విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా తీసుకెళ్తారు. నెరణికి, నెరణికి తండా, కొత్తపేటకు చెందిన మూడు గ్రామాల ప్రజలు ఆ విగ్రహాలకు రక్షణగా నిలుస్తారు. ఒక గ్రూపు వారు విగ్రహాల్ని తీసుకువెళ్తుంటే మరో గ్రూపు వారు వారిని ఆపే ప్రయత్నం చేస్తారు. ఇలా రెండు గ్రూపుల మధ్య కర్రల సమరం నడుస్తుంది. అనంతరం విగ్రహాలను తిరిగి దేవరగట్టు మీద ఉంచడంతో ఉత్సవం పూర్తవుతుంది. ఈ సందర్భంగా జరిగే కర్రల సమరంలో వందలాది మంది తలలు పగులుతుంటాయి. కర్రలతో కొట్టుకోకుండా ఉత్సవం జరుపుకోవాలని అధికారులు ఏటా ఆయా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా రక్తపాతం షరా మామూలైంది. 2020లో వంద మందికి, గతేడాది 97 మందికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున జనం చేరుకుంటుండడంతో నివారించలేకపోతున్నామని పోలీసులు చెప్తున్నారు. కర్రల సమరానికి దేవరగట్టు ఈసారి కూడా సిద్ధమైనట్లు సమాచారం. దీన్ని ఆపేందుకు అధికారులు, పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. 11 గ్రామాల్లో పోలీసులు సోదాలు నిర్వహించి ఇప్పటి వరకూ 670 రింగు కర్రలను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. బయటి నుంచి వచ్చే వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కొండ చుట్టుపక్కల గ్రామాలు, రోడ్లలో కూడా పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ఏటా ఎన్ని భద్రతా ఏర్పాట్లు చేసినా కర్రల సమరాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు. ఈసారైనా రక్తపాతం ఆగుతుందో లేదో వేచి చూడాల్సిందే..

 

inspector


                                                                              ప్రజలు సహకరించాలి

ప్రజలంతా సహ కరించాల. బన్ని వేడుకల్లో కర్రలతో కొట్టుకోవద్దు. 1500 మంది పోలీసులతో బందోబస్తు, పది ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశాం. ప్రశాంతంగా బన్ని ఉత్సవం సాగేందుకు చర్యలు చేపడుతున్నాం.
                                                                  - ఈశ్వరయ్య, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌, ఆలూరు