
-'విజయనగర్ బయోటెక్' పై సిహెచ్.నర్సింగరావు ఆగ్రహం
ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి :లైంగిక వేధింపులపై నిలదీసిన మహిళా కార్మికురాలిని విజయనగర్ బయోటెక్ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించడం అన్యాయమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు అన్నారు. ఆమెను వారం రోజుల్లో విధుల్లోకి తీసుకోకపోతే యాజమాన్యం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అక్రమంగా తొలగించిన ఇనకోటి పార్వతిని బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పూసపాటిరేగ మండలం కొత్తకొప్పెర్లలోని బయోటెక్ కంపెనీ ఎదుట సిఐటియు, ప్రజాసంఘాల ఆధ్వర్యాన శుక్రవారం జరిగిన ధర్నాలో నర్సింగరావు మాట్లాడారు. లైంగిక వేధింపులకు పాల్పడిన హెచ్ఆర్ మేనేజర్ విఘ్నేష్‌కు యాజమాన్యం వత్తాసు పలుకుతూ బాధితురాలిని విధుల నుంచి తొలగించడం అన్యాయమన్నారు. ఈ కంపెనీ ఏర్పాటుకు పార్వతి కుటుంబం సుమారు ఎనిమిది ఎకరాల భూమి త్యాగం చేసిందని, ఆ ఒప్పందంలో భాగంగానే ఆమెకు సుమారు 16 ఏళ్ల క్రితం ఉద్యోగం కల్పించారని గుర్తు చేశారు. విఘ్నేష్ వేధింపులు తట్టుకోలేక యాజమాన్యానికి ఏడాదిన్నర క్రితం పార్వతి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో, ఆమె దిశ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిందని తెలిపారు. ఆమెను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని జెసిఎల్ ఆదేశించినా యాజమాన్యం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. పరిశ్రమ కోసం భూములు త్యాగం చేసిన వారికి యాజమాన్యం చేసిన న్యాయం ఇదేనా? అని ప్రశ్నించారు. బాధితురాలు పార్వతి మాట్లాడుతూ తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వి.రమణ, నాయకులు బి.సూర్యనారాయణ, మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్, ఐద్వా, ఆశా వర్కర్స్ యూనియన్, ఎస్ఎఫ్ఐ, మైలాన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.