Aug 06,2022 06:48

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, అథ్లెటిక్స్‌లో పాల్గొని దేశానికి, వారి ప్రాంతానికి, తాను పనిచేస్తున్న విభాగానికి కీర్తిని తెచ్చిపెట్టారు చెన్నరుకి చెందిన మహిళా పోలీస్‌ ఆర్‌.ప్రమీల. నెదర్లాండ్స్‌లో జరిగిన వరల్డ్‌ పోలీస్‌ అండ్‌ ఫైర్‌ గేమ్స్‌ 2022 (డబ్ల్యుపిఎఫ్‌జి)లో మూడు బంగారు పతకాలు, ఒక రజత పతకం సాధించి భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. 2005 బ్యాచ్‌కి చెందిన ప్రమీల అన్నానగర్‌ ట్రాఫిక్‌ విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.
ఈ గెలుపు కోసం ప్రమీల రెండేళ్లుగా కష్టపడ్డారు. సుదీర్ఘమైన పని గంటలు ముగిసిన తర్వాత ఆమె ప్రాక్టీస్‌ చేయడానికి గ్రౌండ్‌కి వెళ్లేవారు. సీనియర్‌ అధికారులు ప్రమీలను ఎంతో ప్రోత్సహించారు. ఆర్థిక సహాయమూ అందించారు. వారందరి సహకారం, ప్రోత్సాహంతో కఠోర సాధన చేసి 70 దేశాల ఆటగాళ్లను ఓడించారు. రోటర్‌డామ్‌లో జరిగిన డబ్ల్యుపిఎఫ్‌జిలో 63 విభిన్న ఈవెంట్లలో పదివేల కంటే ఎక్కువమంది ఆటగాళ్లు పాల్గొన్నారు.
ప్రమీల 100 మీటర్లు, 400 మీటర్ల పరుగుపందేలు, లాంగ్‌ జంప్‌లో మూడు స్వర్ణాలు, 200 మీటర్ల పరుగులో రజతం సాధించారు. ''రన్నింగ్‌ నన్ను ఉత్తేజపరుస్తుంది. చదువుకునే రోజుల నుంచే నేను అథ్లెటిక్స్‌లో పోటీ పడుతున్నాను. అధిక పనిభారం ఉన్నప్పటికీ, సీనియర్‌ అధికారులు నాకు ప్రాక్టీస్‌ కోసం సమయం కేటాయించడంలో సహాయం చేశారు. మా రిటర్నింగ్‌ అధికారి శక్తివేల్‌ ప్రయాణ ఖర్చులు, ప్రవేశ రుసుముకు డబ్బు ఏర్పాటు చేశారు. ఈ విజయం సాధించడంలో వారి సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను'' అంటున్నారు ప్రమీల.
విమాన టిక్కెట్లు, ఎంట్రీ ఫీజు చెల్లించేందుకు ప్రమీలకు మే నెలలో రూ.1.5 లక్షలు అవసరమైంది. శక్తివేల్‌ రిటైర్డ్‌ అధికారులను సంప్రదించి డబ్బు ఏర్పాటు చేశారు. ''దేశం కోసం పతకాలు సాధించాలనే తపన ఉన్న సిబ్బందిని చూడటం చాలా అరుదు. ప్రమీల ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 50 పతకాలు సాధించి తన సత్తా నిరూపించుకుంది. ప్రమీల మా విభాగంలో ఉన్నందుకు మేమంతా సంతోషిస్తున్నాం. డిపార్ట్‌మెంట్‌ మాత్రమే కాదు, దేశం మొత్తం గర్వించేలా చేసింది'' అంటున్నారు శక్తివేల్‌. ప్రమీల తదుపరి డబ్ల్యుపిఎఫ్‌జి గేమ్స్‌లో విజయ పరంపరను కొనసాగించాలని భావిస్తోంది.