
ప్రజాశక్తి-పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : ఏజెన్సీలో అల్లం ధరకు రెక్కలు వచ్చాయి. రిటైల్ మార్కెట్లో ప్రస్తుతం కిలో అల్లం రూ.220లకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. అల్లం ధర అమాంతంగా పెరిగే సరికి వినియోగదారులు విస్తు పోతున్నారు. ఏజెన్సీ మార్కెట్లలో విరివిగా చౌకగా దొరికే అల్లం ధర నాలుగింతలు రెట్టింపు అయ్యేసరికి రిటైల్ మార్కెట్ వ్యాపారుల తీరుపై వినియోగదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ అల్లం పంటకు ఎంతో ప్రసిద్ధి. సాధారణంగా ఇక్కడ గిరిజన రైతులు పండించే ఈ అల్లం ఈ ప్రాంతంలో తక్కువ ధరకే లభిస్తుంది. మైదాన ప్రాంతాల మార్కెట్లతో పోలిస్తే అల్లం ధర ఎప్పుడు చాలా చౌకగానే ఉంటుంది. ఈ ఏడాది ఆరంభంలో జనవరి నుంచి ఓ రెండు నెలల పాటు రిటైల్ మార్కెట్లో కిలో అల్లం 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు లభ్యమయింది. ఉన్నట్టుండి ఈ నెలలో అల్లం ధర భారీగా పెరిగింది. సాధారణంగా మన్య ప్రాంతంలో వ్యాపారులు భారీగా అల్లం కొనుగోలు చేసి మైదాన ప్రాంతాల్లోని మార్కెట్లకు ఎగుమతి చేస్తూ లాభసాటి గా వ్యాపారం చేస్తుంటారు. అల్లం ఈ ప్రాంతంలో చౌకగా లభించడమే ఇందుకు కారణం. ఏజెన్సీ వారపు సంతల్లో వ్యాపారులు తప్పనిసరిగా అల్లం కొనుగోళ్లు పెద్ద ఎత్తున చేస్తుంటారు. ఏజెన్సీలో గిరిజన రైతులకు కోల్డ్ స్టోరేజీలు వంటివి అందుబాటులో లేకపోవడంతో అల్లం పండించే రైతులు మాత్రం పెద్దగా లాభాలు ఆర్జించిన పరిస్థితులు మాత్రం ఎప్పుడూ కానరావు. ఏజెన్సీ సంతలు మార్కెట్లో అమ్మకాలు కొనుగోళ్లపై ఎటువంటి అధికారుల నిఘా లేకపోవడంతో ధరలకు కళ్లెం వేసే పరిస్థితి కానరాలేదు. ఎన్నడూ లేని విధంగా అల్లం ధర కిలో 2.20 రూపాయలు ధర ఉండడం మాత్రం వినియోగదారులను అమ్మో అనిపిస్తుంది.