
ఇంటి ముందు చుక్కలు పెట్టి వేసే ముగ్గు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. చుక్కలతో ముడిపడి గీసే కళాఖండాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. యాష్ సుందరం అటువంటి వృత్తం ఆకారంతో ముడిపడిన కళారూపాలు సృష్టించడంలో దిట్ట. ఇవి చూడటానికి ఎంతో అద్భుతంగా ఉండి, ఇంటికి శోభనిస్తాయి. పాత వస్తువులకే అందాన్ని తీసుకొస్తాయి. అందులోనూ చుక్కల పరిమాణాలు మార్చుతూ యష్ అనేక కళారూపాలను గీశారు. అనారోగ్య సమస్య నుంచి బయట పడేందుకు మొదలుపెట్టిన ఈ కళలో ఆమె నైపుణ్యం సాధించారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే ఈ కళపై అభిరుచి పెంచుకున్నారు. వీటిని చూసి నెటిజెన్స్ ఫిదా అయ్యి కొనుగోలు చేస్తున్నారు.

తమిళనాడుకు చెందిన యష్ సుందరం పదేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. ఆమెకు అన్ని రకాల వంటలూ వచ్చు. దాంతో ఓ యూట్యూబ్ ఛానలే నడుపుతున్నారు. రోజుకో కొత్తరకం వంట చేసి బ్లాగ్‌లో ఉంచుతారు. అంతేకాదు; వివిధ ఫుడ్ మ్యాగజైన్‌లకు అనేక వ్యాసాలు రాశారు. తమిళంలో ఓ వంటల పుస్తకమే రచించారు. ఓ వైపు వంటలు చేస్తూనే స్థానిక ప్రభుత్వ పాఠశాల్లో వాలంటీర్‌గా 8 ఏళ్లుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం యాష్‌కు మడమ వ్యాధి వచ్చింది. దీన్ని నుంచి బయటపడేందుకు డాట్ మండల కళారూపాలపై దృష్టి కేంద్రీకరించారు. సంప్రదాయాల్లో సర్కిల్స్‌కు చాలా శక్తివంతమైన ప్రాముఖ్యత ఉంది. దీనికి ప్రారంభం ఉంటుంది గానీ ముగింపు ఉండదు. అటువంటి కేంద్ర బిందువు నుంచి డాట్ మండలాలను సృష్టించారు. విశ్వంలో ఉన్న అనేక చుక్కలను తన పెయింటింగ్‌లో చొప్పించేలా ఆకర్షణీయ రూపాన్ని తీసుకొచ్చారు.
ఇంట్లో ఉండే సాధనాలతో..
ఈ రకమైన పెయింటింగ్‌లో వృత్తాలే ప్రధానం. చిన్న, పెద్ద వృత్తాలను గమ్మత్తైన జ్యామితిలో పొందుపరచాలి. చివర్లో వృత్తాలతో ముగించకుండా సృజనాత్మకంగా వంపు తిరిగిన కామాలు, ఆశ్చర్యర్థాకాలను చేర్చారు. దాంతో పెయిటింగ్ ప్రత్యేక ఆకృతిని సంతరించుకుం టుంది. వీటిని వేసేందుకు యాష్ యాక్రిలిక్ కలర్స్‌తో పాటు కొన్ని విభిన్న కలర్స్ ఎంచుకున్నారు. పెద్ద, చిన్న, మీడియం చుక్కల పరిమాణాన్ని సులభతరం చేసేలా టూత్‌పిక్‌లు, కాటన్ ఇయర్ బడ్స్, కాజల్ పెన్, ఫ్లాట్ టిప్, ఆఫ్ లిప్ బామ్ స్టిక్ సాధనాలు ఉపయోగించారు. స్వీయంగా సృజనాత్మకంగా డిజైన్లు వేశారు. ఒకేసారి రెండు బ్రెష్‌లతో పెద్ద కాన్వాస్‌పై పని చేస్తున్నప్పుడు మాత్రమే ఆమె కొంత కసరత్తు చేసేది. కొత్తవైనా, పాతవైనా వస్తువులు మరింత ఆకర్షణీయంగా ఉండేలా యాష్ ఈ వృత్తాల కళారూపాలు వేశారు. ఇవి చాలా కాలం ఉండేలా రంగుల్లో వార్నిష్, రెసిన్ ద్రవాలను కలిపేవారు. దాంతో దుమ్ము, తేమ, మచ్చలు పడకుండా పెయింటింగ్ శాశ్వతంగా ఉంటుంది. అంతేకాదు చక్కని మెరుపును ఇస్తాయి. ఈ కళారూపాలను కాన్వాస్‌లపై, బాటిల్స్‌పై, చెక్క వస్తువులపై, గాజు, కార్డ్‌బోర్డ్‌లపై వేశారు. కొన్ని నెలలకే కష్టమైన కళాకృతులను సైతం సులభంగా వేయగల నైపుణ్యం సంపాదించారు.

ఉపాధి మార్గంగా
యాష్ వేసిన ఈ పెయింటింగ్స్ మొత్తం తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా విశేష స్పందన వచ్చింది. తమకు ఇటువంటి కళారూపాలు కావాలంటూ స్నేహితులు, సన్నిహితుల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. దాంతో ఆమె దీన్ని ఉపాధిగా మలుచుకుంది. వినియోగదారులు కోరిన విధమైన గుర్రం, ఏనుగు, పులి, చెట్లు ..వంటి బొమ్మలు కచ్చితమైన సైజుల్లో ఆకారం వేసుకుని పెయింటింగ్ చేశారు. రోజూ చూసే గడియారానికి చుట్టూ అందమైన డిజైన్ వేసి ఇస్తున్నారు. దాంతో ఉపాధితో పాటు మానసికానందం పొందుతున్నారు ఆమె.
కానీ, ఇందులోనూ సవాళ్లు ఎదుర్కొన్నారు. క్లయింట్ కోరిన విధంగా రంగులు వేయాలి. వేసిన తర్వాత చూసేందుకు బాగోపోతే పడిన శ్రమంతా వృధా. అయినా క్లయింట్ అడిగిన విధంగానే యాష్ పెయింటింగ్ చేసి ఇచ్చేవారు. మొదట్లో గుర్రం బొమ్మ తయారీ కష్టంగా అనిపించింది. అప్పుడు ఆమె బొమ్మ జ్యామితిలో వృత్తాలు చెడకుండా రూపురేఖలను పొందుపరిచింది. అది చూసిన క్లయింట్ ఆనందంతో ఎక్కువ డబ్బు ఇచ్చి కొనుగోలు చేశారు. ఒక్కో పెయింటింగ్ ఆమెకు వారం నుంచి తొమ్మిది రోజులు పడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం రాకపోయినా ఆమె ఈ కళను అభిరుచిగా కొనసాగిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా వర్క్‌షాపులు నిర్వహిస్తూ, ఔత్సాహికులకు ఈ కళలో శిక్షణ ఇస్తున్నారు.
ఒత్తిడి తగ్గించేలా ...
క్రమంగా యష్ చేసిన ఈ డాట్ మండల కళాఖండాలు ధ్యానం యొక్క చిహ్నంగా మారాయి. మానసిక రోగుల్లో దృష్టిని పెంపొందించడం, ఆందోళన, ఒత్తిడి తగ్గించే కళారూపాలుగా అక్కడక్కడ ఏర్పరచారు. ధ్యానం/ కర్ణాటక సంగీత ప్రదేశాల్లో మంచి వాతావరణం సృష్టించేలా ఉన్నాయి. కొత్తగా ఇల్లు కట్టుకున్న వారు, గదుల్లో, లివింగ్ రూమ్, బెడ్‌రూమ్‌ల్లో ఈ పెయింటింగ్స్ అమర్చుకుంటున్నారు.