Jan 30,2023 10:24

పిల్లలు చాలా సున్నిత మనస్కులు. బాల్యంలో వారి లేత మనసులపై ఏది అయితే ముద్ర పడుతుందో అదే నిజం అని నమ్ముతారు. చాలా మంది తమకు ఎదురైన సంఘటనని, హింసను బయటకు చెప్పేందుకు భయపడతారు. కొంతమంది అసలు మాట్లాడారు. మరి కొంతమంది బాగా అల్లరి చేస్తారు. అలాంటి వారి కోసం ఈ తోలుబొమ్మల కథలు వినిపిస్తున్నారు ఓపెన్‌ హౌస్‌ టీం సభ్యులు. పిల్లలు నివాసం ఉన్న ప్రతిచోటా ప్రదర్శన రూపంలో చైతన్యవంతమైన కథలను వివరిస్తున్నారు.

చెన్నైకు చెందిన కొంతమంది యువకులు ఏడేళ్ల క్రితం 'ఓపెన్‌ హౌస్‌' బృందంగా ఏర్పడ్డారు. దీని ద్వారా పిల్లలకు మైమ్‌, నాటకం వేయడం నేర్పిస్తున్నారు. ఇతర కళారూపాల ద్వారా కథలు చెప్పడం, రాయడం, తోలుబొమ్మల తయారీ వాటిపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. ఇది ఎవరైనా చేరగల కళాత్మక సంఘం. వివిధ కళల్లో అనుభవం ఉన్న విద్యార్థులంతా కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం చూసి, పలువురు తల్లిదండ్రులు వారిని అభినందిస్తున్నారు.
         ఓపెన్‌ హౌస్‌లో దీపక్‌, అయ్యప్పన్‌, యువీ, కాక్స్టన్‌, అబ్బాస్‌, కార్తీక్‌, యువశ్రీ, కళ ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ముగ్గురు, నలుగురు తెర వెనుక తోలుబొమ్మలను కదిలిస్తూ ఉంటారు. ఒకరు కథను వివరిస్తాడు. కొన్నిసార్లు కథలో ఎక్కువ పాత్రలు ఉన్నప్పుడు మిగిలిన సభ్యులూ పాల్గొంటారు. ఈ ప్రదర్శనలకు ఎటువంటి డబ్బు ఆశించకుండా నగరంలో అన్ని పాఠశాలలకు తిరుగుతున్నారు. పిల్లల కోసం వీరు చేస్తున్న ప్రయత్నాన్ని గుర్తించి కొంతమంది దాతలు వీరికి ప్రయాణపు ఖర్చులు, ఆహార సదుపాయం కల్పిస్తున్నారు.
పూర్వం పరిపాలకులుగా ఉన్న పాండ్యులు, చోళల చారిత్రక గాధలను తోలుబొమ్మల ద్వారా పిల్లలకు చెబుతున్నారు. పిల్లలు ఎంతో శ్రద్ధతో బొమ్మలను చూస్తూ ఆ కథలను వింటున్నారు. రెండు రోజుల పాటు వినిపించే ఈ నాటకాన్ని తోలుబొమ్మల ద్వారా గంటలో షాట్‌ చేసి చూపిస్తున్నారు. 'పిల్లలలో జీవన నైపుణ్యాలను పెంపొందించడం, ప్రశ్నించేతత్వాన్ని పెంచటం, స్కిట్‌లు వేయించడం, కథలు చెప్పడం ద్వారా పిల్లల్లో తమపై తమకు నమ్మకం ఏర్పడుతుంది. భావ వ్యక్తీకరణ పెరుగుతుంది. పిల్లల భావాలను మనం అర్థం చేసుకున్నప్పుడే వారు మనతో మనసువిప్పి మాట్లాడతారు' అని సభ్యుల్లో ఒకరైన సీత అంటోంది.
        ఈ సభ్యులు ప్రతి ఆదివారం ఏదో ఒక స్కూల్లో, పిల్లలు ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుని తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరి ఇచ్చిన శిక్షణ ఆలంబనగా మేదవాక్కం ప్రాంతానికి చెందిన కొంతమంది పిల్లలు స్వయంగా కథలు చెబుతున్నారు. కథకు తగ్గట్టుగా తోలుబొమ్మలు తయారుచేస్తున్నారు. స్వయంగా నాటికలూ రాస్తున్నారు.
     ప్రయివేటు స్కూల్లో కొన్ని వారాల పాటు నిర్వహించిన తోలుబొమ్మల ప్రదర్శన తర్వాత పిల్లల అభిప్రాయాలు తెలుసుకున్నారు. నేర్చుకోవటానికి తాము చాలా సంబరపడుతున్నామని పిల్లలు చెప్పారు. ఇంటికి వెళ్లి ఆ కథల గురించి అమ్మానాన్నలతో చర్చిస్తున్నామని చెప్పారు. ఈ శిక్షణ తరువాత పిల్లలు క్లాసు రూంలో చురుకుగా ఉంటున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.