Sep 19,2023 14:42

ఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ మహిళా రిజర్వేషన్‌ బిల్లు మంగళవారం లోక్‌సభ ముందుకొచ్చింది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ నేడు దిగువ సభలో ప్రవేశపెట్టారు. సెప్టెంబరు 20 (బుధవారం) నుంచి లోక్‌సభలో దీనిపై చర్చ జరగనుంది. ఆ తర్వాత ఓటింగ్‌ నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. ఇక, రాజ్యసభలో ఈ బిల్లును సెప్టెంబరు 21వ తేదీన ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బిల్లు కాపీలను తమకు ఎందుకు ఇవ్వలేదని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అయితే డిజిటల్‌ ఫార్మాట్‌లో అప్‌మలోడ్‌ చేశామని కేంద్రం బదులిచ్చింది. ఈ బిల్లు కోసం 128 రాజ్యంగ సవరణ చేయనుంది కేంద్రం. బిల్లు పాసైతే పార్లమెంట్‌, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు లభించనున్నాయి. 15 ఏళ్ల పాటు ఈ మహిళా రిజర్వేషన్లు బిల్లు అమల్లో ఉండనుంది.
లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. బుధవారం ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభం కానుంది. సభ్యులు మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చించనున్నారు. బిల్లు గురించి మోదీ మాట్లాడుతూ.. 'నారీ శక్తి వందన్‌ అధినియం' మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. సెప్టెంబర్‌ 19 చరిత్రలో నిలిచిపోయే రోజని పేర్కొన్నారు. ముప్పై ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఈ బిల్లుకు విపక్షాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని ప్రధాని కోరారు.