Mar 18,2023 06:55

ఓ సన్‌జో సేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించే ఆశ్రమంలో చికిత్స పొందిన ఆ యువకుడు అక్కడి దివ్యాంగులైన అనాథలను చూసి చలించి పోయాడు. వారి సేవకే తన జీవితాన్ని అంకితం చేశాడు. వయస్సు మీద పడినా వారికి వంట చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తనకు వచ్చిన కళతో ఉచితంగా కొయ్య బొమ్మలు తయారీ చేసి పలువురికి అందిస్తున్నారు. అతనే ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంకు చెందిన సుబ్రహ్మణ్యం.

సన్‌జో సేవాలయం ఆధ్వర్యంలో అనాథ ఆశ్రమంలో రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన అనాథలున్నారు. వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నాయి. మతిస్థిమితం కోల్పోయినవారు, వృద్ధులూ ఉన్నారు. రక్త సంబంధీకుల ప్రేమానురాగాలు లేని వారిని చూసిన సుబ్రమణ్యంకు జాలి వేసింది. వారి ధీనగాధలను తెలుసుకుని హృదయం చలించింది. వారందరినీ తనవాళ్లగా భావించాడు. తనకు చేతనైన వంట చేసి, ఆత్మీయుడయ్యాడు.

1


చెన్నైలోని వేలూరుకు చెందిన సుబ్రహ్మణ్యం యుక్త వయస్సులో మద్యం, సిగరెట్లకు బానిసయ్యాడు. తండ్రి ఉద్యోగ రీత్యా కుటుంబం హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడ కూడా సుబ్రహ్మణ్యం మత్తుపదార్థాలకు అలవాటవ్వడంతో ఇంట్లో వారు వదిలేశారు. ఓ రోజు టీ దుకాణం ముందు సిగరెట్‌ కాలుస్తుండగా నిప్పు ఒంటిపై పడి దుస్తులు అంటుకుని ఒళ్లంతా కాలిపోయింది. శరీరంలో అక్కడక్కడ గాయాలతో పడి ఉండగా ఓ సిస్టర్‌ చూసింది. చర్చి ఆధ్వర్యంలో నిర్వహించే ఆశ్రమంకు తీసుకెళ్లి, చికిత్సలు అందించింది. అక్కడ ఉండే వారంతా అనాథలు, దివ్యాంగులు. కోలుకున్న ఆయన అక్కడ ఉండే మానసిక దివ్యాంగులకు సేవ చేయాలని సంకల్పించాడు. అప్పటి నుంచే వారికి సేవలు చూస్తూ ఉండిపోయాడు.
యువకుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌లో ఒక రోజు కొయ్య బొమ్మలు తయారు చేసే వ్యక్తిని బాగా గమనించాడు. అతని పనితీరు చూసి, తానూ కొయ్యలు తీసుకుని కొడవలితో బొమ్మను తయారు చేసేందుకు ప్రయత్నించాడు. తను నిత్యం చూసే చర్చిని చెక్కముక్కలతో చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అప్పటి నుంచీ కొయ్య బొమ్మల తయారీలో ప్రావీణ్యం సంపాదించారు. సృజనాత్మకంగా బొమ్మలు చేయడం ప్రారంభించాడు. ఆయన ఈ పనిలో ఏకాగ్రత పెట్టడంతో మద్యం, మత్తు వ్యసనాలకు నెమ్మదిగా దూరమయ్యాడు.

  • వంట చేస్తూనే...

దేవుళ్ల బొమ్మలతో పాటూ ఇంట్లో అలంకరణకు వివిధ బొమ్మలు తయారు చేసి ఇచ్చేవాడు. కరోనా సమయంలో హైదరాబాద్‌ నుంచి యర్రగొండపాలెంలోని సన్‌జో సేవాలయానికి వచ్చారు. ఇక్కడ ఉండే 20 మంది మానసిక వికలాంగులకు వంట చేసి పెడుతున్నాడు. దాతలు ఇచ్చిన నిత్యవసర సరుకులను వంట గదిలో భద్రపరుస్తూ, రోజుకొక ఆహారం వండి పెడుతున్నాడు. పాయసం, దద్దోజనం, పులిహోర, పప్పు, సాంబారు, మాంసం, చేపలు, రొయ్యలు ఫ్రై చేసి పెడుతున్నాడు. వారంతరాల్లో చికెన్‌ బిర్యాని, వెజ్‌ బిర్యాని వండి పెడుతున్నాడు. అందరూ కడుపు నిండా తిన్న తరువాతే తాను తింటూ అందరికీ బంధువయ్యాడు.

2
  • ఆకట్టుకునేలా..

గ్యాస్‌ సౌకర్యం లేకపోవడంతో కట్టెపొయ్యిల మీద అప్పుడప్పుడు వంట చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో దగ్గర్లో ఉన్న ఓ కొయ్యల కట్టింగ్‌ మిషన్‌ దగ్గరకు సుబ్రమణ్యం వెళుతున్నాడు. పనికిరాని, పక్కన పడేసిన టేకు, మామిడి, తుమ్మ చెట్ల చెక్క ముక్కలు, చిన్న చిన్న కొయ్యలు తెస్తాడు. వాటిలో బొమ్మకు ఉపయోగపడే మంచి కొయ్యలను, చెక్కలను వేరు చేసి ఆకర్షణీయ బొమ్మలు తయారుచేస్తున్నాడు. ఇళ్లలో టీవీ, ఫ్రిజ్‌, టేబుల్‌పై ఆకర్షణగా ఉంచే పక్షులు, చేపలు, పడవ బొమ్మలు తయారు చేస్తోన్నాడు. ఏ ఆకారంలో బొమ్మ కావాలో చెబితే అదే ఆకృతిలో బొమ్మ చేయడం అతని ప్రత్యేకత. క్రిస్మస్‌ పండగ సమయాల్లో క్రీస్తు, మేరీ మాత, చర్చి బొమ్మలు చాలానే చేస్తాడు. ఇంటి ముందు ద్వారబంధాలకు అలంకరించే అందమైన రూపాలను చెక్కి ఉచితంగా అందిస్తుంటారడు. డెభ్బై రెండేళ్ల వయస్సులో కూడా అలసిపోకుండా దివ్యాంగులకు సేవ చేస్తూ, రకరకాల బొమ్మలను సుబ్రమణ్యం చేయడం చూసి దాతలు, స్థానికులు అభినందిస్తున్నారు.

3
  • సేవతోనే తృప్తి : సుబ్రహ్మణ్యం, యర్రగొండపాలెం.

అనాథ, మానసిక వికలాంగుల ఆకలి తీర్చడంలోనే నాకు సంతృప్తి ఉంది. ఊపిరి ఉన్నంత వరకు వీరికి సేవ చేస్తాను. ఆశ్రమాన్ని సందర్శించేందుకు వచ్చే దాతలకు నా విజ్ఞప్తి ఒక్కటే. ఇళ్లలో జరుపుకొనే శుభ కార్యక్రమాల్లో మిగిలిపోయిన ఆహార పదార్ధాలను వృధాగా పడేయకుండా అనాథలకు అందించి వారి ఆకలి తీర్చమని కోరుతున్నా. బొమ్మ తయారు చేయడం నాకు సరదా అంతే.

- వలీ సాహెబ్‌, యర్రగొండపాలెం, విలేకరి