
ఇంట్రాడేలో సెన్సెక్స్ భారీ పతనం
తుదకు 135 పాయింట్ల తగ్గుదల
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరో రోజూ కూడా నష్టాలు చవి చూశాయి. ప్రపంచ వృద్థి రేటు పతనం, అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుందన్న విశ్లేషణలు మార్కెట్లకు శరాఘాతంగా మారాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణం ఎగిసిపడటం, ఆర్థిక వ్యవస్థపై అనేక అనుమానాలు తదితర అంశాలు మార్కెట్లపై మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఈ పరిణామాలు వారాంతం సెషన్లోనూ దేశీయ మార్కెట్లను కుదేలు చేశాయి. ఈ వారంలో ఒక్క రోజు కూడా మార్కెట్లు లాభపడలేదు. దీంతో మే 2020 తర్వాత మార్కెట్లకు ఇదే అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన వారంగా నిలిచింది. ఆరు సెషన్లలో మదుపర్లు రూ.14 లక్షల కోట్లపైనే సంపదను నష్టపోయారు.
శుక్రవారం సెషన్లో బిఎస్ఇ సెన్సెక్స్ ఓ దశలో 732 పాయింట్లు పతనమయ్యింది. తుదకు 135 పాయింట్లు లేదా 0.26 శాతం కోల్పోయి 51,360కి పడిపోయింది. ఉదయం 51,181.99 వద్ద ప్రారంభమైన సూచీ ఇంట్రాడేలో 51,652-50,921 మధ్య కదలాడింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 67 పాయింట్లు లేదా 0.44 శాతం తగ్గి 15,294 వద్ద ముగిసింది. నిఫ్టీలో టైటన్ కంపెనీ, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, శ్రీ సిమెంట్, బిపిసిఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఆసియన్ పెయింట్స్ సూచీలు అత్యధికంగా 6 శాతం వరకు నష్టపోయిన వాటిలో ఉన్నాయి. మరోవైపు బజాజ్, కోల్ ఇండియా, జెఎస్డబ్ల్యు స్టీల్, అపోలో హాస్పిటల్స్, ఐటిసి, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ ఇండిస్టీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సూచీలు 0.8 శాతం నుంచి 3 శాతం వరకు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. నిఫ్టీలో ఫార్మా సూచీ అత్యధికంగా 2 శాతం పతనమయ్యింది. బిఎస్ఇలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.9 శాతం చొప్పున తగ్గాయి. వారాంతం సెషన్లో యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో సాగాయి. నిక్కీ 2 శాతం, కెస్పి 0.43 శాతం చొప్పున తగ్గగాజజ హాంగ్‌సెంగ్ 1 శాతం పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం ఏకంగా 75 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటు పెంచింది. ఆ దేశంలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్టానికి చేరింది. భవిష్యత్తులోనూ ధరల కట్టడికి మరిన్ని సార్లు వడ్డీ రేట్లు పెంచాల్సి రావొచ్చన్న ఫెడ్ సంకేతాలు ప్రపంచ మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. వచ్చే వారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని.. రిటైల్ మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.