
- మమల్ని సంప్రదించకుండానే కమిటీ
న్యూఢిల్లీ: పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేసే ముందు తమను సంప్రదిస్తామని హామీ ఇచ్చిన క్రీడాశాఖ ఆ మాటను తుంగలో తొక్కి ఏకపక్షంగా కమిటీని ఏర్పాటు చేసిందని అగ్రశ్రేణి రెజర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వినేశ్ పోగాట్, బజరంగ్ పునియాతో సహా అగ్రశ్రేణి రెజ్లర్లు మంగళవారం ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. మహిళా రెజ్లర్లపై డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షులు బిజ్ర్భూష్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు తామంతా ఆందోళన చేస్తున్న సమయంలో విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీ ఏర్పాటు చేసే ముందు తమతో సంప్రదిస్తామని, కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉండాలో కూడా సంప్రదిస్తామని హామీ ఇచ్చినా, అలా కాకుండా ఏకపక్షంగా ఐదుగురు సభ్యులతో పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసిందని ట్వీట్ చేశారు. ఇది బాధాకరమని విషయమని పేర్కొన్నారు. లైంగిక వేధింపులపై విచారణకు పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేశామని, ఐదుగురి సభ్యులతో కూడిన ఆ బృందానికి ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ సారథ్యం వహిస్తారని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి మరుసటి రోజే అగ్రశ్రేణి రెజ్లర్లు పై విధంగా స్పందించడం చర్చనీయాంశమైంది. కేంద్ర క్రీడాశాఖమంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం ఓ ప్రకటనలో ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కమిటీ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు, బెదిరింపులు, ఆర్ధిక అవకతవకలతోపాటు పరిపాలనా లోపం వంటి అంశాలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయనుందని తెలిపారు. ఆ కమిటీలో మేరీకోమ్తోపాటు యోగేశ్వర్ దత్(రెజ్లింగ్), తృప్తి ముర్గండే(బ్యాడ్మింటన్), కమాండర్ రాజేశ్ రాజగోపాలన్(ద్రోణాచార్య అవార్డు గ్రహీత), రాధిక శ్రీమన్(సారు మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.