Jul 05,2022 12:32

నెల్లూరు : మురుగుకాల్వపై వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ... వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మురుగుకాల్వలో దిగి నిరసన చేపట్టారు. పరిష్కారం వచ్చే వరకు అక్కడి నుండి కదలబోనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దీంతో అధికారులు వచ్చి రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే తన నిరసనను విరమించారు.

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని ఉమ్మారెడ్డి గుంట మురుగు కాల్వ ఉన్న ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని గత కొంతకాలంగా వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాల్వలోకి దిగి కోటంరెడ్డి నిరసన తెలిపారు. ఇప్పుడు తాము అధికారంలో ఉన్నప్పటికీ వంతెన నిర్మాణం జరగలేదని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మరోసారి కాల్వలో దిగి కోటంరెడ్డి నిరసన తెలిపారు.

                                వచ్చే నెల 15లోపు పూర్తిచేస్తాం : అధికారుల రాతపూర్వక హామీ

రైల్వే, నగర కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్షమైనా, అధికారపక్షమైనా సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తానన్నారు. ఎప్పటిలోపు పనుల ప్రారంభిస్తారో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని.. అంతవరకు కాల్వ వద్ద నుంచి కదలబోనని స్పష్టం చేశారు. ఇచ్చిన గడువులోపు సమస్య పరిష్కారం కాకపోతే మురుగునీటిలోనే పడుకుంటానని చెప్పారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు ఈనెల 15న నిర్మాణ పనులు ప్రారంభించి వచ్చే నెల 15లోపు పూర్తిచేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. అనంతరం కోటంరెడ్డి తన నిరసనను విరమించారు.