
ఒక ఆఫీసులో పనిచేసేవారే ఒకరి జీతం మరొకరికి తెలియడానికి ఇష్టపడరు. ఒక డిపార్టుమెంటులో పనిచేసేవారికీ ఇలాంటి రహస్యాలు ఉంటాయి. అలా మన దేశంలో ఎవరెవరి జీతాలు ఎంతనేది నేటికీ రహస్యమే. కానీ, నార్వేలో మాత్రం అలాంటి రహస్యాలేమీ ఉండవు. ఎవరెవరికి ఎంతెంత జీతం అందుతోందనేది ఎవరైనా తెలుసుకోవచ్చు. దీనివల్ల పెద్దగా సమస్యలేమీ రావు కూడా అంటున్నారు.
నార్వేలో 1814వ సంవత్సరం నుంచే ఎవరెంత సంపాదిస్తున్నారు? వారికి ఏమేం ఆస్తులు ఉన్నాయి? ఎంత పన్ను కడుతున్నారు? అనేవన్నీ అందరూ తెలుసుకునే అవకాశం ఉంది. గతంలో ఈ సమాచారాన్ని ఒక పుస్తకంలో రాసి, పబ్లిక్ లైబ్రరీలో పెట్టేవాళ్లు. ఈ సమాచారాన్ని 2001వ సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో కూడా పెడుతున్నారు. చాలా మందికి ఈ సమాచారం తెలుసుకోవటం సరదా అయ్యింది. అలా తెలుసుకున్న సమాచారాన్ని కొందరు ఫేస్‌బుక్‌లో కూడా పెట్టేస్తున్నారు.
నార్వే ప్రజలు ఆదాయపు పన్ను చాలా ఎక్కువగా చెల్లిస్తారు. వాళ్లు సగటున 40.2 శాతం పన్ను కడుతుంటే బ్రిటీష్ ప్రజలు కట్టేది 33.3 శాతం. అంత మొత్తం పన్ను కడుతున్నప్పుడు మిగతావాళ్లు ఏం చేస్తున్నారనేది తెలుసుకోవాలనుకోవటం సహజమే.
జీతాల్లో స్వల్ప తేడాలు..
పన్నుల వ్యవస్థపైన, ప్రభుత్వం చేసే ఖర్చుపైన.. ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలగాలి. అలా జరగాలంటే అంతా పారదర్శకంగా ఉండాలి. ఈర్ష్య, అసూయల వల్ల వచ్చే సమస్యల కంటే ఈ పారదర్శక విధానమే బాగుందని అంతా అంటున్నారు. చాలా ఆఫీసుల్లో ఇతర ఉద్యోగులు ఎంతెంత సంపాదిస్తున్నారో అక్కడ పనిచేసే వాళ్లకి తెలుస్తుంది. పలు రంగాల్లో ఉమ్మడి ఒప్పందాల ద్వారానే జీతాలను నిర్ణయిస్తారు. జీతాల్లో తేడాలనేవి చాలా స్వల్పం. అంతర్జాతీయ ప్రమాణాలను బట్టి చూస్తే స్త్రీ-పురుషుల జీతాల వివక్ష కూడా తక్కువే. ఒకే పనికి సమాన వేతనం విషయంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం 144 దేశాల్లో నార్వేకు మూడో ర్యాంకు ఇచ్చింది. ఇంత పారదర్శకత ఉంది కాబట్టి, ఫేస్‌బుక్‌లో పెట్టే పోస్టుల వల్ల అదనంగా వచ్చే ఇబ్బందేమీలేదు.
ఐడీ లేకుండా తెలుసుకోలేరు..
అయితే, ఒకప్పుడు మాత్రం.. తమ స్నేహితులు, పొరుగువాళ్లు, సహోద్యోగుల జీతాల వివరాల్లోకి తొంగిచూసేందుకు ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చర్యలు తీసుకోవాలని చాలామంది ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, అందులోని సమాచారాన్ని చూడాలంటే ఎవరైనా సరే తమ నేషనల్ ఐడీ నంబర్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. ఐడీ నంబర్ ఇవ్వకుండా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఇప్పుడు లేదు. 'మీ సమాచారాన్ని ఎవరెవరు వెతుకుతున్నారో తెలుసుకునే అవకాశం 2014లో లభించింది' అని నార్వే ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారి మాన్స్ క్రిస్టియన్ హోల్టే చెప్పారు. నార్వేలో జనాభా 52 లక్షలు. అందులో పన్ను చెల్లించేవాళ్లు 30 లక్షలు. ఎలాంటి ఆంక్షలూ లేనప్పుడు ప్రతిఏటా 1.65 కోట్ల సార్లు ఈ సమాచారాన్ని వెదికేవాళ్లు. ఇప్పుడు ఏటా 20 లక్షల సార్లు వెదుకుతున్నారు.
గతంలో నిబంధనలేమీ లేవు. కాబట్టి ఇష్టం వచ్చినట్లు వెతికేవాళ్లు. ఇలా ధనవంతుల సమాచారాన్ని నేరస్తులు తెలుసుకుని, వాళ్లని టార్గెట్ చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, పరిచయస్తుల సమాచారాన్ని చూడలేదని తాజాగా చేసిన సర్వేలో 92 శాతం మంది ప్రజలు చెప్పారు.
వెతకమంటున్న ప్రభుత్వం..
ఈ పన్ను జాబితాలు ప్రజల నికర ఆదాయం, నికర ఆస్తులు, వాళ్లు చెల్లించిన పన్నుని మాత్రమే చెబుతాయి. ఎవరికైనా భారీగా ఆస్తులు ఉంటే, జాబితాలో చూపించిన దానికంటే వారి ఆదాయం ఎక్కువ కావొచ్చు. ఎందుకంటే సహజంగానే ఆస్తుల పన్ను విలువ కంటే మార్కెట్ విలువ చాలా ఎక్కువ కదా! ఇలా పారదర్శకంగా ఆదాయం, ఆస్తులు, పన్ను చెల్లింపుల సమాచారం ఇవ్వటం వల్ల సమస్యలు కూడా ఉన్నాయి. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లల్ని వాళ్ల క్లాస్‌మేట్సే వెక్కిరిస్తుంటారు. ఆదాయాన్ని వెతికి చూసే అవకాశం ఉండటం వల్లనే ఇలా జరుగుతోంది. అందరి సమాచారాన్ని ప్రజలు వెతకాలని, అప్పుడే పన్ను ఎగవేసేవాళ్లు ఎవరో తెలుస్తుందని నార్వే ఆదాయపు పన్ను విభాగం ఉన్నతాధికారులు అంటున్నారు. పన్ను ఎగ్గొడుతున్నారన్న అనుమానం వస్తే తమకు చెప్పాలని ప్రజల్ని వారు ప్రోత్సహిస్తున్నారు.
నార్వే ప్రధానమంత్రి ఎమా సోల్బర్గ్ 2015లో 1,573,544 క్రోనర్ (రూ. కోటీ 25 లక్షలు) సంపాదించారు. ఆమె ఆస్తుల విలువ 2,054,896 క్రోనర్ (రూ. కోటీ 63 లక్షలు). ఆమె 677,459 క్రోనర్ (రూ.54 లక్షలు) పన్ను చెల్లించారు.
తెలిస్తే ఒక తంటా.. తెలియకపోతే ఒక తంటా.. అన్నట్లు.. ఏమైనా అన్నింటికన్నా ప్రభుత్వాలూ పారదర్శకంగా ఉండాలి కదా..! అప్పుడు అంతా పారదర్శకంగా ఉండటానికి వీలవుతుంది.