Oct 02,2022 21:39

ప్రజాశక్తి - రామసముద్రం (కడప జిల్లా):అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అన్నమయ్య జిల్లా రామసముద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రవీంద్ర బాబు తెలిపిన సమాచారం మేరకు... పెద్దకురప్పల్లి పంచాయతీ పరిధిలోని తిరుమలరెడ్డిపల్లికి చెందిన కె మునిరాజ(28)కు తనకున్న మూడెకరాల వ్యవసాయ భూమిలో టమోటా పంట వేశారు. పంట దిగుబడిలో నష్టం వచ్చింది. పంట సాగు నిమిత్తం సుమారు రూ.నాలుగు లక్షల వరకు అప్పులు చేశారు. తన తండ్రి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.ఐదు లక్షల వరకు అప్పులయ్యాయి. ఆరోగ్యం క్షీణించి ఆయన తండ్రి మృతి చెందారు. నెల క్రితం రూ.లక్ష విలువ చేసే జెర్సీ ఆవు చనిపోయింది. అప్పులు తిరిగి చెల్లించలేక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రుణ దాతల నుంచి వేధింపులు అధికం కావడంతో ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మునిరాజ తమ్ముడు హరీష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.