Mar 20,2023 07:39

బహుశా
ఇప్పుడు అబద్ధం అర్థం మార్చేసుకుంది
ఎవరూ తమ పిల్లలకు హరిశ్చంద్ర పేరు పెట్టడంలేదు
ఒకప్పుడు కనీసం కనబడేదైనా నిజమనిపించేది
మాటలు, చేతలు, దృశ్యాలు
అన్నింటినీ అబద్ధం కమ్మేసింది
వాడో వాగ్దానాన్ని గాల్లో విసురుతాడు
అది గాల్లో ఉండగానే వెనక్కి లాక్కొని వాడే మింగుతాడు
వీడో నిర్మాణాన్నీ కళ్ళముందు రూపుగడతాడు
కలలే కదా!
ధ్వంసమవ్వడానికి సమయమవసరం లేదు
మనుషుల మధ్య
బంధాలవ్వాల్సిన మాటలు
బాధ్యతలవ్వాల్సిన మాటలు
నమ్మకాలవ్వాల్సిన మాటలు
పలచబడి తేలిపోతున్నాయి
మాట బయటకు రాకుండానే
అక్షరాలు కత్తెర్లకు బలవుతున్నాయి
పదాలు అర్థాలను వలిచేసుకొని
విపరీతార్థాల నగత్వంతో ఊరేగుతున్నాయి
మాటకు పూసిన పైపూత
క్షణాల్లో కరిగిపోయినా
నిజం చెప్పులేసుకోవడం
ఓ జీవితకాలం ఆలస్యమవుతోంది
ముక్కలు ముక్కలుగా అతుకులేసుకున్న దృశ్యాలు
నిజాలమీద నిప్పులు పోసి
చలికాసుకుంటున్నాయి
మేకప్పుల కప్పులతో మూసుకుపోయిన శరీరాలు
ఎవరికీ తమ లోపలి దేహాల్ని చూపడంలేదు
నిజం నీడల్లో సేదదీరాల్సిన నువ్వు
అబద్ధపు గాడ్పులే వాసంత సమీరాలనుకోవడమే
అతి పెద్ద విషాదం
ఎవరినైనా నమ్మించడం పెద్ద విషయమేమీ కాదు
కొనసాగించడమే అత్యంత క్లిష్టతరం
ఒక్కసారి నమ్మకం కోల్పోయాక
కట్టుకున్న అబద్ధపు మేడలన్నీ కుప్పకులాల్సిందే !
 

- బండ్ల మాధవరావు