May 26,2023 16:39

న్యూఢిల్లీ   :   ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్‌ నేత సత్యేందర్‌జైన్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. వైద్య కారణాల రిత్యా ఆయనకు ఆరవారాల పాటు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్లు జిస్టిస్‌ జెకె.మహేశ్వరి, జస్టిస్‌ పిఎస్‌. నరసింహలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ పేర్కొంది. అయితే జైన్‌ బెయిల్‌ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకునేముందు ఎయిమ్స్‌కు చెందిన వైద్యుల బృందం ఆయనకు పరీక్షలు జరిపేలా ఆదేశాలివ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) తరపున సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి రాజు చేసిన డిమాండ్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

సత్యేందర్‌ జైన్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు అనుమతిస్తామని, ట్రయల్‌ కోర్టు ద్వారా షరతులకు లోబడి మధ్యంతర బెయిల్‌పై విడుదల చేసేందుకు అనుమతిస్తామని వెకేష్‌న్‌ బెంచ్‌ తెలిపింది. అలాగే అనుమతి లేకుండా ఢిల్లీని వీడి వెళ్లరాదని, చికిత్సకు సంబంధించిన అన్ని పత్రాలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 10కి వాయిదా వేసింది. గతేడాది మే 30న ఈడి మనీలాండరింగ్‌ కేసులో ఆయనను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. గురువారం తీహార్‌ జైలులో స్పృహతప్పి పడిపోవడంతో జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. అరెస్ట్‌ అనంతరం ఆయన ఆస్పత్రి పాలు కావడం వరుసగా ఇది మూడోసారి.