
ప్రజాశక్తి-మాడుగుల:మండల కేంద్రం లో బుదవారం ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. తొలుత మాడుగు లకు చెందిన గన్నంరాజు సుబ్బారావు మాస్టారు కధా నిలయం పేరిట వారి కుమారుడు గిరిబాబు సమర్పణలో విశాఖ వాసి నటించిన సవారి నాటిక ఆలోచింపజేసింది. డబ్బే ప్రధానం, డబ్బు కోసం తల్లిదండ్రులైనా చంపడానికి సిద్ధపడే కొడుకులు, కుమార్తెలు, డబ్బు ప్రధానంగా భావించి బంధాలు, అనుబంధాలు దూరం చేసుకునే వ్యక్తులు సమాజంలో వున్నారనే ఇతి వృత్తంతో ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది. రచన స్నిగ్ధ, తండ్రి పాత్ర, దర్శకత్వం బాలాజీ నాయక్ వహించగా, గిరి బాబు, అనిల్ కుమార్, వాసు, నాయుడు, హేమ, కుమారి నటించారు. సంగీతం లీలా మోహన్, మేకప్, లైటింగ్ థామస్ అందించారు.
అనంతరం కలిసుంటే నాటిక అబ్బుర పరిచింది. 60 ఏళ్ల వయస్సులో అందమైన అమ్మాయిగా మారాలని కోరుకునే బామ్మ, ఇంటి పనులు పక్కన పెట్టీ టివి సీరియల్స్‌కు అతుక్కుపోయిన భార్య, టిక్ టాక్, సెల్ఫీలతో కాలక్షేపం చేసే భార్యతో విసుగెత్తి భర్త అడవుల్లోకి పారిపోవడం, అక్కడ ఇలాంటి బాధితులతో కలవడం, తరువాత ఇంట్లో నుండి వచ్చి తప్పు చేశామని తెలుసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు సద్దుకు పోవాలి తప్ప ఇగోతో జీవించరాదని తెలియచేసే నాటిక ఆకట్టుకుంది. నంది అవార్డ్ గ్రహీత, జర్నలిస్ట్ ఎస్.డేవిడ్ రాజు రచన, దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించగా బగాది విజయ సాయి, మొహిద్దీన్, శివ జ్యోతి, మల్లిక, కుమారి నటించారు. సంగీతం లీలా మోహన్, రంగాలంకరణ చందు, ఆహార్యం కుమారి, విజయ సాయి సహకారం మొ గిలి గునకర్ అందించారు.