May 17,2022 10:10

ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి : సర్కారు వారి పాట సినిమాను విజయవంతం చేసిన అభిమానుల రుణం తీర్చుకోలేనిదని సినీ హీరో మహేష్‌బాబు అన్నారు. ఈ సినిమా విజయోత్సవ వేడుకలు కర్నూలులోని ఎస్‌టిబిసి కళాశాల మైదానంలో సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ ఒక్కడు సినిమా సమయంలో షూటింగ్‌ కోసం కర్నూలుకు వచ్చానన్నారు. అభిమానులు ఇచ్చిన విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. కరోనా వల్ల ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని తెలిపారు. అభిమానులు ఎప్పుడూ తన గుండెల్లో ఉంటారని, ఇంకా మంచి సినిమాలు తీస్తూనే ఉంటానని పేర్కొన్నారు. అభిమానుల ఆశీస్సులు ఎప్పటికీ తనతో ఉండాలన్నారు. సినిమా దర్శకులు పరశురాం మాట్లాడుతూ ఒక్కడు సినిమాతో ప్రభావితమై ఈ సినిమా చేశానని తెలిపారు. సినిమాను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సంగీత దర్శకులు ఎస్‌ఎస్‌ థమన్‌ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్యామల వ్యవహరించారు. ఆట, పాటతో సినిమా బృందం అలరించింది. అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో కట్టడి చేయడం కష్టం అయింది. పోలీసులు కూడా అభిమానులుగా మారిపోయి కార్యక్రమాన్ని వీక్షించారు.