Jan 13,2021 12:19

వాషింగ్టన్‌ : తనపై ప్రవేశపెట్టిన అభిశంసన మరిన్ని హింసాత్మక ఘటనలకు దారితీయవచ్చని అమెరికా అద్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. గత వారం కాపిటల్‌ భవనంపై దాడి ఘటన అనంతరం కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. నలుగురు మృతికి కారణం కావడంతో పాటు ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌, కాంగ్రెస్‌ సభ్యులను అప్రతిష్ట పాలు చేసిన కాపిటల్‌ భవనంపై దాడిని తప్పు అన్న వాదనను ట్రంప్‌ ఖండించారు. ఎన్నికల ఫలితాలను తారు చేయమని చట్టసభ సభ్యులను ఒత్తిడి చేయడం, బెదిరించడం, కాపిటల్‌ భవనంపై తన మద్దతుదారులను దాడి చేయమని ప్రోత్సహించడంలో తన వ్యాఖ్యలు సముచితమైనవేనని ట్రంప్‌ పేర్కొన్నారు. రియో గ్రాండ్‌వాలీలోని కొత్తగానిర్మిస్త్నున సరిహద్దుగోడను సందర్శన సందర్భంగా.. తనను బాధ్యుడిని చేస్తూ.. డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసనపై విరుచుకుపడ్డారు. రాజ్యాంగం ప్రకారం.. అమెరికా చరిత్రలో తనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన ఈ అభిశంసన.. అత్యంత దుర్మార్గపు , కక్ష్యపూరిత చర్యఅని ట్రంప్‌ అన్నారు. ఈచర్యతో మరిన్ని హింసాత్మక ఘటనలు తలెత్తవచ్చని, కొందరికి (డెమోక్రాట్లు) ఇది అర్థం కావడం లేదని, ఇటువంటి సమయంలో ఈ చర్య అమెరికాకు పెనుముప్పుగా పరిణమించవచ్చని ట్రంప్‌ అన్నారు. అభిశంసన ప్రవేశపెట్టిన అనంతరం ట్రంప్‌ మొదటిసారిగా మాట్లాడుతూ.. 25వ సవరణతో తనకు పెద్ద ప్రమాదం లేదని, కానీ నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న బైడెన్‌కు, బైడెన్‌ క్యాబినెట్‌ను తిరిగి వెంటాడవచ్చని అన్నారు. టెక్సాస్‌ సందర్శన సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పుడు దేశాన్ని బాగు చేయాల్సిన సమయం వచ్చిందని, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని మద్దతుదారులనుద్దేశించి అన్నారు. ''మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌'' అనే ప్రచార నినాదాన్ని పునరుద్ఘాటించారు.