Aug 18,2022 20:58

సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు చేసి చూపిస్తున్నామని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం 46వ డివిజన్‌ కనపాక ప్రాంతంలో పలు అభివద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. మూడుచోట్ల రహదారులు, కాలువ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. చందకవీధిలో పూర్తయిన రహదారిని ప్రారంభించారు. చందక వీధిలో ఏడు విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరగా తక్షణమే వాటి ఏర్పాటుకు అధికారులను ఆయన ఆదేశించారు. 20 రోజుల్లోగా విద్యుత్తు స్తంభాలు ఏర్పాటయ్యేలా చూస్తామని హామీనిచ్చారు. పైపులైన్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 45వ డివిజన్‌ శ్రీకృష్ణ ఆలయ ప్రాంతంలో రూ.7 లక్షలతో నిర్మించనున్న కాలువ పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ రేవతి దేవి, కోఆప్షన్‌ సభ్యులు రహీం, వైసిపి డివిజన్‌ అధ్యక్షులు అప్పారావు, కార్పొరేటర్‌ బొద్దూరు గోవిందమ్మ, టి.సంతోషికుమారి, నాయకులు దూబే, తమ్ము పాల్గొన్నారు.
వి.టి.అగ్రహారంలో గడపగడకు..
నగరంలోని విటి అగ్రహారంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యాన నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కొంతమంది స్థానిక సమస్యలతోపాటు వ్యక్తిగత సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. విటి అగ్రహారం ప్రాంతం పరిధి పెద్దదిగా ఉండడం, అధిక జనాభా ఉండడంతో ఎనిమిది రోజులపాటు పర్యటించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలుతీరు, ప్రజా స్పందనను తెలుసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ చందక శ్రీనివాసరావు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు కుమ్మర గంటి శ్రీనివాసరావు, వైసిపి నాయకులు పీతల సుగుణ, తాట్రాజు సునీత, పైల భవాని పాల్గొన్నారు.