Oct 18,2020 22:33

 నంద్యాల మునిసిపల్‌ కమిషనర్‌ సంక్రాంతి వెంకటకృష్ణ

పన్ను వసూళ్లలో లక్ష్యం చేరుతున్నాం
ప్రజలపై బతకడం కంటె ప్రజలకై బతకడమే ఆనందం
ప్రజాశక్తితో నంద్యాల మునిసిపల్‌ కమిషనర్‌ సంక్రాంతి వెంకటకృష్ణ
              ప్రజాశక్తి-నంద్యాల క్రైం:    'నంద్యాల మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. అమృత్‌ పథకం కింద పనులు చివరిదశలో ఉన్నాయి. మ్యాచింగ్‌ గ్రాంటు నిధులు రావల్సినవన్నీ వచ్చాయి. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నాం. విద్య, వైద్యం మెరుగుదలకు కావల్సిన పనులు చేపడుతున్నాం. అక్రమ లేఅవుట్లను గుర్తించాం. సచివాలయ వ్యవస్థపరిపాలనా వికేంద్రీకరణకు తోడ్పడుతుంది. ప్రజలపై బతకడం కంటె ప్రజలకై బతకడంలోనే ఆనందం ఉంటుంది' అని నంద్యాల మున్సిపల్‌ కమిషనర్‌ సంక్రాంతి వెంకట కృష్ణ తెలిపారు. ప్రజాశక్తి ముఖాముఖిలో ఆయన అనేక విషయాలు వెల్లడించారు.

కరోనా సమయంలో పనులేమైనా ఆగిపోయాయా? రావల్సిన నిధులేమైనా నిలిచిపోయాయా?
           కమిషనర్‌:
సివిల్‌ వర్క్స్‌, నాడు-నేడు పనులు చేయలేక పోయాం. అత్యవసర పనులు తప్ప మూడు నెలల పాటు అన్నీ ఆపేశాం. రావల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు వచ్చాయి. పూర్తిగా ఖర్చు చేశాం. 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయాల్సి ఉంది.
అమృత్‌ పథకం కింద చేయాల్సిన పనులన్నీ చేశారా?
           కమిషనర్‌
: అమృత్‌ పథకం పనులు ఎపి మ్యాచింగ్‌ గ్రాంట్‌, మున్సిపల్‌ నిధులు కలిపి పూర్తి చేశాం. వెలుగోడు నుంచి రూ.123 కోట్లతో తాగునీటి ప్రాజెక్టును చేపట్టాం. రూ.95 కోట్ల వచ్చాయి. ఇంకా రావాలి. రైల్వేట్రాక్‌ నుంచి పైప్‌లైన్‌ వేయాలి, తాగునీటికే ఎక్కువ నిధులు ఖర్చు చేశాం.
పట్టణ సంస్కరణలపై ఎలాంటి అదేశాలు అందాయి. ప్రజలపై ఎలాంటి భారాలు వేయబోతున్నారు?
         కమిషనర్‌:
పట్టణ సంస్కరణలపై ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. భారాలు పడుతాయనే చర్చ నడుస్తోంది. అలాంటిదేమీ ఉండదు. సంస్కరణలు మంచివే అని నా అభిప్రాయం.
పన్ను వసూళ్ల టార్గెట్‌ ఎంత ? ఎంత రీచ్‌ అవుతున్నారు?
                   కమిషనర్‌ :
రీచ్‌ అవుతున్నాం. గతేడాదితో పోల్చితే ఎక్కువ వసూలు చేశాం.
మున్సిపాలిటీ పరిధిలో విద్య, వైద్యం పరిస్థితి ఎలా ఉంది?
            కమిషనర్‌ :
అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఐదు ఉన్నాయి. మరో మూడు కొత్తవి మంజూరయ్యాయి. గాంధీనగర్‌, శ్రీనివాసనగర్‌, మూలసాగరం వద్ద ఏర్పాటు చేస్తున్నాం. నాడు-నేడు పనులతో పాఠశాలలకు మహర్ధశ వచ్చింది. కరోనా వలన పనులు కొంత ఆలస్యంగా పనులు ప్రారంభించాం. నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.
కరోనా సమయంలో అదనపు పారిశుధ్య సిబ్బందిని తీసుకున్నారా?
           కమిషనర్‌ :
30 మందిని తీసుకున్నాం. 3 నెలల పాటు వారు పనిలో ఉంటారు.
పారిశుధ్య కార్మికులు ఎంత మంది ఉన్నారు. వారిలో రెగ్యులర్‌ ఎంతమంది? కాంట్రాక్టు కింద ఎందరున్నారు?
          కమిషనర్‌:
400 మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు. 100 మంది రెగ్యులర్‌ సిబ్బంది ఉన్నారు. 80 నుంచి 100 మంది అదనంగా కావాలి. ప్రభుత్వం నుంచి మాకు అనుమతి లేదు. అర్థిక పరిస్థితిని బట్టి అనుమతి ఇస్తారు.
ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి?
             కమిషనర్‌:
మూడు పార్కులు రూ.80 లక్షలతో అభివృద్ధి చేస్తున్నాం. మియావాకీ పారెర్టు టెక్నాలజీ కింద రూ.40 లక్షలతో దేవనగర్‌లో సర్వేపల్లి రాధాకృష్ణ పార్కును ఆధునీకరిస్తున్నాం. ఇంకా రైతు బజార్‌, శ్రీనివాసనగర్‌లో 80 సెంట్లలో టెన్‌లెవల్‌ చిల్డ్రన్స్‌ పార్కు యాంటీ హిల్‌ క్రియేషన్‌ బెంగళూరు వాళ్లతో చేయిస్తున్నాం. గాంధీ, అంబేద్కర్‌ విగ్రహాల వద్ద ఆధునీకరణ పనులు చేస్తున్నాం. అదేవిధంగా బొమ్మల సత్రంను ఆధునీకరిస్తున్నాం.
స్టీట్‌ లైట్స్‌ సక్రమంగా పని చేయడం లేదనే ఫిర్యాదులున్నాయి. ఎందుకని?
             కమిషనర్‌:
స్ట్రీట్‌ లైట్‌ నిర్వహణ ఇఇఎస్‌ఎల్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. తొమ్మిది సంవత్సరాలు వాళ్లు చూస్తామన్నారు. కానీ నిర్వహణ సరిగ్గాలేదు. సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాం.
మున్సిపల్‌ స్థలాలు పార్కులు కబ్జాకు గురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
           కమిషనర్‌ :
87 లేఅవుట్లు అనాథరైజ్‌డ్‌గా గుర్తించాం. అక్కడ ఎలాంటి పనులు జరగకుండా నిషేదాజ్ఞలు విధించాం. మరో 20 నుంచి 25 లేఅవుట్లు అక్రమంగా ఉన్నట్లు గుర్తించాం వాటిపై కూడా చర్యలు తీసుకుంటాం. వాటికి యుసిఐఎంఎస్‌ యాప్‌ ఇచ్చారు. అక్రమ కట్టణాలను సులభంగా గుర్తిస్తున్నాం.
సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది?
             కమిషనర్‌:
సచివాలయ వ్యవస్థ పరిపాలనా వికేంద్రీకరణకు ఉపయోగపడుతుంది. ప్రజలు మున్సిపల్‌, ఆర్‌డిఒ, తహశీల్దార్‌ కార్యాలయాలకు వెళ్లకుండా వారి నివాస ప్రాంతాల్లోనే పనులు పరిష్కారమవుతాయి.
మీకు ఇష్టమైన పని ఏమిటీ
            కమిషనర్‌ :
పేపర్‌రీడింగ్‌
మీ భవిష్యత్తు కర్తవ్యం , లక్ష్య ఏమిటీ?
       కమిషనర్‌ :
ఉద్యోగ విరమణ తరువాత ప్రీలాన్స్‌ జర్నలిస్టుగా పని చేయాలనుంది. ప్రజలపై బతకడం కంటె ప్రజలకై బతకడమే ఆనందం. అది నాలక్ష్యం కూడా.