
సాలూరు: రాష్ట్రంలో అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేరాఫ్ అడ్రస్ వైసిపి పాలన అని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. పట్టణలోని కోదండరామ కళ్యాణమండపంలో సోమవారం నిర్వహించిన పాచిపెంట మండల సచివాలయం కన్వీనర్లు, గృహ సారథుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల సచివాలయం కన్వీనర్ పి.గౌరీశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు లేవని టిడిపి ప్రచారం చేయడం అబద్దమన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయని చెప్పారు. సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల్లో నిర్మాణమైన వంతెనలు, రహదారులు అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. గతంలో టిడిపి ప్రభుత్వం మాదిరిగా శంఖుస్థాపన చేసిన అభివృద్ధి పనులు గాలికొదిలేయ లేదన్నారు. పట్టణంలో వందపడకల ఆసుపత్రికి అప్పటి మంత్రి సుజరుకృష్ణ రంగారావు శంకుస్థాపన చేసి వదిలేసిన పార్టీ టిడిపియేనని చెప్పారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వంద పడకల ఆసుపత్రి నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మరింత మెరుగైన పాలన అందించాలనే లక్ష్యంతో సిఎం జగన్ మోహన్‌రెడ్డి సచివాలయం వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు తోడుగా ఉండేలా గృహ సారధులు, సచివాలయం కన్వీనర్ల నియామకం చేపట్టినట్లు తెలిపారు. అట్టడుగు స్థాయిలో ఏన్న నలుగురు సమన్వయంతో పనిచేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి బి.ప్రమీల, వైసిపి సీనియర్ నాయకులు పి.చినబాబు, డోల బాబ్జీ, వ్యవసాయ సలహా మండలి మండల చైర్మన్ మధుసూదనరావు, మండల అధ్యక్షుడు గొట్టాపు ముత్యాలు నాయుడు పాల్గొన్నారు.