Jan 11,2021 08:07

         ''నాకు జీవితం కవిత్వం వేర్వేరు కాదు, జీవితం నన్ను ఉక్కుగోళ్ళతో రక్కితే.. కారే నెత్తురు నా అక్షరాల్లో ప్రవహిస్తుంది'' అంటూ ఆఖరి శ్వాస వరకూ కవిత్వమే తానై, తానే కవిత్వమై జీవించిన ప్రజాకవి డాక్టర్‌ అద్దేపల్లి రామమోహనరావు. ప్రగతిశీలతకు, ప్రతిభకు, అభ్యుదయానికి, సాహితీ నిబద్ధతకు నిలువెత్తు కొలమానం ఆయన. కాకినాడ పరిసర ప్రాంత కవులకు ఒక వేదిక కల్పించి, ఒక తాటిపై నిలిపిన సజ్జన సాహితీ సన్మిత్రుడు. నిత్య సాహితీ సంచారిగా తెలుగునేల నాలుగు చెరగులా సాహితీ సౌరభాలను వెదజల్లుతూ, పెద్ద కవులతో పాటు వర్ధమాన కవులనూ సమాదరించి, అక్కున చేర్చుకున్న నిబద్ధ సామ్యవాద భావుకుడు.
        ''ప్రస్తుత మన వ్యవస్థ ఏదో ఒక విధంగా అందరినీ ఆవేదనకు గురిచేస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు ఏ మార్పులు వచ్చినా అవి సమాజ వృక్షపు కొమ్మల దగ్గరో, ఆకుల దగ్గరో, పూలదగ్గరో లేదా మాను దగ్గరో ఆగిపోయినై గానీ వేళ్ళదాకా (మూలాల దాకా) వెళ్ళలేదు. అత్యంత వేగంగా, బీభత్సంగా మారిపోతున్న వ్యవస్థ క్రమక్రమంగా ఈ మట్టిమీద ప్రజల భావాల్ని కూడా మార్చేస్తుంది'' అంటూ తన అంతరంగ ఆవేదనను వెలిబుచ్చిన డా.అద్దేపల్లి సామ్యవాద సిద్ధాంతాలకు ఆకర్షితులై ప్రాచీన సాహిత్యముద్ర నుంచి అభ్యుదయ సాహిత్యం వైపు తన ప్రస్థానాన్ని మళ్ళించి, సామాజిక స్పహ కలిగిన రచనలతో ప్రగతిపథం వైపు అడుగులు వేశారు.
        రక్తసంధ్య, మధుజ్వాల, అంతర్జ్వాల, గోదావరి నా ప్రతిబింబం, మెరుపు పువ్వు, కాలంమీద సంతకం, పొగచూరిన ఆకాశం, అయినా ధైర్యంగానే, ఆకుపచ్చని సజీవ సముద్రం నా నేల, దష్టి, గీటురాయి, విలోకనం వంటి అనేక గ్రంథాలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. సాంస్కతిక విధ్వంసాన్ని అక్షరాలతో చీల్చి చెండాడిన దీర్ఘ కవిత తెరలు. దీనికి రామతీర్ధ ఆంగ్ల వెర్షన్‌ రాశారు. ''నువ్వు ఆర్యుడవైతేనేమిటి? ద్రావిడుడవైతేనేమిటి? నీ ఒంట్లో బహుళజాతి రక్తం ప్రవహిస్తున్నప్పుడు'' అంటూ కలంపట్టి, గళమెత్తి ప్రశ్నించిన అద్దేపల్లి అభ్యుదయ సాహసి, కవితా పిపాసి. ''గోదావరి నీళ్ళు దోసిట్లోకి తీసుకున్నాను, నా ముఖం కనిపించలేదు.. వీరేశలింగం కనిపించాడు'' అంటూ చారిత్రక సత్యాన్ని సాహిత్య సంపదకు జతచేసిన సాహితీస్రష్ట, సామాజిక ద్రష్ట. పేదవారికీ, పెద్దవారికీ/ భేదమిక నశిస్తుందనీ/ ఇంద్రజాలంలోన మునిగీ/ ఎదురుతిరిగే దమ్ము లేనప్పుడు ఏంజేయాలేంజేయాలి/ మీరూ ఇందిరమ్మకు భజన చేయాలీ.. అంటూ ఆనాటి కేంద్ర ప్రభుత్వ సంస్కరణల బూటకాన్ని ఎమర్జెన్సీ ముందే ఎండగట్టి, అశేష యువకుల పె(వె)న్ను తట్టి, వర్ధమాన కవులతో కవన కవాతు చేయించిన ఉద్యమ కవితా పోరాటయోధుడు, అరుణోదయ జయకేతనం ఎగరేసిన కార్యశూరుడు.
       జీవనయానంలో 'బందరు సముద్రం ఒక్క తన్ను తన్నితే కాకినాడ సముద్రపు ఒడ్డున పడ్డాను' అని చెప్పుకున్న అద్దేపల్లికి కళల కాణాచి కాకినాడ ఒక సాహితీ పాఠశాల.. కవిత్వ కళాశాల. చైతన్యవంతమైన సాహితీ సృజనతో యువ రచయితల్లో స్ఫూర్తి నింపి, అంతర్జ్వాల రగిలించి, పొగచూరిన ఆకాశంలో కూడా రక్తసంధ్యను చూపి, ఆకలి కడుపుల మీద అగ్నిసంతకం చేసిన అద్దేపల్లి ఒక అగ్నిగీతం.. మహోద్రేక జలపాతం. తన మెరుపుపువ్వు కవితలో బార్బర్‌ షాపు నారాయణతో సహా తోటి సాహితీ సహచరులందరినీ పేరు పేరునా అక్షరమాలగా కూర్చిన సాహితీ వనమాలి, స్నేహ సౌహార్ద్రతకు ప్రతీకగా నిల్చిన అక్షరశిల్పి. ప్రస్తుత కాలంలో కాకినాడలో చైతన్యవంతంగా నడుస్తూ, 'నెల నెలా సాహిత్యం' పేరుతో సాహితీ పరిమళాలను పంచుతోన్న 'సాహితీస్రవంతి' సంస్థ ఉద్భవానికి అద్దేపల్లి మూల కారకులు.
        'మహాప్రస్థానం' ప్రేరణతో ఉత్తేజాన్ని పొంది 'శ్రీశ్రీ కవితా ప్రస్థానం' పేరుతో మహాకవి శ్రీశ్రీపై తొలి పరిశీలనా గ్రంథాన్ని వెలువరించిన ఘనత డా.అద్దేపల్లికే చెందుతుంది. తొలి రోజుల్లో విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యంతో అనుబంధం పెంచుకున్న ఆయన క్రమేపీ అభ్యుదయ కవిత్వం వైపు ఆకర్షితులయ్యారు. మధ్యలో కొన్నాళ్ళు దేవులపల్లి కష్ణశాస్త్రి గారి 'ఆమె కన్నులలో అనంతాంబరపు నీలి నీడలు కలవు' వంటి భావచిత్రాలు వెంటాడినట్లు చెప్పుకున్నారు. అలాగే మహాకవి గుర్రం జాషువా 'నా కవితా లతాంగి వదనమ్ము'.. కన్నీళ్ళు తెప్పించిందని, ఠాగూర్‌ 'చిత్ర' నాటకం 'స్ట్రేబర్డ్స్‌' లఘు కవితలూ, గీతాంజలి కవితా వచనాలు తన రక్తంలో కలిసిపోయాయంటూ తన అంతరంగాన్ని విప్పిచెప్పారు అద్దేపల్లి. పద్యాలు, గేయాలను శ్రావ్యంగా ఆలపించటంతో పాటు ఆయనకెంతో ఇష్టమైన స్వీయ గజళ్ళను కూడా హద్యంగా వినిపించేవారు. 'ఈ ధనమంత పోనీ, యవ్వనమంత పోనీ.. ఆనాటి బాల్యాన్ని ఒకసారి రానీ' అంటూ స్వీయగానం చేస్తుంటే వింటున్న ప్రతి ఒక్కరూ తమ బాల్యంలోకి పరుగెత్తాల్సిందే.
         స్త్రీ, దళిత, మైనారిటీ వాదాలపై పదునైన వ్యాసాలు రాసిన అద్దేపల్లి ఎంతోమంది కవుల గ్రంథాలకు అసంఖ్యాకంగా ముందుమాటలు రాశారు. ఆయన కవితావేశం ఎప్పుడూ సామాజిక ప్రగతిశీల ఉద్యమాలతో ముడిపడి ఉన్నదే. ప్రపంచీకరణ గురించి తన కవిత్వంలో ఎంతో ఆవేదన వెలిబుచ్చేవారు. అది నాలో నిత్యవేదనని రగిలించేదని చెప్పుకొన్నారు. సమాజంలో జరిగే ప్రతి మార్పు యొక్క రూపమూ, సన్నివేశమూ ఆయన కవితావస్తువై ప్రతిబింబించేది. అప్పట్లో 'గాట్‌' మీద భారత ప్రభుత్వం సంతకం చేసినప్పుడు ''గాట్‌పై సంతకం జరిగిపోయింది / భారతదేశం అట్లాంటిక్‌ సముద్రం మీదకి ఒరిగిపోయింది/ తనకు తాను ఒక తోలుబొమ్మగా మారిపోతోంది'' అంటూ తన ఆవేదన వెళ్ళగక్కారు. ''అయినా ధైర్యంగానే'' అనే కవితాసంపుటి ప్రపంచీకరణ వ్యతిరేకతకు ప్రతిబింబం కాగా, 'పొగచూరిన ఆకాశం' ఆయనలోని ఆవేశాన్ని, ఆవేదనను ప్రతిఫలించింది. సాహిత్య సృజనతో సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు వ్యతిరేకంగా తుదిశ్వాస వరకూ అలుపెరుగని పోరాటం సలిపిన సైద్ధాంతిక నిబద్ధత కలిగిన అక్షరయోధుడు డా.అద్దేపల్లి.
 

(జనవరి 13 డాక్టర్‌ అద్దేపల్లి వర్ధంతి)
- మార్ని జానకిరామ చౌదరి
94403 38303