Jul 03,2022 22:56

ప్రజాశక్తి - మండవల్లి
             జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలు వాహనదారుల పాలిట మృత్యుశకటాలుగా మారుతున్నాయి. రాత్రి వేళల్లో గుంతలు కనిపించకపోవడంతో వాహనదారులు ఆ గుంతల్లోపడి తీవ్రగాయాల పాలవుతున్నారు. కొన్నిసందర్భాల్లో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. కొన్నిచోట్ల కొందరు తమ అవసరాల కోసం రోడ్డును తవ్వేసి పైపులు వేసుకోవడం.. ఆ తర్వాత ఆ గుంతలను అలాగే వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితే మండలంలోని పెరికెగూడెం వద్ద జాతీయరహదారిపై చోటుచేసుకుంది. ఇలాంటి వాటిపై సంబంధిత అధికారులు దృష్టిపెట్టడం లేదు.
పామర్రు - దిగమర్రు 165 జాతీయ రహదారిపై పెరికెగూడెం వద్ద భారీ గుంత ఏర్పడింది. వాహనదారులు ఆ గుంతలో పడి నిత్యం ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. ఓ ప్రయివేటు పరిశ్రమకు నీటిని తరలించేందుకు జాతీయ రహదారి కింద నుండి నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా పైపులను ఏర్పాటు చేశారు. దీంతో రహదారిపై గుంత ఏర్పడింది. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని వాహనదారులను ప్రమాదాల భారినుండి కాపాడాలని అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని వాహనదారులు, గ్రామస్తులు వాపోతున్నారు. అలాగే భైరవపట్నం వద్ద నీటిని తరలించేందుకు నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారి కింద నుండి పైపులైన్ల ఏర్పాటు చేయడం వల్ల ఏర్పడిన గుంతలో ద్విచక్ర వాహనం పడి ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పాక గ్రామానికి చెందిన పోలగాని శోభనాద్రి (25) ప్రాణాలు కోల్పోయాడు. చావలపాడు దగ్గర ఏర్పడిన గుంతలో పడి మరోవ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఇలా గుంతల్లో పడి ఎంతోమంది క్షతగాత్రులుగా మిగిలారు. జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతల్లో పడి ద్విచక్ర వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని, అయినప్పటికీ అధికారులు ఎవరూ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి జాతీయ రహదారిపై గుంతలు ఏర్పడడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని, గుంతలను పూర్తిస్థాయిలో పూడిపించాలని వాహనదారులు, గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బి అధికారి సత్యనారాయణరావును వివరణ కోరగా పెరికగూడెం వద్ద జాతీయ రహదారిపై గుంతను సిమెంట్‌తో పూడుస్తామని తెలిపారు. దానిపై పూర్తిస్థాయిలో తారు వేసేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.