Nov 29,2021 07:17

తెలుగు సీరియల్‌ వీక్షకుల్లో 'కార్తీక దీపం' సీరియల్‌ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. అందులో డాక్టర్‌బాబు, వంటలక్క, హిమ, శౌర్య పాత్రలు బాగా ప్రేక్షకాదరణ పొందాయి. తండ్రి కోసం పరితపించే కూతురిగా, తల్లి ప్రేమకు దూరమైన చిన్నారిగా హిమ అద్భుతమైన నటను కనబర్చుతుంది. చాలామంది సీరియళ్లు, సినిమాల్లోని నటులకు నిజజీవితంలో కష్టాలు ఉండవని, వాళ్లు చాలా సంతోషంగా ఉంటారని భావిస్తారు. కానీ వాళ్లూ మనలాంటి మనుషులే.. హిమ అసలు పేరు సహృద . ఆ చిన్నారి జీవితంలో చెప్పలేనంత బాధ ఉంది.. ఆ వివరాలు తెలుసుకుందాం..!

 

ఆడపిల్ల అని నాన్న వదిలేశాడు !      వెండి తెరతో సమానంగా ప్రేక్షకాదరణ పొందుతోంది బుల్లితెర. ప్రస్తుతం తెలుగు సీరియల్స్‌లో బ్లాక్‌ బస్టర్‌ రేంజ్‌ను అందుకుంది 'కార్తీక దీపం'. ఈ సీరియల్‌ గురించి తెలియనివారు ఉండకపోవచ్చు. ఈ సీరియల్‌లో చిన్నారి పాత్ర పోషించిన హిమ అతి చిన్న వయస్సులోనే తన నటనతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది. కార్తీకదీపం హిమగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న చైల్డ్‌ ఆర్టిస్ట్‌ బేబీ సహృద ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూల్లో అనేక విషయాలు చెప్పుకొచ్చింది.
     డాక్టర్‌ బాబు ప్రియమైన కూతురిగా హిమ ఎన్నోసార్లు ఎమోషనల్‌ సీన్స్‌ పండించి, ఔరా అనిపించుకుంది. అయితే సీరియల్‌లో హిమ వంటలక్కలానే నల్లగా, డీగ్లామర్‌గా కనిపిస్తోంది. దాని గురించి హిమ (సహృద) మాట్లాడుతూ.. 'నిజానికి నేను మొదట్లో చాలా భయపడ్డాను. మేకప్‌ అంటే నాకు ఇష్టమే. కానీ బ్లాక్‌ మేకప్‌ వేసేసరికి నాకు నచ్చలేదు. నన్ను డీగ్లామర్‌గా చూపిస్తారా? నన్ను అందంగా చూపించరా? అని మొదట అడిగాను. అయ్యో! అనవసరంగా కమిట్‌ అయ్యానే అనుకున్నా. రానురాను జనాల నుంచి వచ్చిన ఆదరణ చూసి, నా మేకప్‌ని ఇష్టపడటం మొదలెటా'్ట అని చెప్పింది.
     సీరియల్‌లో పుట్టినప్పుడు అమ్మకు దూరంగా.. తర్వాత నాన్నకు దూరంగా ఉంటుంది హిమ. నిజ జీవితంలోనూ అలాంటి కష్టాలను ఎదుర్కొందని తెలిస్తే కన్నీరు ఆగదు. ఈ మధ్య కాలంలో ఒక ఈవెంట్‌కు హిమ తల్లితో సహా హాజరయ్యింది. ఆ ఈవెంట్‌లో హిమ తల్లి స్టేజ్‌ మీదే తమ గతాన్ని చెబుతూ అందరినీ ఏడిపించేశారు. 'సహృద పుట్టిన వెంటనే వాళ్ల నాన్నకు ఫోన్‌చేసి ఆడపిల్ల పుట్టిందని చెప్పాను. ఆయన కనీసం చూడటానికి కూడా రాలేదు. అప్పటి నుంచి ఆమె తండ్రి ప్రేమకు నోచుకోలేదు. తన బిడ్డ ప్రయోజకురాలై తనను వద్దనుకున్న వారికి ఎదిగి చూపించాలనే తాను కష్టపడుతున్నట్లు' ఆమె చెప్పుకొచ్చారు. ఇదంతా పక్కనే ఉండి వింటున్న సహృద స్టేజీ మీదే భావోద్వేగానికి గురైంది. వేదిక మీదున్న యాంకర్‌ రవి 'కూతురంటే పదిమంది అబ్బాయిలతో సమానం బాధపడొద్దు!' అని ఓదార్చడం చూసిన ప్రేక్షకులు ఎమోషనల్‌ అయ్యారు.
    సహృద కార్తీక దీపం సీరియల్‌లోనే కాకుండా 'మౌనరాగం' సీరియల్‌లో అమ్ములు చిన్ననాటి పాత్ర నటించి, ఎంతో పేరు తెచ్చుకుంది. ఇంకా 'నా కోడలు బంగారం, నెం.1 కోడలు'తో పాటు జీ తెలుగులో వచ్చే డ్రామా జూనియర్స్‌లోనూ నటించింది. ఆమె తన నటనకుగాను పలు అవార్డులు అందుకుంది. సహృద అందరూ కోరుకున్నట్లే ఎంతో ఎత్తుకు ఎదిగి, తనను వద్దనుకున్న తండ్రి తప్పు తెలుసుకునేలా, అందరూ అభినందించేలా ఎదగాలని మనమూ కోరుకుందాం.