May 05,2021 00:44

ఆన్‌లైన్‌ సంస్మరణ సభలో మాట్లాడుతున్న వక్తలు

ప్రజాశక్తి - విశాఖపట్నం
హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) నాయకులు కె.సూర్యనారాయణ ఆదర్శనీయుడని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నరసింగరావు, పూర్వ జిల్లా కార్యదర్శి ఎ.అజశర్మ కొనియాడారు. సూర్యనారాయణ మరణం కార్మికవర్గానికే కాకుండా వారి కుటుంబ సభ్యులకు, సిఐటియుకు తీరని లోటన్నారు. ఆయన మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. రెండు రోజుల క్రితం కరోనా మహమ్మారితో పోరాడి సూర్యనారాయణ మృతిచెందిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆన్‌లైన్‌లో ఆయన సంస్మరణ సభను సిఐటియు గ్రేటర్‌ విశాఖ నగర కమిటీ ఆధ్వర్యాన నిర్వహించారు. హెచ్‌పిసిఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.సత్యన్నారాయణ అధ్యక్షత వహించారు. సభకు ముందు సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సూర్యనారాయణ హెచ్‌పిసిఎల్‌లో చేరక ముందు ఆర్టీసీ ఉద్యోగిగా పని చేసారని, ఆ సమయంలో సిఐటియులో చేరి ప్రధాన బాధ్యతలు చేపట్టారని తెలిపారు. ఆర్టీసీలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిఖరంగా పోరాటం చేశారన్నారు. తరువాత ఆ ఉద్యోగాన్ని వదిలి హెచ్‌పిసిఎల్‌లో చేరారన్నారు. అక్కడ యాజమాన్యం కార్మికులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేయడాన్ని సహించలేక సిఐటియు సంఘాన్ని పెట్టి కార్మికులను చైతన్య పరిచారన్నారు. సంఘాన్ని నిర్మించి యాజమాన్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నాయకత్వం వహించారన్నారు. దీంతో ఆయన్ని యాజమాన్యం కక్షపూరితంగా సస్పెండ్‌ చేసిందని, అయినా బెదరకుండా ధైర్యంగా యాజమా న్యంపై పోరాడారని గుర్తు చేశారు. సస్పెండైన తరువాత ఆయన భార్య ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చారన్నారన్నారు. సూర్యనారాయణ నిబద్ధత కలిగిన నాయకుడని, ఆదర్శప్రాయుడని కొనియాడారు. సస్పెండ్‌ ఎత్తివేసిన తరువాత తిరిగి హెచ్‌పిసిఎల్‌కు వచ్చాక కూడా కార్మికులను ఎంతో చైతన్యం చేసి సిఐటియు ఉంటేనే కార్మికులకు మేలు జరుగుతుందని చెప్పి యూనియన్‌ను మరింత బలోపేతం చేశారన్నారు. పోరాడి మేనేజ్‌మెంట్‌ను ఓడించినప్పటికీ కరోనాను జయించలేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆయిల్‌ సెక్టార్‌ జాతీయ స్థాయి నాయకునిగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆయిల్‌ సెక్టార్‌ పరిశ్రమల ఉద్యోగులను కూడా చైతన్య పరిచిన నాయకుడన్నారు. వారి ఇంటివద్దనే యూనియన్‌ సమావేశాలు జరిపి కార్మికుల సమస్యలపై సమిష్టి నిర్ణయాలు చేసేవారన్నారు. మంచి నాయకుడి కోల్పోయినప్పటికీ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేసిన నాడే ఆయనకు నిజమైన నివాళని పేర్కొన్నారు.
సభలో సూర్యనారాయణ భార్య భగవతి, కుమారుడు నందు, కుమార్తె నవ్య, సిఐటియు నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, ఎం.జగ్గునాయుడు, పబ్లిక్‌ సెక్టార్‌ కోఆర్డినేషన్‌ కమిటీ కో కన్వీనర్‌ కెఎం.కుమార్‌ మంగళం, హెచ్‌పిసిఎల్‌ నాయకులు ఆదినారాయణ, ఎఐఐఇఎ యూనియన్‌ నాయకులు ఎన్‌.రమణాచలం, ఎన్‌సిఇయు నాయకులు రెడ్డి వెంకటరావు, ఎస్‌బిసి యూనియన్‌ నాయకులు ఇ.శ్రీనివాస్‌, హెచ్‌పిసిఎల్‌ సొసైటీ నాయకులు వి.బాబూరావు, షిప్‌యార్డు గుర్తింపు యూనియన్‌ కార్యదర్శి రమణమూర్తి, పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు సిహెచ్‌ త్రినాధ్‌, హెచ్‌పిసిఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు వివికె.అప్పారావు, వెంకటకృష్ణ, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.