Jun 13,2021 11:17

   రవై మూడేళ్ళ ఆరోగ్యవంతుడైన యువకుడు. నవమన్మధుడు కాకపోయినా చాలామందికి తీసిపోడు. ఇంటర్‌ పాస్‌చేశాడు. గవర్నమెంటు ఆఫీసులో యాభై రూపాయలు జీతం తెచ్చుకుంటున్నాడు. స్వగ్రామంలో ఒక కుటుంబం సంసార పక్షంగా బ్రతకడానికి స్థిరపడ్డా తన వంతుకు వచ్చే అంత ఆస్తి వుంది. తల్లీ తండ్రీ, అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళూ ఉన్నారు. సాంప్రదాయమైన కుటుంబం, కుర్రవాడు మంచివాడే అని చెప్పుకుంటారు.
   సంబంధం అన్నివిధాలా అందరికీ నచ్చింది. నచ్చడమే కాదు. ఈ సంబంధం యెలాగైనా చెయ్యి మించి పోనీయకు అంటూ తండ్రి యిష్టదేవతను ప్రార్థించాడు కూడాను. అటువంటి సంబంధాన్ని పెళ్ళికూతురు తోసి పారేస్తోంది.
పెళ్లికూతురు పేరు లలిత. పదిహేనవ యేడు నడుస్తోంది. రూపసే - కాని రూపమే వర్త్‌గా తీసుకుంటే బాబూరావుని తృణీకరింపగలిగే అంత రూపసి కాదు. అందులోనే కాదు; చదువు తీసుకున్నా - లలిత వాళ్ళ పల్లెటూరిలో అయిదవ తరగతి మాత్రమే చదువుకుంది. స్థితిగతులు చూసుకున్నా - ఆమె తండ్రి పరువుగలిగి బ్రతుకుతున్న గ్రామ కరణం మాత్రం.
-అయినా యేమి చూసుకునో పెళ్లికూతురు యీ సంబంధాన్ని త్రోసి పారేస్తోంది. యెందరు యెన్ని విధాలు చెప్పినా, 'పోనీ కారణం చెప్పు' అన్నా లలిత మాటాడదు.
చివరకు అందరూ దానిని మూర్ఖురాలు అంటూ యీసడించారు. కాని నాకు మాత్రం తెలుసు - ఆమె మూర్ఖురాలు కాదనీ, ఆమె తిరస్కారానికి కారణం వుందనీ. ఆమె ఆ కారణాన్ని వెల్లడించక పోవడం వల్ల మూర్ఖురాలు అనిపించుకుంది.
లలిత పెద్ద బావగారికి విశాఖపట్నం ట్రాన్సుఫరు అయిన దగ్గర నుంచీ ప్రయాణమవుతుండెను. పెద్ద పల్లెటూరు అయిన తాతగారి వూరునూ, స్వగ్రామంనూ, మించి యింకేవూరూ చూచి యెరుగని లలితకు - విన్న దానినిబట్టి విశాఖపట్నం యందు చాలా గొప్ప అభిప్రాయం వుండెను. అక్కడ చూడవల్సినవి చాలా వుంటాయనీ, రోజులు కులాసాగా గడుస్తాయనీ లలిత నమ్మకం. తను ఆడపిల్లనని గుర్తించకపోవడం వల్ల జరిగిన పొరపాటు విశాఖపట్నంలో అడుగు పెట్టేవరకూ తట్టలేదు.
వాళ్ళ అక్క పండగకు వచ్చినప్పుడు లలిత రహస్యంగా ప్రార్థించగా చెల్లెలిని తనతో తీసుకువెళ్తానని తల్లిదండ్రులను అడిగింది. అక్కడ వుంటే కాస్త పెద్ద పట్నం కాబట్టి సంబంధం కుదరడానికి వీలుగా వుంటుందని ''తీసుకు వెళ్తున్న దానిని యెలాగా తీసుక వెళ్తున్నావు - అక్కడ దానికి సంబంధం చూసిపెట్టు'' అన్నాడు తండ్రి. అక్కడ వప్పుకొని లలితను తనతో విశాఖపట్నం తీసుకువచ్చింది.
తీరా వచ్చాక లలితకు అక్కడ జీవితం దుర్భరంగా తోచింది. పెరుగుకు బదులు మజ్జిగ కలిపిన నీళ్ళూ, ఆవు నేతికి బదులు ఆముదం వాసన వేసే నేయీ, వుప్పుడు బియ్యం, మందు కలిపిన కొళాయి నీళ్ళూ రుచి చూడవలసి వచ్చేసరికి లలిత కళ్ళు తెరిచింది. ముఖ్యంగా పొద్దు గడవడం ఒకటి లలితకు బ్రహ్మాండంగా వుంది. వచ్చిన మర్నాడు విశాఖపట్నం చూపించమని బావను అడిగింది. బావ కొంతసేపు వేళాకోళం ఆడి చూడ్డానికి ఏమీలేదని చెప్పాడు. పోనీ బజారు చూపించమంది. పట్టుకెళ్ళాడు. రెండు లారీలూ, ఒక మిలటరీ వాడూ లలితను ఢకొీన్నంత పని అయ్యేసరికి లలిత ఛీత్కారం చేసింది. మర్నాడు బీచ్‌కి తీసుకెళ్ళమంది. ''శీతాకాలం బీచేమిటి, ఎవరైనా నవ్వుతారు. అదికాక కూర్చోవడానికైనా స్థలం లేదు. సముద్రం రోడ్డును సగం కోసి పారేసింది'' అన్నాడు. ''అక్కడ కూర్చోవద్దు, ఒక్కసారి చూసి వచ్చేద్దాం పద'' అంది. వెళ్లారు. బావ ఏమీ అబద్ధం ఆడలేదనుకుంది లలిత. చలిగాలి అక్కడ వుండనిచ్చింది కాదు. యింటికి వచ్చేశారు. అంతలో విశాఖపట్నంలో లలితకు చూడవలసినవి అయిపోయాయి. యింక యింట్లో తోచక బయటపడేసిన చేపలా కొట్టుకోవడం ఆరంభించింది. యిల్లు పెద్దదే. యింట్లో వీళ్లదికాక యింకా నాలుగు కుటుంబాలున్నారు. కాని లలిత యీడు ఆడపిల్లలు ఒకరూ లేరు. పదేళ్ళకు పైన ముప్పైకి లోపు వయసు వాళ్ళు అక్క తప్పిస్తే అనూరాధ యింకొక్కర్తె వుంది. అనూరాధకు పాతిక సంవత్సరాలు పైబడ్డాయి. చాలా వుత్సాహంగా వుంటుంది. లలితతో సమంగా నవ్వి ఆడగలదు.
వయసులో పెద్దదయి కూడా కులాసాగా చిన్నపిల్లలా పేలుతూ వుంటే లలితకు ఆశ్చర్యమయింది. ''ఈవిడ యెవరే?'' అంది అక్కతో. అక్క చెప్పిన జవాబు విని నిచ్చరపోయింది లలిత.
అనూరాధ బి.ఎ. చదివిందట.
కొన్ని వందల రైల్వే సారస్వత గ్రంథాలు చదివిన లలితకు బి.ఎ. అంటే సుమారు అయిన అభిప్రాయమే వుంది.
''బి.ఎ.నా!'' అంటూ యించుమించులో నిశ్చేష్ట అయింది.
తేరుకొన్నాక వందన్నర ప్రశ్నలు వేసింది. అక్క చాలావాటికి సమాధానాలు తెలియవంది.
బి.ఎ. చదివిన ఆడది తమ పొరుగింటి వాటాలో వుండటం. తక్కిన ఆడవాళ్ళలాగే యింట్లో పనులు చేయటం; వంట వండటం, గదులు వూడ్చటం, అవసరమైనపుడు అంట్లు కూడా తోమటం!!, భర్తను గౌరవించడం, అభిమానించటం!!!, చదువుకోని వాళ్లతో - తనవంటి పల్లెటూరి బయితును కూడా మర్యాదగా సంబోధిస్తూ ఆదరణగానే మాట్లాడటం!!!! - ఒక్కొక్కటీ ఒకదానికి మించిన ఆశ్చర్యజనకమైనది యింకొకటిగా అగపడింది లలితకు.
లలిత నమ్మకం - ఆడపిల్లకు బి.ఎ. వరకూ చదువు చెప్పించే తండ్రి కనీసం లక్షాధికారి లేకపోతే ఒక కలెక్టరు ఉద్యోగి అయినా అయి వుంటాడు. ఆమెను పెళ్ళాడే వాడు ఏ లండన్‌ రిటర్న్‌రో, జమీందారో, కోటీశ్వరుడో అయి వుండాలి. యిదేదీ లేదు. వాళ్ళ వేషం చూస్తే తమకన్నా ఏమాత్రం కూడా గొప్పవాళ్ళు కానట్టు అగపడుతోంది. ఆమె భర్త కూడా బి.ఎ. ప్యాస్‌ అయాడట. యేదో మేనేజరుగా పనిచేస్తున్నాడట. ఆయన జీతంలో సగతం ఇంటికి పంపించి మిగతాలో తనూ బార్యా గడుపుకుంటారట.
వాళ్ళది లవ్‌ మ్యారేజ్‌ ఏమో అనుకుంది. అలాగ జరిగినట్టూ తెలియదట.
యీ కథంతా లలిత పాలిట యెంత ఆశ్చర్యజనకంగా వున్నా ప్రత్యక్షాన్ని నమ్మక విధిలేక నమ్మింది. వాళ్ళ అక్క అనూరాధకూ తనకూ పరిచయం చేసింది. ఆ పరిచయం మూడు రోజుల్లో ఏకవచన ప్రయోగానికి తావు కలిగించగలంత స్నేహమయి పోయింది. లలితకు అనూరాధ యందు చాలా గొప్ప అభిప్రాయం యేర్పడింది.
సహజంగా యిటువంటి స్నేహమెంతో కాలం సాగదు. కొంతమంది ఏ చిన్న విషయానికైనా చప్పున కరిగిపోతారు. కరిగి ప్రక్కనున్న వారితో అతుక్కుపోతారు. మళ్ళా ఆ చప్పున కరిగే స్వభావం వల్లే యే మాత్రం కాస్త హీట్‌ తగిలినా మళ్ళా కలియరానట్టుగా విడిపోతారు.
వీరి స్నేహం కూడా యీ విధంగానే పరిణమించింది.
ఒక మధ్యాహ్నం ఒంటిగంట వేళ లలితకు యెంత ప్రయత్నించినా నిద్రపట్టింది కాదు. లేచి అనూరాధ దగ్గరకు బయలుదేరింది. గది ద్వారం దగ్గరకు వచ్చేసరికి చిన్న సరదా పుట్టింది. దొంగతనంగా వెళ్ళి ఆమెను త్రుళ్ళిపడేటట్టు చేయాలనుకుంది. చప్పుడు కాకుండా తలుపు త్రోసి లోపలకు తొంగిచూసింది. అనూరాధ వీధి కిటికీ దగ్గర నిల్చుని నవ్వు ముఖంతో బయటకు చూస్తోంది. మెల్లగా దగ్గరకు వెళ్ళి ఆమె చూసే వంక చూడగా యెదుటింటి గదిలోంచి అనూరాధకన్నా ఒకటి రెండు సంవత్సరాలు తక్కువ వయసు తోడి యువకుడు యేవేవో సంజ్ఞలు చేస్తున్నాడు. కొద్ది సేపటిలోనే లలిత ఉనికిని గుర్తించి సంజ్ఞ చేసి లోపలికి వెళ్ళిపోయాడు. అనూరాధ తిరిగి చూసి తెల్లపోయింది. కాని చప్పున సర్దుకొని, ''యెంతసేపయి వచ్చావ్‌?'' అంది. లలిత తత్తరపడుతూ జవాబిచ్చింది.
''యిప్పుడే యిలా యింకా వస్తున్నాను''. తర్వాత యిద్దరూ మరి మాటాడలేదు. అనూరాధ వెళ్లి మంచం మీద కూర్చుంది. లలిత యిటూ అటూ తచ్చాడి టేబుల్‌ దగ్గరకు వెళ్లి యేదో పుస్తకం పేజీలు తిరగవేస్తోంది. ఒకరివంక ఒకరు తలెత్తి చూసుకోవడానికి యిబ్బందిపడ్డారు. ఉండుండి అనూరాధ అడిగింది - పట్టుకుపోతున్న గొంతుతో -
''నువ్వు చూశావా?''
లలిత తలయెత్తి అనూరాధ ముఖంలోకి చూస్తూ కొట్టుకొనే గుండెలతో, అస్వాభావికమైన గొంతుతో అబద్ధం ఆడింది. - లేదని. తర్వాత అనూరాధ యింకేమి అడగగలదు? ఒక నిమిషం గడిచాక లలిత బయటకు వెళ్ళిపోయింది.
మధ్యాహ్నం మూడింటికి మళ్ళా అనూరాధ దగ్గరకు వెళ్లింది. అనూ ఒక్కర్తే కూర్చుని చలం 'మ్యూజింగ్సు' చదువుతోంది. లలిత వచ్చాక రెండు నిమిషాల్లో పుస్తకం ముడిచి టేబుల్‌ మీద పడేసింది. అనూరాధే సంభాషణ ఆరంభించింది. కల్పించుకున్న ఆ అసహజ సంభాషణ చాలా మందంగా సాగుతోంది. కొంతసేపటి తర్వాత లలిత బయటపడింది. అడిగింది.
''ఆ యెదుటింట్లో కుర్రోడు యెవరూ?''
లలిత యిందాక అబద్ధమాడిందన్న విషయం అంతటితో అనూరాధకు రూఢి అయింది. ఒక్క గడియ ఆలోచించి చెప్పింది.
''అతడెవరో పూర్తిగా వివరాలు నాకు తెలియవు. మెడలోని జంధ్యం, మాట తీరూ బట్టి బ్రాహ్మణులబ్బాయి అని తెలుస్తోంది. కలెక్టర్‌ ఆఫీసులో గుమాస్తాగా పనిచేస్తున్నాడట''.
అనూరాధ ఆగింది. లలిత ఏదో అడగబోయి సందేహిస్తున్నావ్‌''.
లలిత నసిగి, నసుగుతూ జవాబిచ్చింది.
''ఊహూ.. ఏమీ లేదు. ఆ కుర్రాడు - అతన్ని - ''నువ్వు లలిత ఆలోచిస్తూ ఆగిపోయింది.
''ఉష్‌ - యిందాకవచ్చి సందేహమెందుకు? - ప్రేమించావా అంటావ్‌?''
లలిత అవునన్నట్టు చూసింది. అనూరాధ ఒక్క క్షణం వూరుకుని ఆరంభించింది.
''ఆ ప్రశ్నకు ఒక్క మాటలో జవాబు చెప్పలేను. అసలు జరిగినది యిదీ. మేమీ ఇంట్లోకి వచ్చినప్పట్నుంచీ వూసుపోనప్పుడల్లా యీ కిటికీ దగ్గర కూర్చుని వీధి వెంబడి వచ్చిపోయే వారిని చూస్తూ కాలం గడపడం అలవాటు. అతను ఆరు మాసాల క్రితం ఆ గదిలోకి వచ్చాడు. యెప్పుడూ ముడుచుకొనే వుండేది ఆ ముఖం. శరీరం, దుస్తులు - పరిశుభ్రతలో యేమాత్రం శ్రద్ధ కూడా వున్నట్టు అగపడేది కాదు.
''అకస్మాత్తుగా ఒక వుదయం నుంచీ అతనిలో మార్పు అగుపించింది. శుభ్రంగా మల్లెపువ్వులా తయారయ్యేవాడు. తల ఒక్కరవ్వ కూడా చదరనీయకుండా దువ్వేవాడు. చాలా బాగా పాడతాడు.
''యీ మార్పు గుర్తించగానే నాకు చాలా ఆశ్చర్యమయింది. కారణం తెలుసుకుందామని ప్రయత్నించాను. అతడి చర్యలను పరిశీలించి ఆలోచించగా - అతడు నన్ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడనీ - అదే యీ మార్పుకి కారణమనీ గ్రహించాను. కాని యిన్నాళ్ళయి లేనిది యిప్పుడీ బుద్ధి కలగడానికి కారణమేమిటా అని సందేహం కలిగింది. ఆ సందేహం కూడా తీరిపోయింది. అంతకు రెండు రోజుల ముందు సాయంత్రం అతడెందుచేతో చాలా విచారంగా అగుపించాడు. 'యేమిటా సంగతి' అనుకుంటూ అతని వంక చాలాసేపు చూశాను. అలా చూస్తున్నప్పుడు రెండు మూడుసార్లు యథాభావంగా నా వంక చూస్తూ, నేను తన వంక చూడటం గుర్తించి వుంటాడు. దానిమీద యీ విధంగా గాలిమేడలు కట్టి వుంటాడు.
''ఉబుసుపోకకు అంటూ కిటికీలోంచి ఊస్తే వుంటే దానివల్ల కలిగిన ఫలితం యిది. యింక యీ అలవాటు వదులుకోకపోతే ప్రమాదమనుకున్నాను. మర్నాడల్లా కిటికీ దగ్గరికి వెళ్ళలేదు కాని - అతడు నా కోసం చూస్తున్నాడో లేదో తెలుసుకుందామనిపించింది. మూసిన కిటికీ రంధ్రంలోంచి చూశాను, పాపం అతడు నా కోసం తన కిటికీ దగ్గరే కూర్చున్నాడు. ఆ మర్నాడు కూడా నేను కిటికీ ప్రాంతంకైనా పోకుండా జాగ్రత్తగా వున్నాను. ఒకవేళ వూర్లో లేను అని అనుకుంటాడేమోనని అనుమానం వేసి మూడవనాడు అతను వరండాలో నిల్చుని వున్నప్పుడు నేనూ బయటికి వచ్చి వీధి వరండాలో స్తంభం దగ్గర కాస్సేపు నిల్చుని అతని వైపు తల అయినా త్రిప్పకుండా లోపలకు వెళ్లిపోయాను. మూడురోజుల్లో అతడు మళ్లా మామూలుగా తయారయాడు - ముడుచుకొన్న ముఖం - ఏబ్రాసి రూపం.
''నేను ఆలోచించాను. నా సుముఖత్వం అతనికి కొంత ఆనందాన్ని కలుగజేస్తుంది. అలా వుండటం వల్ల నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ కాడికి అతనిని బాధపెట్టటమెందుకూ? ఆ ఆరంభ యవ్వనుని ఒంటరితనంలోని యాతన ఊహించి జాలి కలిగించుకున్నాను''.
''మర్నాడు మళ్ళా ఆ కిటికీ దగ్గర అతడికి దర్శనమిచ్చాను. నేను అనుకున్నట్టుగానే అతడు మళ్ళా మారాడు''.
''మా ఆవిధమైన పరిచయం కొన్నాళ్ళకు యీవిధంగా పరిణామం చెందింది. అతడు ఉదయాన్నే లేస్తూనే మేలుకొలుపులు పాడతాడు. 'లేరా: కృష్ణా; తెల్లవారె;' అన్న పాట వింటూ కళ్ళు విప్పుతాను. కిటికీ దగ్గరకు రాగానే మిలటరీ శాల్యూట్‌ చేస్తాడు. అందుకుంటాను.
తను కాఫీ త్రాగిన సంగతి - ఆఫీసుకు వెళ్ళడం - భోజనం అయినదీ లేనిదీ - ఆరోగ్యంలో మార్పులూ - ఆర్థిక చికాకులూ - మొదలైన విషయాలన్నిటి గురించి వీలుచిక్కినప్పుడల్లా ఏదో ఒకటి చెప్తూ వుంటాడు. నోరు తెరవకుండా కళ్ళూ , చేతులూ త్రిప్పుతూ అభినయరూపంగా మాటాడుతూ వుంటే నవ్వు వస్తుంటుంది. విరగబడి నవ్వుతుంటాను. అతడు రెట్టించిన ఉత్సాహం కళ్ళల్లోంచి వుట్టిపడుతుంటే చెప్తాడు. రాత్రులు నిద్రపోయేవేళ నా కోసం జోల పాటు పాడతాడు. హిందీ పాటూ, తెలుగు పాటలూ - యీ జోలపాటే - చాలా వచ్చు అతనికి. ఇందుకోసమని ప్రత్యేకంగా నేర్చుకున్నాడనుకుంటాను. చాలా బాగా పాడతాడు. నువ్వూ వినే వుంటావు''.
ఒక క్షణం ఆగి -
''యీ విధంగా మాకు రోజల్లా కులాసాగా గడుస్తూ వుంటుంది. దీనివల్ల కలిగే నష్టం యేమీ లేదు. పోతే మేము ఒకవిధమైన ఆట - సాధారణంగా ఎవరూ ఆనందించని ఆట - ఆడుకుంటున్నాము''.
అనూరాధ ఆగింది. లలిత మాటాడకుండా అనూరాధ కళ్ళల్లోకి చూస్తోంది - ఆమె మాటల వెనుక వుండే సత్యరూపాన్ని వెదుకుతూ.
అనూరాధ కోరిన సానుభూతి లలిత నుండి యే విధానా బయటపడింది కాదు. అందుచేత అంది.
''ఇందులో తప్పు వుందా?''
లలిత సమాధానంగా యెదురు ప్రశ్న వేసింది.
''ఈవిధంగా మీ శీలం చెడటం లేదా?''
ఈ ప్రశ్న విని అనూరాధ చాలా నిరుత్సాహపడింది. ఆమె విలువల ప్రకారం ఆమె చేస్తున్న దానిలో విశాల హృదయత్వం, ఆత్మ ఔన్నత్యం అగపడుతోంది ఆమెకు. పైవాళ్ళకు స్వతహాగా యిటువంటి వాటిని అర్థం చేసుకునే శక్తి వుండకపోయినా తను టీకా తాత్పర్యాలు చెప్పిన తర్వాతనైనా తన యీ కవిత్వ భావంలో అర్థం బోధపడి హర్షిస్తుందనుకుంది. అయితే - పైవాళ్ళను - తన కొలతల ప్రకారం చాలా సంకుచిత హృదయాలను ఒక చిన్న లెక్చరుతో తన స్థితికి మారాలని ఆశించడం, అనూరాధ పడిన శుద్ధ పొరపాటు. అనూరాధ చెప్పిన దాని బలం లలితను ఏమాత్రం కూడా ఆమె స్థానం నుండి కదల్చలేదు. ఒకటి రెండుసార్లు వూగినా స్థానం పట్టి కొంచంగా వదులయినా ఆమె మాత్రం అక్కడే వుంది. అందుచేత ఆమె అనూరాధ కథలో దోషాన్నే చూస్తోంది. అదే అంది. అనూరాధ చిరాగ్గా జవాబిచ్చింది.
''ఎలా!? నేనిక్కడా! అతనక్కడా! మొదట్లో అతను ఒకసారి ముద్దు పెట్టుకుంటున్నట్టు అభినయించాడు. నేను కోపంతో చూశాను. అతడు ఏమనుకున్నాడో మరెప్పుడూ అటువంటి ఉద్దేశాలు ప్రకటించలేదు. యిందులో ఒకవేళ అతనిలో కాముకత్వం వున్నా నాలో మాత్రం లేదు. నాకు భర్త వున్నాడు. నా కామం అతని వల్ల సంతృప్తినందుతుంది. అటువంటప్పుడు నేనింకొక విధంగా యెప్పుడూ ప్రవర్తించను. అవసరమేదీ?''
యీ మాటల్లో ఎంత నిజమున్నా లలిత మాత్రం ఒక్క అక్షరం కూడా నమ్మలేదు. అయినా నమ్మినట్టు అగపడుతూ వుంది.
''శరీరాలు దూరంగా వున్నంత మాత్రాన పవిత్రులవుతారా? శారీరకంగా కన్నా మానసికం చేసే వ్యభిచారమే యెక్కువ నీచం''.
యీ మాటలు అనూరాధకు తగిలి వచ్చారు. శక్తికొలది తనను తాను అణుచుకుంటూ అంది.
''నువ్వు చెయ్యటం లేదా - మానసిక వ్యభిచారం? నా ముందర చెప్పనక్కరలేదు. నీకు నువ్వయి ఆలోచించుకో. యెందరు అందమయిన యువకులతో - యీ అగపడే యువకులతో కాకపోతే కల్పించుకున్న నాయకులతో - కథలు చదివేటప్పుడు - నిద్రపట్టని రాత్రులు గాలిమేడలు కట్టేటప్పుడు - కలలలో - పెళ్ళి చూపులయిన తర్వాత చూడవచ్చిన పెళ్ళికొడుకుతో - యెన్నిసార్లు మానసికంగా వ్యభిచరించావు? నీ వళ్ళు పులకరించిందంటే, నీ వళ్ళు వేడెక్కించిందంటే, నీలో వుద్రేకం కలిగిందంటే - యివన్నీ శారీరకంగా కానప్పుడు మానసికంగా వ్యభిచరిస్తున్నప్పుడే. మానసికంగా చరించని బ్రహ్మచర్యం యే మానవమాత్రులు గడిపారు? అందరూ - నూటికి తొంభై తొమ్మిది డెసిమల్‌ తొమ్మిదీ రికరింగ్‌ - మానసికంగా చరించిన వారే -''
లలిత యీ సంభాషణ వినడానికి చాలా సిగ్గుపడుతోంది. అనూరాధ కూడా యిబ్బంది పడుతూనే వుంది. కాని ఆమె ఆ సంభాషణ ఆపే పరిస్థితిలో లేదు. అంది -
''స్త్రీ-పురుష సంబంధం గురించి ఎప్పుడు తెలిసిందో - యెప్పుడు అర్థమయిందో - అది అనుభవానికి వచ్చి వుందన్నమాట. అయితే యేమయినట్టు?''
అనూరాధ అక్కడకు కాస్త ఆగింది. లలితకు కొంచం రిలీఫ్‌ దొరికింది. ఇదే మాటలు పుస్తకాలలో చదవడానికి ఆమెకు కష్టం వుండదు. యింతకన్నా అసభ్య సంభాషణలు కూడా నిశ్చలనంగా చదవకలదు. కాని ఎరిగిన వాళ్ళతో - దగ్గర సంబంధం వున్న వాళ్ళతో యిటువంటి సంభాషణలు చాలా కంటకంగా వుంటాయి. ఆమె మాట్లాడకుండా వూరుకుంది.
అనూరాధ మళ్ళా ఆరంభించి యింకా యేదేదో చెప్పింది - తనను తాను సమర్థించుకుంటూ. బయటికి మాట్లాడకపోయినా లలిత కూడా దానిని జాగ్రత్తగానే వింటోంది. కాని ఫలితం మాత్రం శూన్యం. అనూరాధ సమర్ధన అర్థవంతమైన బలవత్తరంగా వున్నా అందంగా నిజం కాదనీ, వాళ్ళకి శారీరక సంబంధం కూడా వుండే వుంటుందనీ - జాణతనం ఉపయోగించి అసలు విషయం దాచి దానికి రంగులు పూచి చూపెడుతోందనీ - లలిత అనుకుంది, 'నేను యిటువంటి మాయమాటలకు మోసపోను' అని తనలో తాను గర్వంగా అనుకుంటూ వారి దోషాన్ని స్థిరీకరించింది. ఆమె అనుకుంది.
''అనూరాధ బి.ఎ. చదువు వూరికెనే పోలేదు. అది అవినీతి సమర్ధనకు ఉపయోగించి అవినీతి మార్గాన పడి పతిత అయిపోయింది''.
ఆవిధంగా అనూరాధ యందు చాలా చెడ్డభావం యేర్పరుచుకుంది. యువకుల యందు అంతకన్నా చెడ్డభావం ఏర్పడింది. ఆమె విన్న కథనుబట్టి ఆ అవినీతి కార్యంకు కారణం ప్రయత్నం ఆచరణం అతడివే కాబట్టి అతడామె దృష్టిలో చాలా దుర్మార్గుడుగానూ, నీచుడుగానూ, రౌడీగానూ నిర్ణయింపబడ్డాడు.
తర్వాత కొద్ది రోజులలోనే లలిత బావ యింకెక్కడా వరుడు దొరకనట్టు ఆ యువకుణ్ణే లలితకు భర్తగా ప్రతిపాదించాడు. వాడి రహస్య చరిత్ర తెలియని తన వాళ్ళంతా యిష్టపడి చాలా మంచి సంబంధంగా తలుస్తున్నారు.
కానీ గుణశీలాలకి ప్రాధాన్యత యిచ్చే భారతనారి - లలిత - ఆ దుర్మార్గుణ్ణి, నీచుడిని, రౌడీని, తెలిసి తెలిసి యెలా వరిస్తుంది?
 

(రూపవాణి : దీపావళి సంచిక, అక్టోబరు 1945)

కారా మాష్టారి కథ..

కారా మాష్టారి కథ..