Oct 03,2022 19:15

పశువుల మార్కెట్‌లో క్రయ, విక్రయాలు చేపడుతున్న రైతులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్‌
కలెక్టర్‌, మున్సిపల్‌ అధికారుల ఉత్తర్వులను స్థానిక మున్సిపల్‌, వెటర్నరీ అధికారులు బేఖాతరు చేస్తున్నారు. పశువుల్లో లంపీ స్కిన్‌ అనే ఛర్మవ్యాధి ప్రబలే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పశువులను గుంపులుగా ఉంచవద్దని సూచిస్తున్నారు. వీటిని స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు.
లంపీ స్కిన్‌ అనే ఛర్మవ్యాధి ఎద్దులు, ఆవులు, బర్రెలు, మేకలు, గొర్రెలకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, స్థానిక పశువుల మార్కెట్‌లో క్రయ, విక్రయాలు జరగకూడదనికలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వెటర్నరీ, మున్సిపల్‌ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎడి సుబ్రమణ్యం ఆచారి గ్రామాల వైద్యశాలలకు మందులు అందించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీసం పశువులకు టీకాలు, వ్యాక్సిన్‌లు వేస్తున్నారా?, లేదా? అని కూడా పట్టించుకోవడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. ఆదివారం భారీ ఎత్తున ఎద్దులు, ఆవులు, బర్రెలు, మేకలు, గొర్రెల క్రయ, విక్రయాలు చేపట్టారు. స్థానిక అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ముడుపుల మత్తులో తూలుతున్నారని విమర్శిస్తున్నారు. ఈ వ్యాధి గురించి తెలిసిన వారందరూ అవాక్కవుతున్నారు. వచ్చేవారం సంతలో చర్యలు తీసుకుంటారా.., లేదా..? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
చెప్పినా వినడం లేదు
- సుబ్రమణ్యం ఆచారి, వెటర్నరీ ఎడి

పశువుల సంత మార్కెట్‌లో క్రయ, విక్రయాలు జరపకూడదని సమావేశం ఏర్పాటు చేసి చెప్పినా వినడం లేదు. నాకు ఆరోగ్యం బాగోలేదు. త్వరలో చర్యలు తీసుకుంటాం.