May 14,2022 06:49

షెడ్యూల్డ్‌ తెగల ప్రజలు, షెడ్యూల్డ్‌ కులాల వారు, ఆ తర్వాత ఇతర వెనుకబడిన తరగతుల వారు అతి తక్కువ శాకాహారాన్ని వినియోగిస్తారని ఎన్‌ఎస్‌ఎస్‌ఒ అంచనాల్లో తేలింది. మరోవైపు, మూడింట రెండొంతుల మంది బ్రాహ్మణులు మాత్రమే శాకాహారులని ఐహెచ్‌డిఎస్‌ సర్వేలో తేలింది. మాంసాహారాన్ని తినే బ్రాహ్మణుల్లో కాశ్మీర్‌, కొంకణి, బెంగాల్‌ బ్రాహ్మణులున్నారు. ఆఖరికి తేల్చేదేమంటే, మెజారిటీ భారతీయులు క్రమం తప్పకుండా లేక ఆయా సందర్భాలలో ఏదో ఒక రూపంలో మాంసాహారాన్ని తింటారు. కేవలం శాకాహారాన్ని మాత్రమే తినడమనేది భారతదేశంలో మెజారిటీ ప్రజల సంస్కృతిలో లేదు.

నవరాత్రి ఉత్సవాల సమయంలో అన్ని రకాల మాంసం దుకాణాలను మూసివేయాలని ఏప్రిల్‌ 5వ తేదీన దక్షిణ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్‌ జిల్లా పాలనా విభాగాలు చేసిన ప్రకటనలు మెజారిటీ మతస్థులతో పాటు ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇది దక్షిణ ఢిల్లీ ప్రాంతవాసులకు కొత్త పరిణామం. కొన్ని సంవత్సరాల క్రితం దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాంసాహార వినియోగంతో పాటు కోడిగుడ్లపై కూడా నిషేధం విధించిన సంగతి దక్షిణ ఢిల్లీ ప్రాంతవాసులకు తెలుసు. ఆ తరువాత, ఘజియాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏప్రిల్‌ 2 నుండి 11 వరకు గుళ్ళకు 200 మీటర్ల దూరంలో ఉన్న మాంసం దుకాణాలను మూసివేయాలని ఉత్తర్వులను జారీ చేసింది. అయినప్పటికీ, కొన్ని మున్సిపాలిటీలు ఆ తొమ్మిది రోజుల్లో అన్ని మాంసం దుకాణాలను మూసివేయాలని ఉత్తర్వులను జారీ చేశాయి.
      ఘజియాబాద్‌ జిల్లాలో లోని అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి ఎంఎల్‌ఎ నందకిషోర్‌ గుర్జర్‌ గత కొన్ని సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాంసం దుకాణాలను మూసివేయించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా పాలనా యంత్రాంగానికి లేఖలు రాస్తున్నారు. ఇది రాజ్యాంగం లోని ఏ చట్టంలో లేకపోయినప్పటికీ, షరామామూలైంది. భారతీయ జనతా పార్టీ హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుండి మాంసం వ్యాపారస్తులకు ఆర్థిక ఇబ్బందులను కలుగజేస్తూ ఈ రకమైన నిషేధాలను విధిస్తున్నది.
      మంగళవారాల్లో మాంసాహారాన్ని తినకూడదనే ఆచారం ఉత్తర భారతదేశంలో దీర్ఘకాలంగా వున్నా, ఇది ఢిల్లీ ప్రాంతవాసులకు కొత్త పరిణామం. హిందూ మతస్థుల మనోభావాలను దెబ్బ తీసే ''దుర్వాసన'' కారణంగా ఏప్రిల్‌ 2 నుండి 11 వరకు మాంసం దుకాణాలను మూసివేయాలని కోరుతూ దక్షిణ ఢిల్లీ మునిసిపల్‌ మేయర్‌ ముఖేష్‌ సూర్యన్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. నవరాత్రి ఉత్సవాల సమయంలో హిందువులు శాకాహారాన్ని తీసుకుంటారని, మద్యం, మసాలాలు తీసుకోరని, 99 శాతం కుటుంబాలు ఆ సమయంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా ఉపయోగించవని సూర్యన్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆలయాల దగ్గర బహిరంగంగా మాంసాన్ని విక్రయించడం ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
      కానీ నవరాత్రి ఉత్సవాల సమయంలో మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయల విక్రయాలపై ఎటువంటి నిషేధం విధించలేదు. కొన్ని ఏజెన్సీల నివేదికల ప్రకారం, పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్‌ వర్మ... ముఖేష్‌ సూర్యన్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూ, నిషేధాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని అన్నారు. మాంసం విక్రయాల నిషేధంపై తూర్పు ఢిల్లీ మేయర్‌ కూడా వారితో గొంతు కలిపారు. ఈ పరిస్థితుల్లో కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, పెద్ద పెద్ద రిటైల్‌ స్టోర్స్‌ నుంచి మాంసాన్ని ఆన్‌లైన్లో తెప్పించుకొనే అవకాశం ఉంది. మాంసం విక్రయాలపై ఆధారపడే వారు...ముఖ్యంగా ముస్లింల ఆర్థిక పరిస్థితులను దెబ్బ తీయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న లక్ష్యమని అక్కడి ప్రజలు నిర్ధారణకు వచ్చారు. ఢిల్లీలో రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో బిజెపి కి అనుకూలంగా హిందువుల ఓట్ల కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు కనపడుతుంది.
    మాంసం విక్రయ నిషేధాన్ని ప్రతిపక్ష పార్టీల సభ్యులు తీవ్రంగా విమర్శించారు. తనకు ఇష్టం వచ్చిన సమయంలో మాంసం తినడానికి, మాంసం విక్రయదారులు తమ వ్యాపారాలను చేసుకునే స్వేచ్ఛను రాజ్యాంగం అనుమతించిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు మహువా మోయిత్రా ట్వీట్‌ చేశారు.
 

                                                                జెఎన్‌యు లో వివాదం

ఈ క్రమంలో దక్షిణ ఢిల్లీ మున్సిపల్‌ పరిధి లోని జెఎన్‌యు లో అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఎబివిపి) కి చెందిన విద్యార్థులు కొందరు శ్రీరామనవమి సందర్భంగా హాస్టల్లో ఒక కార్యక్రమాన్ని తలపెట్టి, ఆ సందర్భంగా హాస్టల్లో మాంసాహారాన్ని ఆ రోజు వండకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ హాస్టల్‌ కమిటీ అంతకు ముందే నిర్ణయించిన మెనూ ప్రకారంగానే తమకు మాంసం తినే హక్కు వుందని మిగిలిన విద్యార్థులు అన్నారు. వారు నిర్వహించే కార్యక్రమాన్ని అగౌరవపరిచే ఉద్దేశం తమకు లేదనీ, కానీ ఈ సందర్భంగా భిన్నమైన ఆహారపు అలవాట్లున్న హాస్టల్‌ విద్యార్థులు ఏం తినాలో నిర్ణయించే అధికారం ఒక లైసెన్స్‌గా మారకూడదని వారన్నారు. ఈ సమస్యపై టీవీ చానళ్లలో చర్చలు సైతం జరిగాయి. అయితే విద్యార్థులు హిందూ సాంప్రదాయాలను అగౌరవ పరిచారనేలా వ్యంగ్య చిత్రాలు కూడా వెలువడ్డాయి.
      భారతదేశంలో శాకాహారుల కంటే మాంసాహారులే ఎక్కువ అని తెలియజేసే రుజువులు అనేకం ఉన్నాయి. మాంసాహారాన్ని వినియోగించడం మానేసిన వారు చాలా పరిమితంగా ఉన్నారు. నవరాత్రి పండుగ సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారు. ఈ సమయంలో హిందువులు మాంసాహారం తినకుండా మానేస్తారు. కానీ ఈ సమయంలో మాంసం అమ్మకాలు, వినియోగం బాగా పడిపోయిందని తెలిపే సర్వేలు కూడా ఏమీ లేవు. ఇది చట్టవిరుద్ధంగా విధిస్తున్న నిషేధం, ఇది మాంసం విక్రయదారుల ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపే విధంగా బలవంతంగా శాకాహారాన్ని విధించడం తప్ప మరొకటి కాదు.
      గోరక్షక చట్టాలు, గొడ్డు మాంసం వినియోగాన్ని నేరంగా పరిగణిస్తూ చేసిన చట్టాల తరువాత మాంసాహారం కంటే శాకాహారమే ఉన్నతమైనదనే దానిపై ఇప్పుడు దృష్టి మళ్ళించారు. కానీ భారతీయ ఆహారపుటలవాట్లలో శాకాహారమే ప్రాథమికమైనదని చూపే రుజువులు పెద్దగా లేవు. భారతదేశంలో మాంసాహారమే (కొన్ని జంతువుల మాంసం చౌకగా లభిస్తుంది కాబట్టి) ముఖ్యమైనది. మొత్తం మాంసాహార వినియోగం, విస్తృతి కన్నా మొత్తం శాకాహారం వినియోగం, విస్తృతి చాలా తక్కువని అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్శిటీ విజిటింగ్‌ ప్రొఫెసర్లు బాలమూరి నటరాజన్‌, సూరజ్‌ జాకబ్‌ భారతీయుల ఆహారపు అలవాట్లపై సమర్పించిన పత్రంలో తెలియజేశారు.
 

                                                     శాకాహారులు కేవలం 20 శాతమే

''నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఒ)'', ''ద నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)'', ''ద ఇండియా హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ సర్వే (ఐహెచ్‌డిఎస్‌)'' వివరాల ఆధారంగానే నటరాజన్‌, జాకబ్‌ తమ పత్రాన్ని రూపొందించారు. శాకాహారం వినియోగ విస్తృతి 20 శాతానికి మించి లేదని వారన్నారు. వాస్తవమైన ఆహారపుటలవాట్ల నివేదికలపై సాంస్కృతిక, రాజకీయ ఒత్తిళ్లు వున్నట్లు రుజువులున్నాయని వారన్నారు. కాబట్టి, మాంసాహారాన్ని తినే వారి వాస్తవ సంఖ్యను తక్కువగా, శాకాహారుల వాస్తవ సంఖ్యను ఎక్కువగా చూపించి ఉండవచ్చు.
     మెజారిటీ హిందూ మతస్థులు మాంసాహారులుగా, ఐదింట రెండొంతులు శాకాహారులని ఎన్‌ఎస్‌ఎస్‌ఒ సర్వేలో తేలింది, మూడింట ఒక వంతు కంటే కొంచెం తక్కువ శాకాహారులని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ సర్వే తేల్చింది. ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లోని ఆరు రాష్ట్రాల్లో 2 శాతం మాత్రమే శాకాహారం వాడకంలో ఉంటే... అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో 5 శాతం కంటే తక్కువగా ఉంది. ఎన్‌ఎస్‌ఎస్‌ఒ సర్వే చేసిన 17 రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లో 50 శాతం పైన శాకాహార వాడకం ఉంటే, ఆరు రాష్ట్రాల్లో 20 శాతం కన్నా తక్కువగా ఉంది. హర్యానా, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో 75 శాతం పైగా శాకాహార వాడకం ఉంది. ముస్లిం, క్రైస్తవ మతానికి చెందిన ప్రజల్లో మాంసాహారం తినేవారే ఎక్కువగా ఉన్నారు. స్థానిక ఆధిపత్య సామాజిక సమూహాలకు సంబంధించిన సాంస్కృతిక రాజకీయాలతో పాటు...ఆహారపు అలవాట్లలో లింగ సంబంధమైన తేడాలకు...ప్రాంతీయ నమూనాను ఆపాదించారని నటరాజన్‌, జాకబ్‌ అంటున్నారు.
      షెడ్యూల్డ్‌ తెగల ప్రజలు, షెడ్యూల్డ్‌ కులాల వారు, ఆ తర్వాత ఇతర వెనుకబడిన తరగతుల వారు అతి తక్కువ శాకాహారాన్ని వినియోగిస్తారని ఎన్‌ఎస్‌ఎస్‌ఒ అంచనాల్లో తేలింది. మరోవైపు, మూడింట రెండొంతుల మంది బ్రాహ్మణులు మాత్రమే శాకాహారులని ఐహెచ్‌డిఎస్‌ సర్వేలో తేలింది. మాంసాహారాన్ని తినే బ్రాహ్మణుల్లో కాశ్మీర్‌, కొంకణి, బెంగాల్‌ బ్రాహ్మణులున్నారు. ఆఖరికి తేల్చేదేమంటే, మెజారిటీ భారతీయులు క్రమం తప్పకుండా లేక ఆయా సందర్భాలలో ఏదో ఒక రూపంలో మాంసాహారాన్ని తింటారు. కేవలం శాకాహారాన్ని మాత్రమే తినడమనేది దేశంలోని మెజారిటీ ప్రజల సంస్కృతిలో లేదు.
 

                                                                'శాకాహార' భావన

'హిందూ జనాభాలో అల్ప సంఖ్యాకులు 'భారతదేశ శాకాహార భావన'ను అలవర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని' ఢిల్లీ యూనివర్సిటీ చరిత్ర ప్రొఫెసర్‌ అనిరుధ్‌ దేశ్‌ పాండే తన వ్యాసంలో పేర్కొన్నారు. శాకాహారాన్ని ఆయుర్వేదం సమర్ధించిందని అనేక మంది విశ్వసించారు. చరక సంహిత లేక శుశ్రుత సంహిత లాంటి ఆయుర్వేద గ్రంథాలు అనేక అనారోగ్యాలకు మాంసాహారాన్ని నిర్దేశించాయని దేశ్‌ పాండే పేర్కొన్నారు. బిడ్డను ప్రసవించిన తల్లికి శారీరక బలహీనతను అధిగమించేందుకు నెయ్యి, నూనె, కొవ్వు పట్టిన మాంసం, మూలుగలున్న ఎముకలను తినాలని చరక సంహిత చెపుతుంది. అదేవిధంగా జ్వరం తగ్గించడానికి నల్ల దుప్పి మాంసం మంచిది కాగా, కౌజు పిట్ట తెలివితేటలు, జీర్ణశక్తిని పెంచుతుంది. నెమలి మాంసం స్వరం, తెలివితేటలు, జీర్ణశక్తి, కంటి చూపు, వినికిడి శక్తిని పెంచుతుందని ఆయన అన్నారు. ప్రాచీన భారతీయులు అనేక రకాల జంతువుల మాంసాన్ని తిన్నారని, వాటితో ప్రయోగాలు చేశారని అందుకు పురావస్తు శాస్త్రాలలో ప్రస్తావనలు వున్నాయన్నారు.
      శాకాహార వినియోగమనేది చారిత్రకంగా చూసినా, సమకాలీనంగా చూసినా ఒక కాల్పనికత. అది సాంస్కృతిక నిర్బంధ ఆచారం. ఒకవేళ రాజకీయ, సాంస్కృతిక జోక్యాల వల్ల శాకాహార వినియోగం పట్ల కఠిన ధోరణులను (మత సంబంధ పండుగల వేళల్లో మాంస విక్రయాల నిషేధం లాంటివి) అవలంబించినట్లయితే, అప్పుడది సామాజిక నిర్మాణానికి, దేశ బహుళత్వానికి సవాల్‌గా మారుతుంది.
 

( 'ఫ్రంట్‌లైన్‌' సౌజన్యంతో ) టి.కె. రాజాలక్ష్మి

laxmi