Aug 10,2020 08:50

'కుల మతాల కింద బందీ కావడం అసహ్యం నాకు. ఆధిపత్యం ఎదుట నిలబడి చేతులు కట్టుకుని నిలబడడం అసహ్యం నాకు. ఇంట్లో ఒంట్లో లేని ప్రజాస్వామ్యాన్ని సాహిత్యంలోకి సులువుగా ప్రవేశించి నిర్లజ్జ గౌరవాలు అందుకోవడం అసహ్యం నాకు.' అంటారు డాక్టర్‌ నూకతోటి రవికుమార్‌. బహుజన దక్పథంతో సమాజంలోని వివిధ సంఘటనలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ రాసుకున్న కవితలన్నింటినీ ఇటీవలే 'కంచెమీద పక్షిపాట' పేరిట ఓ సంకలనాన్ని వెలువరించాడు. 'ఎగరగల పక్షులు ఉంటాయి/ మరణాన్ని వెక్కిరిస్తో/ శత్రువుపై కత్తి దూసే/ నవలోకపు పక్షులుంటాయి/ గుర్తించే కళ్లు లేక/ కూనరిల్లే మనుషులుంటారు' (కంచెమీద పక్షి పాట). ప్రశ్నించే తత్వం, పోరాడే తత్వం ఉన్నవారు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని నిలబడగలుగుతారు. వారి రెక్కల్ని కత్తిరించినా, బంధించినా బోనులను ధ్వంసం చేసి కరెంటు తీగల మీద స్వేచ్ఛాగీతం పాడుతూ చిరునవ్వుల సంతకాలు చేస్తారు వాళ్లు అంటారు ఈ కవి. ఏది పడితే అది రాస్తే దానికి ఏం ప్రయోజనం ఉంటుంది? రాస్తున్నప్పుడు అడ్డు పడుతున్న ముళ్లను, రాళ్లను ఏరి పారేయాలి. గడ్డిని, గరిక పొదను తొలగించాలంటాడు కవి. 'దుక్కి దున్నినట్టు/ బీళ్లను చుట్టి ముట్టినట్టు/ చెట్లూ చెలకలు కొట్టి/ ఎగుడు దిగుళ్ల నేలను చదును చేసినట్టు/ రాయడం చేతనవ్వాలని' (నడక నేర్చుకుందాం) అంటాడు.
'దళిత మైనారిటీ గుండెల మీద ఇప్పటి సామూహిక యుద్ధం పేరు దేశభక్తి' అంటాడు ఈ కవి. ఒక తోడేళ్ల గుంపు కాషాయం వేసుకుని ఉన్మాద గీతం ఆలపిస్తోందనీ, నాకు బువ్వపెట్టే భూమిని వాడు యుద్ధరంగంగా దురూహ చేస్తున్నాడంటూ 'పసిపాదాలకు భూమివ్వని దేశం/ చిరునవ్వులకు నీడనివ్వని దేశం/ మట్టి స్వరాలకు చెవొగ్గని దేశం/ శిథిలాల మీద కాషాయం ప్రవహించాలనే దేశం' (మట్టి పులకలు) ఇవాళ గొప్పదిగా చలామణి కావడాన్ని ఏ చరిత్రా క్షమించదని ఆగ్రహిస్తాడు. అందుకే తనకొక దేశం కావాలంటున్నాడు. ఆ దేశంలో దళిత, మైనారిటీ, పేద వర్గాల అభివద్ధిని కాంక్షిస్తున్నాడు. స్వేచ్ఛా జీవనం కోసం ... 'నిజాల్ని పాతరేయని దేశం/ శంభూకుడి, ఏకలవ్యుడిని చంపని దేశం/ రైతు ఆత్మహత్యలు లేని దేశం/ మెదళ్లలోకి మతోన్మాదం లేని దేశం' (ఒక దేశం కావాలి) కావాలని కలలు కంటున్నాడు. కవికి మట్టి అంటే ఎనలేని ప్రేమ. మట్టిని ముట్టుకోని వాడు, మట్టి చెప్పే కతలను, వెతలను విననివాడు ఎవడైనా దేశద్రోహి కిందనే లెక్క కడతాడు. 'పోరా...పో/ చల్లని మట్టిలో/ చెప్పు లేని కాళ్లతో కల దిరుగు/ మట్టి మీద చెవొగ్గి/ నీ జన్మ రహస్యం విను' (దేశభక్తి) ప్రబోధిస్తాడు.
'ఈమెతో స్నేహం చేయాలని ఉంది' అనే కవితను మలిచిన తీరు చాలా అద్భుతంగా ఉంది. ఎండ ఎరుగని ఓ సాథ్విని పల్లెల్లోకి చిటికెన వేళ్లతో పట్టుకొని నడిపించి లోకం బతుకును చూపాలని, ఆమె కప్పుకున్న చెంగును, దిద్దుకున్న తిలకం సృష్టించిన చేతుల్లోని రేఖలు ఇంకా మారనే లేదని చెప్పే ప్రయత్నం విభిన్నంగా ఉంది. 'ఎండకన్నెరుగని సాథ్వీ.../ ఓసారి పొలంలో కలుపు తీరు/ ఎర్రటి ఎండల్లో కుప్పనూర్చు/ పరిగె చేలో నిలబడి చెంగు చాపి/ గింజల కోసం అర్థించు/ ఓసారి పల్లెలో పుట్టి/ వెలివేతల సరపరం చవిచూడు/ ఒక్కసారి వెలివాడల తల్లుల చెల్లిగా పుట్టు/ ఒకే ఒక్కసారి జోగిని గానో, బసివిని, మాతంగిగానో / ఊరి జనాల ఈలల మధ్య సిందెరు' అంటూ ఆధిపత్య కులాల మధ్య వెలివేయబడ్డ బతుకులను, అవమానాలతో పాటుగా ఇప్పటికీ చెలామణీ అవుతున్న దురాచారాల వ్యవస్థను బట్టబయలు చేస్తాడు. ఈ కవితా సంపుటిలో త్రిపురనేని శ్రీనివాస్‌, చెన్నయ్య, కాలేకూరి, పూలన్‌ దేవి, రామలింగం తదితర సంస్మరణ కవితలతో పాటు రోహిత్‌, మధుకర్‌, కోటేశు, అఖ్లాక్‌ నెత్తుటి చరిత్ర, చుండూరు, లక్ష్మింపేట, రోహింగ్యాల దు:ఖ ప్రస్తావన మనల్ని ఆలోచింపజేస్తాయి. చాలా కవితలు సామ్రాజ్యవాదంపై దండెత్తుతాయి. కుల వ్యవస్థను, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తాయి. బహుజన దక్పథంతో ఆలోచిస్తూ, అడుగులేస్తూ దోపిడి లేని నవ సమాజ నిర్మాణాన్ని ఆకాంక్షిస్తాయి.
(ప్రచురణ: సిక్కోలు బుక్‌ ట్రస్ట్‌, పేజీలు: 120, వెల : 110,ప్రతులకు: 98481 87416)
- బిల్ల మహేందర్‌
91776 04430