Jul 29,2021 07:25

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్‌లో పెగాసస్‌ నిఘా వ్యవహారం, రైతు సమస్యలపై బుధవారం కూడా ప్రతిపక్షాలు తమ ఆందోళన కొనసాగించాయి. ప్రధానమైన ఈ అంశాలపై చర్చ చేపట్టాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం నిరాకరించడంతో ప్రతిపక్షాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని నినాదాలు హౌరెత్తించారు. లోక్‌సభలో పలువురు సభ్యలు పేపర్లు చించి పైకి విసిరేశారు. అవి స్పీకర్‌ ఛైర్‌, కేంద్ర మంత్రులు, ట్రెజరీ బెంచ్‌ల వైపు ఎగిరాయి. దీంతో సభలో ఒకింత ఉద్రిక్తత నెలకొంది. ప్రతిపక్షాల నిరసనహోరుతో ఉభయ సభలు పదేపదే వాయిదా పడ్డాయి. ఈ ఆందోళనల నడుమే ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఎటువంటి చర్చ జరగకుండా ముజువాణి ఓటుతో పలు బిల్లులు ఆమోదం పొందాయి. రాజ్యసభలో జువెనైల్‌ జస్టిస్‌ సవరణ బిల్లును ఆమోదం పొందింది. లోక్‌సభలో కేటాయింపులకు సంబంధించిన రెండు బిల్లులు, దివాలా బిల్లు ఆమోదం పొందాయి.
ఎంపీల సస్పెన్షన్‌కు సర్కార్‌ యోచన !
అయితే లోక్‌సభలో పేపర్లు విసిరేసిన ఘటనను సాకు చూపి గురువారం నాడు ఏకంగా పది మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేయాలని మోడీ సర్కార్‌ యోచిస్తున్న ట్లు సమాచారం. ఈ మేరకు సభలో తీర్మానం ప్రవేశ పెటా ్టలని కూడా అధికార పక్షం ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది. రూల్‌ నెంబర్‌ 374 (2) కింద పార్లమెంట్‌ను అగౌరవపరిచారనే పేరిట కాంగ్రెస్‌ ఎంపిలు మణికం ఠాగూర్‌, డిన్‌ కురియాకోస్‌, హిబి ఈడెన్‌, ఎస్‌ జ్యోతిమణి, రావనీత్‌ బిట్టు, గుర్జీత్‌ ఆజ్లా, టిఎన్‌ ప్రతాపన్‌, వి వైతిలింగం, సప్తగిరి శంకర్‌, దీపక్‌ బైజ్‌, సిపిఎం ఎంపి ఎఎం ఆరిఫ్‌ను సస్పెండ్‌ చేయాలని తీర్మానం పెట్టనున్నట్లు సమాచారం.