Feb 06,2023 15:11
  • కనీస వేతనాలు అమలు చేసి,సమస్యలు పరిష్కారం చేసే వరకు పోరాటం
  • ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పెర్స్ యూనియన్ నాయకులు హెచ్చరిక

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూట్ ఇవ్వాలని, ఫేస్ యాప్ రెడ్డు చెయ్యాలని, అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలని, ఇతర సమస్యలు పరిష్కారం కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వేలాదిమంది అంగన్వాడీ వర్కర్స్ ధర్నా చేపట్టి కథం తొక్కారు. ఉదయం 10గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది చేరుకొని కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదుట బైటాయించారు. ధర్నాను ఉద్దేశించి ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హల్పెర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పైడిరాజు, అనసూయ, సిఐటియు జిల్లా అద్యక్ష, ప్రధాన కార్యదర్శి లు పి.శంకరరావు, కె.సురేష్ లు మాట్లాడుతూ  రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సెంటర్ పరిధిలోని పేద గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకి అనేక సేవలు అందిస్తున్నారన్నారు. అంగన్వాడీ సెంటర్లో మౌలిక వసతులు లేవు. కొన్ని కేంద్రాలలో, అసలు విద్యుత్ సౌకర్యంలేదు. విద్యుత్ సౌకర్యం ఉన్న ప్రభుత్వం బిల్లులు చెల్లించటంలేదు. టీఏ, డీఏలు గత 5 సం॥లు కాలంగా ప్రభుత్వం చెల్లించడంలేదు. వైఎస్సాఆర్ సంపూర్ణ పోషణ అమలుకు కొన్ని ప్రాజెక్టుల్లో గత 6 నెలల నుండి బిల్లులు చెల్లించలేదు. దీని వలన అంగన్వాడీలు అప్పులుచేసి లబ్దిదారులకు ఆహారం వండిపెడుతున్నారన్నారు. రకరకాల యాప్లు తీసుకొచ్చి పనిభారం పెంచారు. కానీ వేతనాలు పెంచలేదు. అంగన్వాడీలకు ఇచ్చిన ఫోన్లు పనిచెయ్యడం లేదు. గ్రామాల్లో నెట్ సౌకర్యం ఉండటం లేదు. ఫేస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారన్నారు.