
ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి ఏజెన్సీలోని అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు తమ సమస్యల పరిష్కారం కోసం పాడేరులో సోమవారం భారీ ర్యాలీ, కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. స్థానిక మోదకొండమ్మ గుడి నుంచి కలెక్టరేట్ వరకు రెండు కిలోమీటర్ల దూరం భారీ ర్యాలీ కొనసాగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి రెండు గంటల సేపు బైఠాయించారు. అంగన్వాడీలకు ఫేస్ యాప్ రద్దు పరచాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, జీతంలో సగం పెన్షన్, ఉద్యోగ భద్రత కల్పించి తమపై వేధింపులను అరికట్టాలని అంగన్వాడి వర్కర్లు నినాదాలు చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగమ్మ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగింది.
సమస్యల పరిష్కారంపై కాలయాపన : ఉమా
ఈ సందర్భంగా సిఐటియు ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం పట్ల తీవ్ర కాలయాపన చేస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్‌వాడీలు తన అక్కా చెల్లెలు అని ఆడపడుచులు అంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీలపై పని ఒత్తిడి పెంచి, జీతాలు మాత్రం పెంచలేదన్నారు. కొత్త యాప్‌లతో అంగన్‌వాడీలు సతమతమవుతున్నారన్నారు. వీరిపై రాజకీయ వేధింపులు అరికట్టి, సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేసి రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
2 నెలలుగా వేతనాలు ఏవీ? : పడాల్
సిఐటియు జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ, అంగన్వాడీల పట్ల ప్రభుత్వం తీరు చాలా దుర్మార్గంగా ఉందని రెండు నెలల నుంచి జీతాలు లేవని తెలిపారు. నాణ్యమైన సరుకులు పంపిణీ చేయకుండా తనిఖీల పేరుతో అంగన్వాడీలపై రాజకీయ పెత్తనం, వేధింపులు తీవ్రమయ్యాయని అన్నారు. కేవలం రూ.150 రూపాయల జీతం నుంచి పనిచేస్తున్న అంగన్వాడి వర్కర్లు నేటికీ చాలా మంది ఉన్నారని చెప్పారు. మినీ అంగన్వాడీ కేంద్రాల్లో వర్కర్ పని ఆయా పని ఒక్కరే చేస్తున్నారని, తక్కువ వేతనం ఇస్తున్నారని, ఇది చాలా అన్యాయమని తెలిపారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి, సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించుకుంటే అసెంబ్లీ ముట్టడి చేపడతామన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద జిల్లా జాయింట్ కలెక్టర్ జె.శివ శ్రీనివాస్‌కు అంగన్వాడి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. దీనిపై ఆయన స్పందించి వినతి పత్రంలో ఉన్న అంగన్వాడీ వర్కర్ల సమస్యలను ఆయన చదివి వినిపించి అంగన్వాడి సమస్యలపై ప్రభుత్వానికి వివరిస్తామని, జిల్లా స్థాయిలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్‌తో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ ముఖ్య నాయకుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బాలదేవ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎల్.సుందర్రావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్లు కళావతి, పెంటమ్మ, పెద్ద ఎత్తున అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.