
జోహన్నెస్‌బర్గ్ : ప్రపంచంలో అగ్రరాజ్యల మధ్య పోటీలో దక్షిణాఫ్రికా లాగబడదని ఆ దేశ అధ్యక్షులు సిరిల్ రమాఫోసా స్పష్టం చేశారు. ఆఫ్రికా దినోత్సవం సందర్భంగా జోహన్నెస్‌బర్గ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రమాఫోసా మాట్లాడుతూ ఆఫ్రికా ఖండం తరచుగా తమది కాని వివాదాల్లోకి లాగబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికా తన స్వతంత్ర, అలీన విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. 'దక్షిణాఫ్రికా అగ్రరాజ్యాల పోటీలో పాల్గనదు. లాగబడదు. సంఘర్షణలు ఎక్కడ జరిగినా శాంతియుత పరిష్కారానికి మా వైఖరి కొనసాగిస్తాం' అని చెప్పారు.
ప్రస్తుతం జరుగుతున్న రష్యాాఉక్రెయిన్ సంక్షోభంలో దక్షిణాఫ్రికా అలీన వైఖరి అవలంభిస్తున్నందుకు దక్షిణాఫ్రికాపై అమెరికా ఆగ్రహంతో ఉంది. రష్యాకు దక్షిణాఫ్రికా ఆయుధాలు అందచేస్తుందని కూడా ఆ దేశంలోని అమెరికా రాయబారి రూబెన్ బ్రిగేటి ఆరోపణలకు దిగారు. అయితే ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని దక్షిణాఫ్రికా ఖండించింది.