May 17,2022 22:22

మహిళలతో మట్లాడుతున్న ఆహారభద్రత బృందం

ప్రజాశక్తి - ఆమదాలవలస: పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించడం కేంద్ర ప్రభుత్వం ధ్యేయమని జాతీయ ఆహార భద్రత బృందం నోడల్‌ అధికారి నిర్మల్‌ చిట్టొరా అన్నారు. మంగళవారం మున్సిపాలిటీలోని రెండో వార్డు కృష్ణాపురంలోని 71, అన్నిపేటలోని 15వ నెంబరు రేషన్‌ డిపోలను పరిశీలించారు. రేషన్‌కార్డుదారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్‌ డిపోల ద్వారా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పిఎం గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన బియ్యం లబ్ధిదారులకు అందుతున్నాయా? నాణ్యతగా ఉన్నయో, లేదో అడిగి తెలుసుకున్నారు. రేషన్‌ డిపోల ద్వారా ఇతర సరుకులు ఏమైనా కావాలా? అని కార్డుదారులను కోరారు. గోధుమలు, వంట నూనె కూడా సరఫరా చేయాలని ఆహార భద్రతా బృందం దృష్టికి కార్డుదారులు తీసుకొచ్చారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని వారు తెలిపారు. వాలంటీర్లు రికార్డులను నిర్వహించి కార్డుదారులు రేషన్‌ తీసుకుంటున్నారో, లేదో పరిశీలించాలని సూచించారు. ఈ బృందం రాష్ట్రంలోని శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, ఎన్‌టిఆర్‌, నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో అధికారులతో కలిసి రేషన్‌కార్డుదారుల అభిప్రాయాలను తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య ఉందని, రేషన్‌ డిపోల ద్వారా కిరోసిన్‌ ఇవ్వాలని పలువురు మహిళలు కోరారు. బృందం సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉజ్వల యోజన గ్యాస్‌ను సరఫరా చేస్తోందని, దీంతో కిరోసిన్‌ సరఫరా నిలిపివేసినట్లు చెప్పారు. ఒకవేళ కిరోసిన్‌ ఎవరికైనా కావాలంటే విద్యుత్‌ పంపిణీ సంస్థలను అడగాలని చమత్కరించారు. కార్యక్రమంలో మంగీలాల్‌ చింపు, జి.మురళీనాథ్‌, ఎం.సృజన, ఎస్‌.విశ్వేశ్వరరావు, పౌర సరఫరాలశాఖ డిప్యూటీ తహశీల్దార్‌ జిఎల్‌ఇ శ్రీనివాసరావు, విఆర్‌ఒ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.