May 12,2022 20:41

ముంబయి : వరుసగా ఐదో సెషన్‌లో దేశీయ స్టాక్‌ మార్కెట్లలో భారీ నష్టాలు సంభవించాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, ద్రవ్యోల్బణ భయాల ఫలితంగా గురువారం నాటి ట్రేడింగ్‌లో మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ ఏకంగా 1100 పాయింట్లకు పైగా పతనమై 53వేల మార్క్‌ దిగువకు పడిపోగా.. నిఫ్టీ 16వేల మైలురాయిని కోల్పోయింది. 53,608 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్‌ ఆద్యంతం భారీ నష్టాల్లోనే సాగింది. ఒకానొక దశలో 52,702 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరకు 1158.08 (2.14శాతం) పాయింట్లు దిగజారి 52,930.31 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ కూడా 15,735.75 - 16,041 మధ్య కదలాడింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 359.10 (2.22 శాతం) పాయింట్లు నష్టపోయి 15,808 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు క్షీణించి 77.44గా ఉంది. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. ముఖ్యంగా క్యాపిటల్‌ గూడ్స్‌, ఆటోమొబైల్‌, బ్యాంకింగ్‌, లోహ, చమురు, విద్యుత్‌, ఫార్మా, రియల్టీ రంగ సూచీలు 1-4శాతం మేర కుంగాయి. నిఫ్టీలో అదానీపోర్ట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, టాటా స్ట్రీల్‌ హిందాల్కో భారీ నష్టాలను చవిచూశాయి. కేవలం విప్రో మాత్రమే లాభపడటం గమనార్హం.