Oct 01,2022 19:49
  • సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తూ ప్రకటన

ఇండియా న్యూస్‌ నెట్‌వర్క్‌ - న్యూఢిల్లీ : మహిళలందరికీ సురక్షితమైన అబార్షన్‌ చేయించుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఐద్వా) స్వాగతించింది. అలాగే సురక్షితమైన అబార్షన్‌కు ఆరోగ్య వ్యవస్థలో తగిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విన్నవించింది. ఈ కేసు నేపథ్యాన్ని పేర్కొనడంతో పాటు సుప్రీం తీర్పును విశ్లేషిస్తూ ఐద్వా శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
వివాహితలు ఎదుర్కొనే పరిస్థితులనే అవివాహితలు కూడా ఎదుర్కొంటున్నపుడు వారికి కూడా 20 నుండి 24 వారాల వయస్సు గల గర్భాన్నైనా సురక్షితంగా, చట్టబద్ధంగా గర్భస్రావం చేయించుకునే హక్కు వుందని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇదే కేసులో మొదట ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగెన్నీ యాక్ట్‌, 1971 (ఎంటిపి యాక్ట్‌)లోని సెక్షన్‌ 3(2)(బి), మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగెన్సీ రూల్స్‌, 2003 (ఎంటిపి రూల్స్‌)లో 3బి నిబంధన ఈ కేసుకు వర్తించదని పేర్కొంది. ఎందుకంటే ఇక్కడ గర్భవతి అయిన మహిళ అవివాహిత అని, పరస్పర అంగీకార సంబంధం వల్ల ఆమె గర్భవతి అయిందని హైకోర్టు పేర్కొంది. ఇటువంటి కేటగిరీల్లోని మహిళలకు నిబంధనలు నిర్దేశించిన మేరకే 20 నుండి 24 వారాల వయస్సు గల గర్భాన్ని తొలగించుకోవడాన్ని ఎంటిపి చట్టం, 1971లోని సెక్షన్‌ 3(2)బి అనుమతిస్తోంది. అదే సమయంలో గర్భాన్ని కొనసాగించడం వల్ల సదరు యువతి ప్రాణానికే ముప్పు కలుగుతుందని భావించినా, లేదా ఆమె శారీరక, మానసిక అనారోగ్యానికి కారణమవుతుందనుకున్నా లేదా కడుపులో వున్న బిడ్డ తీవ్రమైన శారీరక, లేదా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసినా సదరు గర్బవతి ఆ గర్భాన్ని తొలగించుకోవచ్చని ఇద్దరి కన్నా ఎక్కువమంది డాక్టర్లు అభిప్రాయపడితే అబార్షన్‌కు అనుమతిస్తారు. గర్భస్రావానికి అర్హులైన మహిళల కేటగిరీలను ఎంటిపి చట్టంలోని సెక్షన్‌ 3(2)(బి) అందచేస్తోంది. అయితే ఇక్కడ 3బి నిబంధనను కేవలం వివాహితలైన మహిళలకే పరిమితం చేయడమంటే సంకుచితమైన భాష్యాన్ని చెప్పడమేనని సుప్రీం కోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది. పైగా అవివాహితల పట్ల ఈ నిబంధన వివక్షను ప్రదర్శిస్తోందని పేర్కొంది. రాజ్యాంగంలోని 14వ అధికరణను కూడా ఉల్లంఘిస్తోందని పేర్కొంది. వివాహితకు ఇస్తున్న అవకాశం మాదిరిగానే అవివాహితకు కూడా ఆ బిడ్డను మోయాలా వద్దా అని నిర్ణయించుకునే అవకాశాన్ని రాజ్యాంగం లోని 21వ అధికరణ ఇస్తోందని సుప్రీం కోర్టు పేర్కొంది. పునరుత్పాదక ప్రతిపత్తికి, పరువు, గోప్యతలకు గల హక్కును 21వ అధికరణ సమర్ధిస్తోంది.
కేవలం సిస్‌జెండర్‌ మహిళలకే కాకుండా సురక్షితమైన గర్భస్రావాలు అవసరమైన వారందరికీ ఈ తీర్పు వర్తింపచేయాలని సుప్రీం కోర్టు పేర్కొంది. రూల్‌ 3బి కింద కేటగిరీలన్నీ కూడా సమగ్రంగా లేవని పేర్కొంది. పైగా, భౌతిక పరిస్థితుల మార్పులకు లోనయ్యే మహిళలందరికీ వర్తింప చేయాలని అర్ధం చేసుకోవాలని కూడా పేర్కొంది. సిస్‌జెండర్‌ అంటే ఇక్కడ ా లింగం గుర్తింపు (జెండర్‌ ఐడెంటిటీ), వారి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్‌)కు, వారు పుట్టినపుడు కేటాయించిన జీవసంబంధమైన లింగాని(బయోలాజికల్‌ సెక్స్‌) కి సరిపోయే వ్యక్తులను సూచిస్తుంది. ఈ తీర్పు నేపథ్యంలో సిస్‌జెండర్‌ మహిళలు కాకుండా ట్రాన్స్‌జెండర్‌ పురుషులకు (ఆడపిల్లలుగా పుట్టినా కూడా తమని తాము పురుషులుగా భావించేవారు) కూడా సురక్షితమైన గర్భస్రావాలకు అనుమతించాల్సిన అవసరం వుంది.

  • మైనర్ల విషయంలో..

మైనర్ల మధ్య లైంగిక కార్యకలాపాలను (పరస్పర అంగీకారంతోనైనా లేదా అనంగీకారంతోనైనా) పోక్సో (లైంగిక నేరాల నుండి బాలల రక్షణ) చట్టం, 2012 నేరపూరితంగా పరిగణిస్తోంది. పోక్సో చట్టంలోని సెక్షన్‌ 19(1), పునరుత్పాదక ఆరోగ్య సంరక్షణ చర్యలను తీసుకోనివ్వకుండా మైనర్లను తరచుగా నివారిస్తున్న నేపథ్యంలో మైనర్లు లేదా వారి గార్డియన్ల అభ్యర్ధన మేరకే ఆర్‌ఎంపిలు అబార్షన్‌ను చేస్తున్నారని సుప్రీం కోర్టు పేర్కొంది. అటువంటి సమయంలో మైనర్ల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు, దానికి తోడు, ఒకవేళ ఆ తర్వాత క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ చేపట్టినా డాక్టర్లు ఆ మైనర్‌ వివరాలు వెల్లడించకూడదు.

  • వైవాహిక అత్యాచారంపై..

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడంలో విఫలమైన ఢిల్లీ హైకోర్టు చీలిక తీర్పుపై ఐద్వా ప్రస్తుతం సుప్రీం కోర్టులో అప్పీల్‌ చేసింది. రాజ్యాంగం ప్రకారం, మహిళల సమ్మతి, స్వయంప్రతిపత్తి ప్రాధాన్యతను గుర్తించేలా సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పును ఐద్వా స్వాగతించింది. ఎంటిపి రూల్స్‌లోని 3బి నిబంధన కింద 'అత్యాచారం' పరిధిలోకి వైవాహిక అత్యాచారం కూడా వస్తుందని, అనుమతి, ఇష్టం లేకుండా జరిగే లైంగిక కార్యాచరణ ఏదైనా అది వివాహ బంధంలోనైనా లేదా వెలుపలైనా సరే అత్యాచారంగానే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహితకు, అవివాహితకు మధ్య కృత్రిమమైన తేడా రాజ్యాంగపరంగా సరైనది కాదని కోర్టు వ్యాఖ్యానించింది.
90వ దశకం నుండి వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని ఐద్వా డిమాండ్‌ చేస్తూ వస్తోంది. భారతీయ శిక్షా స్మృతి నుండి వైవాహిక అత్యాచార మినహాయింపును తొలగించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ అనేక పిటిషన్లు కూడా అందచేసింది. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో మహిళల శారీరక స్వయంప్రతిపత్తి హక్కులు, సురక్షితమైన అబార్షన్‌కు గల అవకాశాలు మరింత బలపడతాయని ఐద్వా ఆశిస్తోంది. సురక్షితమైన అబార్షన్‌కు ఆరోగ్య వ్యవస్థలో తగిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఐద్వా కోరుతోంది. లేని పక్షంలో అబార్షన్‌ హక్కు కోసం మహిళలు మరిన్ని రిస్క్‌లను ఎదుర్కొనాల్సి వుంటుంది.