Jan 10,2022 08:45

ఒక పెద్ద మర్రిచెట్టుపై అనేక పక్షులు గూళ్ళు కట్టుకుని కాపురముండేవి. అదే చెట్టుపై కోతులూ, చెట్టుకన్నాలలో ఎలుకలు, ఆ చెట్టుకు సమీపంలో బొరియలు చేసుకుని కుందేళ్ళు నివసిస్తుండేవి. కానీ ఇవన్నీ కలిసికట్టుగా ఉండేవి కాదు. ఈ విషయం తెలుసుకున్న త్రాచుపాము ఒకటి ఎలుకలను, పక్షి గుడ్లను తినేస్తూ ఉండేది. ఇదంతా అక్కడే ఉన్న కోతులు చూస్తూ ఉన్నా పట్టించుకునేవి కాదు. అలాగే వేటగాళ్ళు అప్పుడప్పుడు వచ్చి, ఆ చెట్టుపై ఉండే చిలుకలను తుపాకీలతో పేల్చి చంపి తమతో తీసుకుపోయేవారు. కోతులు పట్టే వాళ్ళు వల పన్ని, వాటిని పట్టుకెళ్ళి సర్కస్‌ వాళ్ళకి అమ్మేసేవారు. అలాగే కుందేళ్ళకు క్యారట్‌ ముక్కలు ఎరగా వేసి, వాటిని వలలో చిక్కించుకుని తీసుకెళ్లేవారు. కొంతకాలానికి జంతువుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఐకమత్యం లేకపోతే ఒకనాటికి తమలో ఏ ఒక్కరూ మిగలరు అనే విషయాన్ని జంతువులు గుర్తించాయి. ఒకరోజు రహస్యంగా సమావేశమయ్యాయి. ఇకపై కలిసికట్టుగా ప్రమాదాల నుంచి తమను తాము రక్షించుకోవాలని నిర్ణయించుకున్నాయి.
ముందుగా తమకెంతో నష్టాన్ని చేస్తున్న త్రాచుపాము సంగతి చూడాలని అనుకున్నాయి. కోతులు ఒక పథకాన్ని పన్నాయి. తాము నివసిస్తున్న చెట్టుకు దగ్గరలోని ఒక తుమ్మచెట్టు దగ్గరకు వెళ్లి, జిగురును తీసుకొచ్చాయి. దానిని మర్రిచెట్టు కాండం చుట్టూ పై వరకూ రాస్తూ వచ్చాయి. అలాగే సమీపంలోని కొబ్బరిచెట్లకు కట్టిన ముళ్ళ రేకుల చట్రాన్ని జాగ్రత్తగా ఊడదీసుకొచ్చి, ఆ మర్రిచెట్టు కాండానికి చుట్టూ బిగించాయి. ఇది తెలియని త్రాచుపాము పక్షుల గుడ్లను తినడానికని ఆచెట్టు పైకి పాకుతూ వచ్చేసరికి తుమ్మ జిగురుకి పాము చర్మం అతుక్కుపోయింది. అలాగే ఆ ముళ్ళరేకు చట్రం రేకులు గీసుకుపోయి, ఎటూ కదలలేకుండా చెట్టుకు అతుక్కుపోయింది. అంతే కాకులు పెద్దగా అరవసాగాయి. దాంతో ప్రజలు అక్కడకు చేరి త్రాచుపాముని చంపేశారు.
అలాగే వేటగాడి బారి నుండి చిలుకలను కాపాడడానికి కాకులు ఓ చక్కని పథకాన్ని పన్నాయి. వేటగాడు వచ్చిన అలికిడి ఎవరు గ్రహించినా తమకు అర్థమయ్యేలా అరవమని చెప్పాయి. అప్పుడు సమయం చూసి వాడి చేతిలో తుపాకీని తన్నుకుపోతామని, వాడి తలపై కాళ్ళ గోర్లతో గీరతామని, ముక్కుతో వాడిని పొడిచి భయపడి పారిపోయేలా చేస్తామని చెప్పాయి.. అలాగే చేశాయి. దాంతో వేటగాడు మరోసారి ఆ వైపు రాలేదు.
    సర్కస్‌ వాళ్ళకు అప్పజెప్పిన కోతులను చిలుకలు రక్షించాలని నిర్ణయించుకున్నాయి. రాత్రి సర్కస్‌ వాళ్లు నిద్రపోయిన తర్వాత కోతులకు కట్టిన తాడును నెమ్మది నెమ్మదిగా కొరికి తెంపివేశాయి. అలా కోతులను చిలుకలన్నీ కలిసి రక్షించాయి. కుందేళ్ళను రక్షించే వంతును ఎలుకలు తీసుకున్నాయి. పచ్చికబయళ్లు తింటున్న కుందేళ్లపై వేటగాడు వల విసిరి, పక్కకు వెళ్లాడు. అదే అదునుగా చూసి ఎలుకలు వల తాళ్లను కొరికి, కుందేళ్లను కాపాడాయి.
అలా అన్ని జంతువులు, పక్షులు ఐకమత్యంతో కలిసిమెలిసి ఉంటూ ఒకరిని ఒకరు రక్షించుకుంటూ హాయిగా జీవించసాగాయి.

కొమ్ముల వెంకట సూర్యనారాయణ
99496 02721