May 05,2021 08:57
  • ఆలిండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నాయకులు అప్పలరాజు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖ) : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఏర్పడిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ఐక్య పోరాటాలతో రక్షించుకుందామని ఆలిండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా విశాఖ నగర నాయకులు దౌలపల్లి అప్పలరాజు అన్నారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిల పక్ష కార్మిక, ప్రజా సంఘాల వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలు 33వ రోజుకు చేరాయి. మంగళవారం చేపట్టిన దీక్షలను అప్పలరాజు ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటికే అన్ని సంఘాలనూ, మేధావులనూ, అభ్యుదయవాదులనూ కలుపుకుంటూ పోరాటం కొనసాగిస్తున్నామని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌కు నష్ట్లాలు వస్తున్నాయంటూ మోడీ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. సొంత గనులు కేటాయించకుండా ప్లాంట్‌ ఉసురుతీసే కుట్రలు చేస్తోందన్నారు. వాస్తవానికి విశాఖ ఉక్కు కర్మాగారం కొంతకాలంగా లాభాలనర్జిస్తూ వస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తే చూస్తూ ఊరుకో బోమని హెచ్చరించారు. రానున్న కాలంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.పెంటారావు, నరేంద్రకుమార్‌, కుమారి పాల్గొన్నారు.