Aug 07,2022 22:18

మాట్లాడుతున్న ఎవి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-నెల్లూరు : కార్మికులు, కర్షకులు తమ హక్కుల కోసం ఏళ్లతరబడి పోరాటం చేసి సాధించుకున్న చట్టాలను ఓ పథకం ప్రకారం కేంద్రం కాలరాస్తుందని ఎపి కాంట్రాక్టు అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ జెఎసి ఛైర్మన్‌ ఎవి నాగేశ్వరరావు విమర్శించారు. ఈ నేపథ్యంలో హక్కుల సాధనకు ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరముందని ఆదివారం నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో 'కార్మిక చట్టాల సవరణ- కార్మికులపై ప్రభావం' అన్న అంశంపై జిల్లా స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సిఐటియు అధ్యక్షులు టి.వి.వి. ప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా ఎవి నాగేశ్వరరావు హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి రెండు అనుకూలంగా ఓటింగ్‌ వేశాయన్నారు. కార్మికులకు నష్టం కలిగించడంలో తాము ఇద్దరం ఒకటేనని పార్లమెంట్‌ సాక్షిగా ఆ రెండు పార్టీలు నిరూపించుకున్నాయని విమర్శించారు. సుదీర్ఘ పోరాటాలు చేసి 44 కార్మిక చట్టాలను సాధించుకుంటే 4 కోడ్‌లుగా మార్చి వేసిందన్నారు. 1991లో అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు ప్రభుత్వం ఎగ్జిట్‌ పాలసీని తీసుకొచ్చిందని, అంటే దీని అర్ధం కార్మికులను ఎప్పుడు పడితే అప్పడు బయటకు సాగనంపేనందుకేనన్నారు. దీన్ని కార్మికవర్గం తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు. అనంతరం వాజ్‌పారు ప్రభుత్వం రెండో జాతీయ లేబర్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. దాని సిఫారస్సులు 300 మంది కార్మికులున్నా గానీ, ఆ సంస్థలను యాజమాన్యం నిరభ్యంతరంగా మూసివేయ వచ్చన్నారు. కార్మికులను విధుల నుంచి తొలగించేందుకు సిఫారస్సు చేసిందన్నారు. దానిని అమలు చేసేందుకు ఆ ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ కార్మికులు వ్యతిరేకించడంతో నిర్ణయాన్ని ఉపసంహరించుకుందన్నారు. 2014లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కార్మిక చట్టాల సవరణ చేసిందన్నారు. టిడిపి అనుకూలంగా వ్యవహరిస్తే , ప్రతిపక్ష పార్టీ స్థానంలో ఉన్న వైసిపి వ్యతిరేకించలేదన్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన బిజేపి ప్రభుత్వం కార్మికులకు నష్టదాయకమైన విధానాలను అమలు చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుందన్నారు. ఈ నేపథ్యలో ఈ నెల 14వ తేదీ వరకు పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు నిచ్చిందన్నారు. 14వ తేదిన నిర్వహించనున్న జనజాగరణ కార్యక్రమంలో కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అజరు కుమార్‌ మాట్లాడుతూ ఆగస్టు 8వ తేదీ నుండి 14 తేదీ అర్ధరాత్రి వరకు జన జాగరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. సిఐటియు జిల్లా నాయకులు ఎం మోహన్‌ రావు, జి శ్రీనివాసులు, కె పెంచల నరసయ్య, డి అన్నపూర్ణమ్మ, కట్టా సుబ్రహ్మణ్యం ,గడ్డం అంకయ్య పాల్గొన్నారు.