
న్యూఢిల్లీ : భారత ఇన్ఫర్మేషన్ టెక్నలాజీ (ఐటి) కంపెనీలు 2020 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అత్యంత అద్బుత ప్రదర్శనను కనబర్చాయి. దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టిసిఎస్ ఫలితాలు మార్కెట్ అంచనాలు మించగా.. రెండో అతిపెద్ద కంపెనీ ఇన్ఫోసిస్, మూడో దిగ్గజ సంస్థ విప్రో రెండంకెల వృద్థిని సాధించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020ా21) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ఇన్ఫోసిస్ ఏకంగా 16.60 శాతం వృద్థితో రూ.5,197 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.4,457 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ3లో కంఎనీ రెవెన్యూ 12.27 శాతం పెరిగి రూ.25,927 కోట్లకు చేరింది. ఈ కంపెనీ మొత్తం రెవెన్యూలో డిజిటల్ రెవెన్యూ 50 శాతానికి చేరింది. ఈ విభాగం రెవెన్యూలో 31.3 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. బుధవారం బిఎస్ఇలో ఇన్ఫోసిస్ షేర్ విలువ 15.85 శాతం పెరిగి రూ.1,387.70 వద్ద ముగిసింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) గత వారం ప్రకటించిన ఆర్థిక ఫలితాలు మార్కెట్ నిపుణుల అంచనాలను మించాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో టిసిఎస్ 7.18 శాతం వృద్థితో రూ.8,701 కోట్ల నికర లాభాలను సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.8,118 కోట్ల లాభాలు నమోదు చేసింది. కంపెనీ రెవెన్యూ 5.42 శాతం పెరిగి రూ.42,015 కోట్లకు చేరింది. ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్బంగా ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.6 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు నమోదు చేయడంతో ఆ కంపెనీ షేర్ నూతన రికార్డ్లను నమోదు చేసింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్‌కు చేరువలో టిసిఎస్ ఉంది. దాదాపుగా 11.7 లక్షల కోట్లకు చేరింది. బుధవారం సెషన్లో ఏకంగా రూ.12 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. రిలయన్స్ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.12.7 లక్షల కోట్లుగా ఉంది.
విప్రో డివిడెండ్ రూ.2
బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న విప్రో డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో 20.85 శాతం వృద్థితో రూ.2,968 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది క్యూ3లో రూ.2,455.9 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.15,470 కోట్ల రెవెన్యూ ఆర్జించగా.. క్రితం క్యూ3లో 1.28 శాతం పెరిగి రూ.15,670 కోట్లకు చేరింది. ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్బంగా విప్రో ప్రతీ రూ.1 ఈక్విటీ షేర్‌పై రూ.2 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి 2021 జనవరి 24ను రికార్డ్ తేదీగా తీసుకోనున్నారు. గురువారం బిఎస్ఇలో విప్రో షేర్ 0.23 శాతం పెరిగి రూ.458.75 వద్ద ముగిసింది.