Oct 13,2021 21:13

న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర హోం సహాయ మంత్రి అజ‌య్‌ కుమార్‌ మిశ్రాను తొలగించాలని, లఖింపూర్‌ ఖేరీ ఘటనపై ఇద్దరు సుప్రీం కోర్టు, లేదా హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తులతో స్వతంత్ర న్యాయవిచారణ జరిపించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కాంగ్రెస్‌ నేతల బృందం కోరింది.కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకó, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కేంద్ర మాజీ మంత్రులు ఎకె ఆంటోనీ, గులాం నబీ ఆజాద్‌లతో కూడిన బృందం బుధవారం రాష్ట్రపతిని కలసి ఈ మేరకు ఒక వినతి పత్రం అందజేసింది. అనంతరం రాష్ట్రపతి భవన్‌ వెలుపల రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. లఖింపూర్‌ హింసాత్మక ఘటనకు సంబంధించిన అన్ని వివరాలనూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అందజేసినట్టు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడి తండ్రి హోం శాఖ సహాయ మంత్రి అయినందున ఆయన పదవిలో ఉంటే, నిష్పాక్షిక దర్యాప్తు సాధ్యం కాదని, ఆ దృష్ట్యా ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరామన్నారు. సుప్రీం కోర్టుకు చెందిన ఇద్దరు సిట్టింగ్‌ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలనే మరో డిమాండ్‌ను కూడా రాష్ట్రపతి ముందు ఉంచినట్లు చెప్పారు. కేంద్ర మంత్రి అజరు మిశ్రా స్వయంగా తప్పుకోవాలి, లేదంటే ఆయనకు ప్రధాని ఉద్వాసన పలకాలి. నిందితులు అధికారంలో కొనసాగినంత కాలం లఖింపూర్‌ హింసాత్మక ఘటనలో బాధితులకు న్యాయం జరగదని రాహుల్‌ పేర్కొన్నారు.. లఖింపూర్‌ ఘటనపై ఈరోజే తాను ప్రభుత్వంతో మాట్లాడతానని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు.
లేఖలో ప్రధానాంశాలివే...
'లఖింపూర్‌ ఖేరీలో రైతులపై బిజెపి ప్రభుత్వం క్షమించరాని నేరానికి పాల్పడింది.ఈ ఘటన భారతదేశ ఆత్మకు మచ్చ తెచ్చింది. ఇది ఉద్దేశపూర్వక హత్య. నేరస్తులను న్యాయస్థానానికి తీసుకొచ్చే పనిలో ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా హరించివేసింది'' అని వినతి పత్రంలో పేర్కొన్నారు.
''కేంద్ర మంత్రి అజరు మిశ్రా ఇప్పటికే హత్యకేసులో నిందితుడిగా ఉన్నారు. జిల్లా కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించినప్పటికీ, అతని నిర్దోషత్వానికి వ్యతిరేకంగా 2004 నుండి ఒక క్రిమినల్‌ అప్పీల్‌ అలహాబాద్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.నమ్మశక్యం కాని విషయం ఏమిటంటే, 2018 మార్చి 12న హైకోర్టు క్రిమినల్‌ అప్పీల్‌లో తీర్పును రిజర్వ్‌ చేసింది. అప్పటి నుండి 3 సంవత్సరాల, 7 నెలలు గడిచాయి. కానీ తీర్పు వెలువరించలేదు.
''2021 నవంబర్‌ 26న మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ రోజున, బిజెపి సమావేశంలో కేంద్ర మంత్రి అజరు మిశ్రా రైతులను బహిరంగంగా బెదిరించాడు. అందుకు సంబంధించిన ప్రసంగం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులో ఉంది. కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రే ఇలా రెచ్చగొడితే, న్యాయం ఎలా జరుగుతుంది? అక్టోబర్‌ 3న శాంతియుతంగా ఆందోళన చేపట్టిన రైతులను వెనకనుంచి కేంద్ర మంత్రికి చెందిన రెండు వాహనాలతో తొక్కించారు. ఈ ఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మరణించారు. ఇది అత్యంత భయంకరమైన, ముందస్తు చర్య. కెమెరాలో చిక్కిన వీడియో ఉంది. ఆ వాహనాల్లో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి'' అని అందులో పేర్కొన్నారు. ''అయితే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం, పోలీసులు ఆశిష్‌ మిత్రాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి నిరాకరించారు. తరువాత నిందితులను అరెస్టు చేయడానికి నిరాకరించారు. '' అని తెలిపారు.
''నేర చరిత్ర, అధికార దుర్వినియోగం ఉన్నప్పటికీ అజరు మిశ్రా కేంద్ర హోం సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. యుపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌తో సహా బిజెపి నేతలందరూ ఆయన పట్ల రాజీ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి జోక్యం లేకుండా ఉండే అవకాశం లేదని స్పష్టం చేస్తుంది. మిశ్రా పాత్రపై ఇంకా విచారణ జరగాల్సి ఉంది. అతను పదవిలో కొనసాగుతుంటే ఇది అసంభవం. పోలీసు అధికారిపై అధిక ప్రభావం చూసే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండే వ్యక్తులు న్యాయంగా విచారించడానికి ధైర్యం చేస్తారా?'' అని పేర్కొన్నారు. ''ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాజ్యాంగ సంరక్షకుడిగా ఈ ఘటనపై జోక్యం చేసుకోవాలి. అందుకోసం కేంద్ర మంత్రిని తన పదవి నుంచి తొలగించాలి. సుప్రీం కోర్టు లేదా, హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులతో స్వతంత్ర విచారణ జరపాలి. ఈ విషయాన్ని పరిగణించి తగిన చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం'' అని పేర్కొన్నారు.