Mar 19,2023 22:49

కొత్తచెరువు మండలంలో నేలకొరిగిన అరటి

ప్రజాశక్తి - గాండ్లపెంట : నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికితోడు శనివారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి రైతులకు అపార నష్టం వాటిల్లింది. వడగండ్ల వర్షానికి మండల పరిధిలోని సోమయాజులపల్లి, వేపలకుంట, ఎర్రజేనుపల్లి, బోలు గుట్లవారిపల్లి, వంకపల్లి, మడుగు వారి గొంది, తూ పల్లి తదితర గ్రామాలలో బొప్పాయి, బూడిది గుమ్మడి, మామిడి, టమోటా, చామంతి, తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వేపల కుంట చెందిన కేశవరెడ్డి తన సొంత పదెకరాల పొలంలో బూడిది గుమ్మడి, మరో పది ఎకరాలు కౌలుకి తీసుకొని బొప్పాయి పంట సాగు చేశాడు. దాదాపు 24 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి పంట సాగు చేశాడు. శుక్రవారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి తీవ్ర నష్టం వాటిలిందని బాధితరైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే దాదాపు 15 మంది రైతులు చామంతి, మామిడి, టమోటా తదితర పంటలు సాగు చేశారు. శుక్రవారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి ఈ పంటలకు తీవ్ర నష్టం కలిగింది. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నాయకులు డిమాండ్‌ చేశారు.
కొత్తచెరువు : మండల పరిధిలోని పోతుల కుంట కొండప్ప గాని పల్లి తలమర్ల మీర్జాపురం కేసాపురం మైల్‌ సముద్రం గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురుగాలులు, వడగండ్ల వానతో రైతులు సాగు చేసిన పంటలు నేలకు ఒరిగాయి. మండల వ్యాప్తంగా 120 ఎకరాల్లో మామిడి, 150 ఎకరాల్లో మొక్కజొన్న 12 ఎకరాలు, టమోటా పది ఎకరాలు, 15 ఎకరాలు దోస, కలింగర 15 ఎకరాలో సాగు చేశారు. ఇవి కూడా శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి నేలకొరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
పెనుకొండ : అకాల వర్షానికి మండలంలో నష్టపోయిన పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి సురేంద్ర నాయక్‌ ఆదివారం పరిశీలించారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో పరిధిలో 131 మంది రైతులకు సంబంధించి 289 ఎకరాలలో మొక్కజొన్న పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించి పై అధికారులకు నివేదిక పంపినట్లు ఆయన చెప్పారు. ఆయా సంబంధిత రైతుభరోసా కేంద్రాల సిబ్బంది పంట నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించి పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులు సంబంధిత రైతు భరోసా కేంద్రాలలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్వవసాయ విస్తరణాధికారి అశోక్‌ కుమార్‌, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది శ్రీకాంత్‌ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.