Oct 11,2021 07:05

భూగోళమంతా గాలించినా
ఏ దయా హృదయమూ
అన్నంమెతుకై కురిసి ఉండదు
ఎర్రగా భగభగలాడిన పేగులు
కాళ్ళ మీద పడుంటాయి
కళ్ళను సముద్రాలను చేసుంటాయి

అందుకేబలం వస్త్రాన్ని విడిచి
బలహీనపడ్డ ముడతల కాయాన్ని
బతుకు దారుల గుండా నడిచి
అరిగిన శరీరాన్ని బతిమాలుతూ
ఆమె ఆకాశపు మెట్లెక్కింది

ఆమెకు కావలసినది
చిటారుకొమ్మకు పూసిన
తియ్యని మిఠాయిపొట్లం కాదు
లోపల ఎగసిపడే మంటలను
ఆర్పే గుప్పెడు ముద్ద

ద్ణుఖ పులుపును
నాలుకపై నానేసి
అరవై ఐదేళ్ళు నడిచిన ఆమె
ఇంత చేదు ఆకలిని
ఇటువంటి కఠిన కాలాన్ని
ఏనాడూ రుచి చూసి ఉండదు

కడుపు సెగలను తొక్కిపట్టి
ప్రాణాలను అరచేతిలో పొదువుకుని
కాస్తంత చింతచిగురు కోసం
క్రుంగిన జవసత్వాలను
కూడదీసుకున్న ఆమె
తనలాగే సగానికి పైగా
ఎండిన చెట్టు పైకి ఎగబాకింది
ఖాళీ గుడిసెలో చిల్లిగవ్వ లేక
ఆమె గంపెడు దిగులును
కొంగుకు ముడేసుకుంది

నరనరాల్లో నీరసించిన సత్తువ ఎదురు తిరిగినా
ఆమె ఎడారి పొట్ట కోసం
అంత కష్టానికి ఒడిగట్టింది

లాక్‌ డౌన్‌ ఉక్కుకౌగిలిలో నలిగి
నీరసించిన ఆమె
తనకు దొరికిన చిన్న అవకాశపు ఆలంబనను
ఆబగా అల్లుకుపోయింది

కాలు జారిన పొరపాటు
అమాంతం మింగేస్తుందని
అంత సుదీర్ఘజీవితనదిని ఈదిన
ఆమెకు తెలిసే ఉంటుంది
ఒకమారైనా ఆమె ఎవరికైనా
ఆ హెచ్చరికను జారీ చేసి ఉంటుంది

రోజుల తరబడి
దొరకని అన్నం ముద్దను
వీధివీధులలో ఒంటరిగా వెతుకుతూ
ఉడకేసుకోవడానికి
చిటికెడు ఆశల చిగురు కోసం
ఆమె చింతచెట్టెక్కింది

ఉన్నపళంగా
చిగురు ఉట్టికి ఎగిరిన ఆమె
పడుచు పంచదార చిలుక కాదు
చివరి అడుగు వద్దకు చేరినా
ఇసుమంతైనా తెగువ కోల్పోక
పోరాటధైర్యాన్ని మోస్తున్న పండు ముసలి

(కరోనా సమయంలో తినడానికి తిండి లేక చింతచిగురు కోసం చింతచెట్టు ఎక్కిన ముసలమ్మ గురించి చదివి ...)
- పద్మావతి రాంభక్త
99663 07777