May 14,2022 09:56

అమరావతి : ఆరణి నదిలో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డికి టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్లరామయ్య లేఖ రాశారు. లేఖలో ... రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను అక్రమంగా తవ్వి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. సత్యవేడు అసెంబ్లీలోని ఆరణి నదిలో విచ్చలవిడిగా అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారని, అక్రమంగా తవ్విన ఇసుక తమిళనాడుకు తరలిస్తున్నారని చెప్పారు. అక్రమ ఇసుక తవ్వకాలతో రాష్ట్రానికి ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా సహజ వనరులకు తీవ్రనష్టం వాటిల్లుతోందన్నారు. ఇసుకను ఏపీ లారీలల్లో లోడ్‌ చేసి వే బిల్లును సిద్ధం చేస్తారని, తర్వాత ట్రక్కు తమిళనాడులోకి రాగానే ఇసుక లోడును స్థానిక తమిళనాడు ట్రక్కులోకి మార్చి అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఒకే వేబిల్లుపై చాలాసార్లు ఇసుక అక్రమ రవాణ చేస్తున్నారని అన్నారు. స్థానిక వైసిపి నేతల అండదండలతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విచ్చలవిడి అక్రమ ఇసుక తవ్వకాలతో నది గమనంలో మార్పు రావడమే కాకుండా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయన్నారు. అరణి నది ఒడ్డున ఉన్న గ్రామాలకు తీవ్రమైన వరదల ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. భవిష్యత్‌ తరాలకు సహజవనరులను రక్షించాలంటే అక్రమ తవ్వకాలను తక్షణమే అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఇంత పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడం విస్మయం కలిగిస్తోందన్నారు. ఇసుక మాఫియాతో అధికారులు కుమ్మక్కయ్యారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోందని అన్నారు. పెద్దఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అరణి నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను తక్షణమే అరికట్టాలని, ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.