
- విద్యుత్‌శాఖ సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి
- అధికారులు మొక్కుబడిగా పనిచేస్తే కుదరదు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విద్యుత్ చోరీ, దుర్వినియోగం అంశాలపై ఉక్కుపాదం మోపాలని, అధికారులు మొక్కుబడిగా పనిచేస్తే కుదరదని విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ రంగంపై ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. విజిలెన్స్ విభాగం పటిష్టంగా ఉంటేనే చోరీలు, దుర్వినియోగం, నష్టాలను నియంత్రించగలుగుతామని వివరించారు. శాఖను గాడిలో పెట్టేందుకు, రైతులు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా పంపిణీలో నష్టాలను తగ్గించుకునేందుకు అధికారులు దృష్టి సారించాలని వివరించారు. గృహ వినియోగంతోపాటు, పారిశ్రామిక వినియోగంపైనా అధికారులు తనిఖీలు నిర్వహించాలని కోరారు. 2019-20లో విద్యుత్ సరఫరా పంపిణీలో 13.02 శాతం నష్టాలుంటే 2020-21 నాటికి వాటికి 9.83 శాతానికి తగ్గిందని అన్నారు. ఐఆర్‌డిఎ మీటర్లను బిగించడ, ఓవర్‌లోడ్ సెక్షన్లలో అదనంగా ఫీడ్లను ఏర్పాటు చేయడం, అదనపు లోడు డిమాండు ఉన్నచోట కొత్త డిపిఆర్‌లను ఏర్పాటు చేయడం, విద్యుత్ చౌర్యం అనుమానం ఉన్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికారులు ఇన్నోవేటివ్‌గా ఆలోలించాలని మొక్కుబడిగా పనిచేస్తే కుదరదని స్పష్టం చేశారు. విద్యుత్ అక్రమాలను అరికట్టేందుకు విజిలెన్స్ అధికారులతోపాటు జిల్లాలోని పోలీసు యంత్రాంగం సహకారం కూడా తీసుకోవాలని, అందుకోసం అవసరమైతే జిల్లా ఎస్పిలతో సంయుక్త సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యుత్ మీటర్లపై ప్రతిపక్షం రైతులను పక్కదోవ పట్టిస్తోందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఏటా రూ.పదివేల కోట్లను విద్యుత్ సంస్థలకు చెల్లిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, వాటికి అంతరాయం లేకుండా సరఫరా ఉండాలన్నారు. మీటర్ల వల్ల వ్యవసాయ విద్యుత్ ఎంత వినియోగం అవుతుందో నికరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మీటర్ల వల్ల సబ్సిడీ రూ.3,500 కోట్లు మిగులుతుందని, వీటిని సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తామని వివరించారు.