May 03,2021 20:52

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో
రాష్ట్రంలో కరోనాతో బాధపడుతున్న పేషెంట్లకు ఆక్సిజన్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఆయన సోమవారం లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి రెండో విడతలో చాలా వేగంగా విస్తరించడం, రోజువారీ కేసులు 20వేలు దాటుతుండటం తదితర అంశాలను లేఖలో ప్రస్తావించారు. రోగులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని దయనీయ పరిస్థితి నెలకొందని తెలిపారు. ఫలితంగా పేషెంట్లు రోడ్లుమీద, ఆసుపత్రుల ముందు బెడ్లు కోసం నిరీక్షిస్తున్నారని, బెడ్లు దొరికిన వారికి కూడా అవసరమైన మేరకు ఆక్సిజన్‌ అందుబాటులో ఉండటంలేదని తెలిపారు. దీంతో రోగులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత తీవ్రంగా ఆక్సిజన్‌ కొరత ఏర్పడడానికి కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని తెలిపారు. రాష్ట్రంలోని కరోనా తీవ్రతకు ఇది అద్దం పడుతోందని పేర్కొన్నారు. అవసరమైన ఆక్సిజన్‌ అందుబాటులో లేక రోగులు చనిపోతున్న వార్తలు చదవాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నారు. తక్షణమే అన్ని ఆసుపత్రుల్లోనూ రోగులకు సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు పెంచడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు. స్థానిక సంస్థలకు ఇటీవలే ఎన్నికలు జరిగి పాలకవర్గాలు ఏర్పాడ్డాయని, పాలకవర్గాలు గ్రామాలు, పట్టణాల్లో కరోనా విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా సోకిన బాధితులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా రోగులను ఆదుకోవడానికి స్థానిక సంస్థలు(పంచాయతీలు, మున్సిపాలిటీలు) ఆధ్వర్యంలో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కేంద్రాల నిర్వహణకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల సహకారం తీసుకోవాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.