May 01,2021 18:51

బిజినెస్‌ బ్యూరో : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో సినీ నటులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, పలువురు ప్రముఖులు తమకు తోచినవిధంగా ఏదోరకంగా సహాయం చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా.. ఆక్సిజన్‌ కొరత తీర్చడానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌మహీంద్ర కూడా సేవా కార్యక్రమాలకు పూనుకున్నారు. మే 1 శనివారం రోజున 'ఆక్సిజన్‌ వీల్స్‌' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ కార్యక్రమం మహారాష్ట్ర, మంబై, పూణె, చకన్‌, థానే, నాసిక్‌, నాగ్‌పూర్‌ వంటి నగరాల్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా... 13 ఆసుపత్రులకు 61 జంబో సిలిండర్లను మహీంద్రా వాహనాల్లో తరలించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కొన్ని నగరాలకే పరిమితం కాకుండా.. దేశవ్యాప్తంగా విస్తరించాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు.