Sep 14,2021 07:41

కొన్ని అక్షరాలు
ఆభరణాలు తగిలించుకుని
హడావిడి చేస్తుంటాయి
ప్రశంసల కోసం

కొన్ని అక్షరాలు
భజన, కీర్తనలను స్తుతిస్తూ
హంగామా చేస్తుంటాయి
ప్రముఖుల దృష్టి కోసం

కొన్ని అక్షరాలు
అత్తర్లు పూసుకుని
ముస్తాబవుతుంటాయి
పురస్కారాల కోసం

కొన్ని అక్షరాలు
వర్ణాలు అద్దుకుని
సిద్ధమవుతుంటాయి
శాలువాల కోసం

కొన్ని అక్షరాలు
సిజేరియన్‌ తో బైటకొచ్చి
సీతాకోక చిలుకల్లా
తళుకులు చూపుతుంటాయి

కొన్ని అక్షరాలు మాత్రం
ప్రసవ వేదనతో జనించి
మట్టివాసనతో పరిమళించి
సమ సమాజ స్థాపనకై
ఒంటరి పోరాటం చేస్తూనే ఉంటాయి.

- కయ్యూరు బాలసుబ్రమణ్యం,
సెల్‌: 7780277240