Apr 17,2021 20:53

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి -  అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌లో పోస్టింగ్‌లు కలిగిన అఖిల భారత సర్వీసులైన ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరు మదింపు నివేదికల (పెర్ఫార్మెన్స్‌ అప్రైజల్‌ రిపోర్ట్స్‌)పై తుది అధికారాన్ని ముఖ్యమంత్రికి దఖలు పరుస్తూ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చకు దారి తీసింది. ఇప్పటి వరకు ఎన్నడూ లేనిది ఇప్పుడే ఈ మార్పు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయనేదానిపై ప్రభుత్వంలో, అఖిల భారత సర్వీసు అధికారులలో ఆసక్తి, అసంతృప్తి, సంశయాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పెర్ఫార్మెన్స్‌ - రిపోర్టులకు సంబంధించి ఇప్పటి వరకు అమలులో ఉన్న బిజినెస్‌ రూల్స్‌ను సవరిస్తూ సాధారణ పరిపాలనా శాఖ (జిఎడి) ఈ నెల 10న జిఒఆర్‌టి నెం.726 జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్‌) ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు ఇచ్చారు. వాటి ప్రకారం అందరు అధికారుల పనితీరు నివేదికలు అంగీకరించే తుది అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. గవర్నర్‌ కార్యదర్శికి మాత్రం మినహాయింపు ఇచ్చారు.

సిఎస్‌ పాత్ర నామమాత్రం
అధికారుల పెర్ఫార్మెన్స్‌ రిపోర్టులను రహస్యంగా (కాన్ఫిడెన్షియల్‌) తయారు చేయడం మామూలే. నిర్ణయించిన కాలానికి లేక సంవత్సరానికోసారి రూపొందించే నివేదికల్లో మూడు దశలుంటాయి. మొదటిది రిపోర్టింగ్‌, రెండవది సమీక్ష, మూడవది అంగీకారం. ఇప్పటి వరకు అయితే ఒక నిర్దిష్ట ర్యాంక్‌ వరకు 'అంగీకరించే' అధికారం సిఎస్‌ది. ముఖ్య కార్యదర్శులు, అదనపు ముఖ్య కార్యదర్శుల పనితీరు మదింపు నివేదికలను 'అంగీకరించే' అధికారం మంత్రులకు ఉంది. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే 'అంగీకరించే' అధికారం ముఖ్యమంత్రికి ఉంది. కాని కొత్త నియమాల్లో పెర్ఫార్మెన్స్‌ నివేదికలపై సమీక్షించే అధికారం సిఎస్‌కు ఉంది. విభాగాధిపతులు 'రిపోర్టింగ్‌' అధారిటీ. సిఎస్‌తో సహా అందరు అధికారుల నివేదకల 'అంగీకరించే' అధికారం సిఎందే. భూపరిపాలనాశాఖ చీఫ్‌ కమిషనర్‌ (సిసిఎల్‌ఎ), స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలు, ప్రిన్సిపల్‌ సెక్రటరీల 'రిపోర్టింగ్‌' అధారిటీ సిఎస్‌. సమీక్షించే అధికారం సిఎస్‌కు లేదు. అంగీకరించేది సిఎం. ఐపిఎస్‌ కేడర్‌లో డిజిపి, హోం ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు రిపోర్టింగ్‌ అధారిటీ సిఎస్‌. అంగీకరించే అధికారం సిఎంది. సమీక్షించే అధికారం సిఎస్‌కు లేదు. ఐఎఫ్‌ఎస్‌ కేడర్‌లో ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ రిపోర్టింగ్‌ అధారిటీ సిఎస్‌. అంగీకరించే అధికారం సిఎంది. సమీక్షించే అధికారం సిఎస్‌కు లేదు.
 

డిఒపిటి ఏం చేస్తుంది?
అఖిల భారత సర్వీస్‌ అధికారుల వ్యవహారం మొత్తం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సిబ్బంది, శిక్షణ (డిఒపిటి) విభాగం కిందికొస్తుంది. డిఒపిటి అనుమతి లేకుండా అధికారుల సర్వీస్‌ రూల్స్‌లో రాష్ట్రం మార్పులు చేయడం చెల్లుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రం చేసిన మార్పులు చట్ట, న్యాయ పర సమీక్షలో నిలబడవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రం చేసిన సవరణలను డిఒపిటి వద్ద ఎవరైనా సవాల్‌ చేస్తే కొట్టేయడం ఖాయమంటున్నారు. ఇదిలా ఉండగా, ఎపి కేడర్‌లో ఆలిండియా సర్వీస్‌ అధికారులు రెవెన్యూ డివిజన్‌ స్థాయి నుంచి సిఎస్‌, డిజిపి, చీఫ్‌ కన్జర్వేటర్‌ వరకు ఉంటారు. వీరందరూ కలిపి కనీసం 300 మందికిపైనే ఉన్నారని, వారందరి పనితీరుపై, నిత్యం అత్యంత బిజీగా ఉండే ముఖ్యమంత్రి సమీక్షించడం సాధ్యం కాదని, అంత సమయం ఆయనకు ఉండదని కొంతమంది అధికారులు చెబుతున్నారు. సిఎంఒలో పని చేసే అధికారులే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు. అదే జరిగితే సీనియార్టీకి భిన్నంగా నిర్ణయాలు జరుగుతాయని అభ్యంతరపెడుతున్నారు. ఈ ప్రభావం అధికారుల దీర్ఘకాలిక క్రమానుగత కెరీర్‌ ప్రొటోకాల్స్‌పై పడుతుందని, భవిష్యత్తులో పదోన్నతులు, పోస్టింగ్‌లు, ఇతర సదుపాయాల విషయంలో ఇబ్బందులస్తాయని ఆవేదన చెందుతున్నారు. అధికారుల పనితీరు మదింపు నివేదికలపై తుది నిర్ణయం రాజకీయాధినేత చేతుల్లో ఉండటం వలన నచ్చని అధికారులను సాధించడానికి, అస్మదీయులను అందలం ఎక్కించడానికి అవకాశం ఉందని, అధికారుల అర్హతలకు విలువ ఉండదని కొంత మంది అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఈ విధంగా సర్వీస్‌ రూల్స్‌ మార్చలేదనేది అత్యధికుల మాట. కాగా ప్రజలకు సమర్ధవంతమైన సేవలందించేందుకే రూల్స్‌ను సవరించామని సర్కారు తన ఉత్తర్వుల్లో సమర్ధించుకుంది. పరిపాలనలో ఒకే విధమైన ఏర్పాటు, నియంత్రణ, నిర్ధారణల నివారణ కోసం మార్పులు చేశామంది.