Jul 03,2022 22:45

30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ
హాజరు కానున్న గవర్నర్‌, ముఖ్యమంత్రి, సినీ హీరో చిరంజీవి
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం
పోలీసు పహారాలో భీమవరం, ఎస్‌పిజి కనుసన్నల్లో పెదఅమిరం
వర్షం కురవడంతో అధికారుల ఉరుకులు, పరుగులు
ప్రజాశక్తి - భీమవరం

విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా 30 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణకు రంగం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోడీ స్థానిక ఎఎస్‌ఆర్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ప్రముఖ సినీ హీరో చిరంజీవి, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. సుమారు నెల రోజుల నుంచి అధికారులు ఈ సభ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. భీమవరం పట్టణ పరిసరాలన్నీ పోలీసు పహారాలో ఉంది. సుమారు నాలుగు వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు. ప్రధాన రహదారులు, కూడళ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ ప్రసంగించనున్న సభా ప్రాంగణం, పెదఅమిరం అంతా ఎస్‌పిజి కనుసన్నల్లో ఉంది. మోడీ పర్యటన ముగిసే వరకూ మూడంచెల భద్రత సాగనున్నట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఈ ప్రాంతంలో ఇతర వాహనాలకు ఎటువంటి అనుమతులూ లేవు. ఇక గ్రామస్తులు బయటకు రావడానికి ఆధార్‌ కార్డు చూపిస్తేనే అనుమతి ఇస్తున్నారు. సభా ప్రాంగణానికి, విగ్రహం ఆవిష్కరణ ప్రాంతంతోపాటు ఇటు వచ్చే అన్ని మార్గాల్లో పూర్తిగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. జక్కరం నుంచి ఎస్‌ఆర్‌కెఆర్‌ కళాశాల అడ్డ వంతెన, బివి.రాజు విగ్రహం వరకు ఉన్న రహదారులన్నీ పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. బాంబుస్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌లు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తుండగా ఎస్‌పిజి పోలీసులు నిశితంగా పరిశీలిస్తూ ఆ ప్రాంతమంతా పర్యవేక్షిస్తున్నారు.
16 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాటు
భీమవరం సమీపాన ఉన్న కాళ్ల మండలం పెదఅమిరంలో ప్రధాని మోడీ సభను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో భారీ వేదికను సిద్ధం చేశారు. సుమారు 70 వేల మంది కూర్చేనందుకు వీలుగా ఏర్పాట్లు చేసి టెంట్లను వేశారు. వేదికపై నేతలు చేసే ప్రసంగాలను వీక్షించేందుకు ప్రత్యేక గ్యాలరీలతోపాటు భీమవరం పట్టణ పరిసరాల్లో ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించారు. వివిఐపి, విఐపిల కోసం ప్రత్యేక గ్యాలరీలను సిద్ధం చేశారు.
భారీ జన సమీకరణ... 8 వేల బస్సుల ఏర్పాటు
ప్రధాని సభకు ప్రజలను తీసుకొచ్చేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు క్షత్రియ సేవాసమితి సంయుక్తంగా ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి బస్సులను ఏర్పాటు చేసింది. వీటితో పాటు పలు విద్యా సంస్థలు, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ కు చెందిన మరో ఏడు వేల బస్సులను అల్లూరి సీతారామరాజు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెయ్యి బస్సుల్లో సుమారు 45 వేల మందిని తరలించేందుకు చర్యలు చేపట్టారు. కోనసీమ నుంచి మరో రెండు వేల వాహనాలతోపాటు ప్రాంతాల నుంచి వేలాది వాహనాల్లో ప్రజలు తరలిరానున్నారు. కృష్ణా, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలతోపాటు హైదరాబాద్‌, చిత్తూరు, బెంగళూరు, చెన్నరు, ఢిల్లీ నగరాల నుంచి ప్రజలు రానున్నారు. అమెరికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రముఖులు రానున్నట్లు క్షత్రియ సేవా సమితి సభ్యులు, అల్లూరి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు.
పట్టణంలో ట్రాఫిక్‌ ఆంక్షలు
ప్రధాని ప్రసంగించే పెదఅమిరం సభాస్థలి సమీప ప్రాంతమంతా కేంద్ర భద్రతా బలగాల కనుసన్నల్లోనే ఉంది. ఈ ప్రాంతంలో ఆదివారం భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు. పట్టణంలో సోమవారం ఉదయం నుంచి నరేంద్ర మోడీ పర్యటన ముగిసే వరకూ పూర్తి ట్రాఫిక్‌ ఆంక్షలను జిల్లా పోలీసు అధికార యంత్రాంగం విధించింది. డాక్టర్‌ బివి.రాజు విగ్రహం నుంచి గోకరాజు గంగరాజు స్థలం నుంచి వేగేశ్న ఫౌండేషన్‌ ప్రాంగణం వరకు వాహనాల రాకపోకలకు సంబంధించి ఆంక్షలు విధించారు. రహదారుల పక్కన ఎలాంటి వాహనాలూ నిలపకూడదనే నిబంధనలు పెట్టారు. బివి.రాజు విగ్రహం నుంచి జడ్డు బ్రహ్మాజీ కల్యాణ మండపం పెదఅమిరం వైపు వెళ్లే మార్గాల్లో వాహనాలు వ్యతిరేక దిశలో అనుమతించబోమని పోలీసులు ప్రకటించారు.
ఒకటిన్నర కిలోమీటర్‌ దూరంలో హెలీప్యాడ్‌లు ఏర్పాటు
సభా ప్రాంగణం నుంచి ఒకటిన్నర కిలోమీటర్‌ దూ రంలో నాలుగు హెలీప్యాడ్లను ఏర్పాటు చేశారు. గోక రాజు గంగరాజు ఖాళీ స్థలాల్లో వీటిని ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి ప్రధాని మోడీ, ముఖ్య మంత్రి జగన్‌, గవర్నర్‌ విశ్వభూషణ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లలో ఇక్కడకు చేరుకుంటారు.
ఉరుకులు.. పరుగులు
నెల రోజుల నుంచి అల్లూరి జయంతి వేడుకలు, ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు బిజీబిజీగా ఉన్నారు. ఒకపక్కన ఏర్పాట్లు చూసుకుంటూనే మరోపక్క ఈ ప్రాంతాల పరిశీలనకు వచ్చిన మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు ఏర్పాట్లపై నిర్వహించే సమీక్షా సమావేశాల్లో పాల్గొని ఆ నిర్ణయాల ప్రకారం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. అయితే శనివారం రాత్రి నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. సభా ప్రాంగణమంతా వర్షపు నీటితో నిండిపోయింది. ఈ నేపథ్యంలో దాన్ని బయటకు తోడారు. ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టెంట్లు నేలమట్టమయ్యాయి. భారీ హోర్డింగులు, బ్యానర్లు సైతం గాలికి ఎగిరి విరిగిపడ్డాయి. నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లను యుద్దప్రాతిపదికన ప్రారంభించింది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.